



Best Web Hosting Provider In India 2024

SagguBiyyam Halwa: టేస్టీ సగ్గుబియ్యం హల్వా ఒక్కసారి తిన్నారంటే మరిచిపోలేరు
SagguBiyyam Halwa: సగ్గు బియ్యంతో చేసే వంటకాలు ఆరోగ్యానికి మంచివి. పైగా ఇవి రుచిగా కూడా ఉంటాయి. ఇక్కడ మేము సగ్గుబియ్యం హల్వా రెసిపీ ఇచ్చాము. దీన్ని బందర్ హల్వా అని కూడా పిలుస్తారు. రెసిపీ తెలుసుకోండి.
సగ్గుబియ్యంతో చేసే వంటకాలు చాలా తక్కువ మందికే తెలుసు. ఇక్కడ మేము సగ్గుబియ్యంతో టేస్టీ స్వీట్ ఎలా చేయాలో చెప్పాము. ఈ సగ్గుబియ్యం హల్వాను ఒక్కసారి చేసి చూడండి. దీన్ని పండగల సమయంలో నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. దీన్ని బందరు హల్వా అని కూడా పిలుచుకుంటారు. ఒక్కసారి చేశారంటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. సగ్గుబియ్యం హల్వా రెసిపీ తెలుసుకోండి.
సగ్గుబియ్యం హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం – ఒక కప్పు
బాదం పప్పులు – గుప్పెడు
జీడిపప్పులు – గుప్పెడు
పిస్తా – గుప్పెడు
నెయ్యి – మూడు స్పూన్లు
బెల్లం తురుము – ముప్పావు కప్పు
యాలకుల పొడి – అర స్పూను
సగ్గుబియ్యం హల్వా రెసిపీ
1. సగ్గుబియ్యం హల్వా చేసేందుకు సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు నానిన సగ్గుబియ్యం మిక్సీలో వేసి మెత్తగా దోశల పిండి లాగా రుబ్బుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేయాలి.
4. ఆ నెయ్యిలో సన్నగా తరిగిన బాదం పప్పులు, జీడిపప్పు, పిస్తా పప్పులు వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
5. మిగిలిన నెయ్యిలో రుబ్బుకున్న సగ్గుబియ్యం పేస్ట్ ను వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
6. ఒక స్పూను నెయ్యిని కూడా వేసి బాగా కలపాలి.
7. ఇప్పుడు బెల్లం తురుమును అందులో వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
8. దీన్ని చిన్న మంట మీదే చేయాలి లేకుంటే త్వరగా అడుగు అంటుకుపోయే అవకాశం ఉంటుంది.
9. బెల్లం సగ్గుబియ్యం మిశ్రమంలో బాగా కరిగిపోయేలాగా కలుపుకోవాలి.
10. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తాలను, యాలకుల పొడిని కూడా అందులో వేసి బాగా కలపాలి.
11. ఇది కలాయికి అతుక్కోకుండా విడిగా వచ్చేస్తుంది.
12. అలా వచ్చేస్తున్నప్పుడే హల్వా కూడా గట్టిగా మందంగా దగ్గరగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి.
13. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి సర్వ్ చేసుకోవాలి.
14. అంతే టేస్టీ సగ్గుబియ్యం హల్వా రెడీ అయినట్టే.
15. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనిలో బెల్లం వేసాం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు.
సగ్గుబియ్యం హల్వా తయారు చేసేందుకు మనం ఆరోగ్యకరమైన ఆహారాలనే వినియోగించాము. ఇందులో వేసిన జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తాలు, సగ్గుబియ్యం, బెల్లం, యాలకుల పొడి అన్ని ఆరోగ్యానికి మేలే చేస్తాయి. దీని పూర్తిగా నెయ్యితో తయారు చేశాం కాబట్టి ఘుమఘుమలాడేలా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో సగ్గుబియ్యం హల్వా ఒకసారి చేసి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
సంబంధిత కథనం