


Best Web Hosting Provider In India 2024
NTR Bharosa : పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు.. ఇక నుంచి ఉదయం 7 గంటలకే ప్రారంభం!
NTR Bharosa : పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. పెన్షన్‌దారుల సంతృప్తిని పెంచడం కోసం.. 20 సెకన్ల ఆడియో సందేశం వినిపించాలని అధికారులకు సూచించింది.
రాష్ట్రంలో ప్రతినెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ వస్తోంది. అయితే గత ప్రభుత్వం హయంలో వాలంటీర్లు పంపిణీ చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వాలంటీర్లను తొలగించింది. సచివాలయ ఉద్యోగులు, కూటమి పార్టీల నేతలు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.
ఇవీ లెక్కలు..
రాష్ట్రంలో ప్రస్తుతం 63,34,732 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధుల పెన్షనర్లు ఉన్నారు. వీరులో మొత్తం 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్లను పొందుతున్నారు. వీరిలో దివ్యాంగ పెన్షనర్లు 7,87,976 మంది కాగా.. దీర్ఘకాలిక వ్యాధుల పెన్షనర్లు 30,924 మంది ఉన్నారు. మిగిలిన 55,15,832 మంది వృద్ధాప్య, వితంతు పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతినెల ఒకటో తేదీన పెన్షన్ అందజేస్తున్నారు.
పంపిణీలో మార్పులు..
ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్న పెన్షన్ల పంపిణీ సమయానికి సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అధికారుల ఒత్తిడితో చాలా మంది తెల్లవారుజామున 4 గంటల నుంచే పంపిణీ చేస్తుండగా.. ఉద్యోగులతో పాటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ సమయానికే యాప్ పని చేసేలా మార్పులు చేసింది.
ప్రభుత్వం ఆదేశాలు..
ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్య నిర్వాహణ అధికారి కరుణ వాకాటి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు, అన్ని గ్రామ/వార్డు సచివాలయాలకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ప్రచార విధానంలోకి చేర్చింది. పింఛన్ల పంపిణీలో నాణ్యతను, పింఛనుదారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి మొబైల్ అప్లికేషన్లో మార్పులు చేసింది.
రెండు జిల్లాల్లో..
పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్లో ఆడియో సందేశం (20 సెకన్లు) చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ప్రవేశపెట్టారు. పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పుడు, అధికారులు వృద్ధ పింఛనుదారులకు నమస్కారాలు తెలియజేయాలి. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీకి సంబంధించిన మార్పులు చేసింది. పింఛనుదారుల ఇంటి దగ్గర నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ జరిగినప్పుడు.. పింఛనుదారుల ఇంటి నుండి పంపిణీ చేసే ప్రదేశం మధ్య దూరం మొబైల్ అప్లికేషన్లో చూపించాలి.
యాప్‌లో మార్పులు..
పెన్షన్ పంపిణీ చేసే అధికారులు 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తే.. కారణాలను మొబైల్ అప్లికేషన్లో నమోదు చేయాలి. అధికారులు ఈ సూచనలను పాటించి.. పింఛనుదారులకు అత్యంత సంతృప్తికరంగా పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పెన్షనర్ ఇంటి నుండి 300 మీటర్లు దాటి పంపిణీ చేస్తున్నట్టయితే పలు ఆప్షన్లు కనిపించనున్నాయి. పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఈ ఆప్షన్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆప్షన్లు ఇవీ..
1. ఆసుపత్రిలో చేరారు.
2. వృద్ధాశ్రమంలో ఉన్నారు.
3. ఇతర సచివాలయం నుండి బదిలీ అయ్యారు.
4. పాఠశాల/కళాశాలలో ఉన్న వికలాంగ విద్యార్థి
5. పెన్షనర్ సచివాలయ లొకేషన్ వద్దకు వచ్చారు
6. పెన్షనర్ ఇంట్లో సిగ్నల్ సమస్య ఉంది
7. ఉపాధి హామీ పని ప్రదేశం.
8. బంధువుల ఇంట్లో నివసిస్తున్న పెన్షనర్.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్