


Best Web Hosting Provider In India 2024
AP BC Hostels : బీసీ హాస్టల్స్ విద్యార్థులకు ఫేస్ ఆధారిత హాజరు.. ఉదయం, సాయంత్రం అటెండెన్స్ తప్పదు!
AP BC Hostels : రాష్ట్రంలో బీసీ హాస్టల్స్‌లో విద్యార్థిని, విద్యార్థులకు ఫేస్ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు హాజరు వేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మార్చి 1 నుంచే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థిని, విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ విధానం (ఎఫ్ఆర్ఎస్) పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు రెండు హాస్టళ్లను ఎంపిక చేసి.. పరిశీలించారు. రాష్ట్రంలో 1,100 బీసీ సంక్షేమ హాస్టల్స్ ఉండగా.. అందులో 52 హాస్టల్స్‌లో ఎఫ్ఆర్ఎస్ అమలుపై ప్రయోగం చేశారు.
పూర్తి సమాచారం కోసం..
ప్రీమెట్రిక్ హాస్టళ్లు, కాలేజీ విద్యార్థులు ఉండే హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో చదువే విద్యార్థులు ఉన్న వసతి గృహాల్లో ఫేస్ రికగ్నిషన్ అమలు చేయనున్నారు. ప్రతి రోజు ఉదయం ప్రతిజ్ఞ, సాయంత్రం స్కూల్ సమయం తరువాత ఎఫ్ఆర్ఎస్‌లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏయే హాస్టల్స్‌లో ఏ రోజు ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? మిగిలిన వాళ్లు ఎందుకు రాలేదు? తదితర హాస్టల్‌లో విద్యార్థుల హాజరు సంబంధిత సమాచారం స్పష్టం అవుతుంది.
యాప్ ద్వారా..
ఎఫ్ఆర్ఎస్ అమలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను ఆయా వసతి గృహాలకు చెందిన హాస్టల్ వార్డెన్‌లకు అప్పగించారు. ఎంపిక చేసిన ప్రతి హాస్టల్‌కు చెందిన విద్యార్థుల ఫోటోలు తీసి, ఆధార్, ఫోన్ నెంబర్, చిరునామా, తరగతి తదితర వివరాలను ఆయా యాప్‌ల్లో అప్‌లోడ్ చేస్తారు. దీంతో యాప్ ఉన్న మొబైల్ ఫోన్, పరికరాల్లోనూ విద్యార్థి ముఖం చూపిస్తే హాజరు పడుతుంది.
ఆస్కారం లేదు..
ప్రస్తుతం హాస్టల్స్‌లో విద్యార్థుల హాజరును ఇప్పటి వరకు మాన్యువల్ విధానంలో నమోదు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల హాజరు విషయంలో అవకతవకలు చేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవకతవకలు, మామూళ్లు వసూలు చేయడం వంటి అంశాలపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఎస్ విధానంలో విద్యార్థుల హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
సమస్యలివే..
దీనివల్ల ఇంటర్‌నెట్ సదుపాయం, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడతామని హాస్టల్ వార్డెన్లు చెబుతున్నారు. ఎఫ్ఆర్ఎస్ పని చేయకుంటే ఆ రోజు విద్యార్థులు గైర్జాజరుగా భావించాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యార్థుల అందరి హాజరు తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని, దీంతో విద్యార్థులు స్కూల్, కాలేజీలకు వెళ్లడానికి ఆలస్యం అవుతుందని అంటున్నారు.
రేపటి నుంచే..
సాంకేతిక సమస్య తలెత్తితే.. ఆ రోజు విద్యార్థులు, వార్డెన్, హాస్టల్ సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొవల్సి ఉంటుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని, ఈలోపు ఆ విధానంపై అవగాహన పెంచాలని కోరుతున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం మార్చి 1 నుంచే అమలు చేయాలని స్పష్టం చేసింది. దీంతో శనివారం నుంచి హాస్టల్ వార్డెన్ల మొబైల్స్‌లో ఎఫ్ఆర్ఎస్ విధానంలో విద్యార్థుల హాజరు తీసుకోనున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్