


Best Web Hosting Provider In India 2024
AP Budget 2025 : బడ్జెట్ అంటే లాటరీనా..? సూపర్ సిక్స్‌లో ఒక్క పథకం కూడా చేతికి రాలేదు : బుగ్గన
AP Budget 2025 : కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీనిపై వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. తాజాగా మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంటే లాటరీనా..? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకం కూడా చేతికి రాలేదని విమర్శలు గుప్పించారు.
ఎన్నికల సమయంలో అనేక తప్పుడు హామీలు ఇచ్చారు.. కూటమి తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మారని.. మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. వాగ్దానాల మేరకు కూటమి ప్రభుత్వం పాలన చేయడం లేదన్నారు. ప్రజలను ఆశపెట్టి, మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని మోసం చేశారన్న బుగ్గన.. గత ప్రభుత్వం అని బడ్జెట్ ప్రసంగంలో 35 సార్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు.
ఆశ్చర్యంగా ఉంది..
‘బడ్జెట్ అంటే లాటరీనా..? బడ్జెట్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.? కాగ్ కరెక్టా.? కూటమి నేతలు చెప్పాలి. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ సర్కస్ చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకం కూడా చేతికి రాలేదు. చంద్రబాబు చాణుక్యుడి అట. చాణుక్యుడి చెప్పిన మాటలకు కూటమి పాలనకు ఎంతో తేడా ఉంది. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. అప్పులపై కూడా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. మేము చేసిన అప్పు దాదాపు రూ.4 లక్షల కోట్లు. దీనికే శ్రీలంక, కంబోడియా అని తప్పుడు ప్రచారం చేశారు’ అని బుగ్గన ఫైర్ అయ్యారు.
సూపర్ సిక్స్ ఎక్కడ..
‘బడ్జెట్లో సూపర్ సిక్స్ ఎక్కడుంది.? పోయిన బడ్జెట్ లో 63 పేరాలుంటే.. రెండు పేరాలు మాత్రమే సూపర్ సిక్స్‌కు ఇచ్చారు. స్థూల ఉత్పత్తిపై కూటమి ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెప్పింది. మాములు మనిషికి, వికలాంగుడికి పోటీ పెట్టి మేం గెలిచామని కూటమి అంటే ఎలా.? పేదరికం నిర్మూలన అనేది పాలకుల బాధ్యత కానీ.. కూటమి గాలికొదిలేసింది. పూరెస్ట్ ఆఫ్ పూర్‌కు ఎంత చేసినా తక్కువే. ఇది వైఎస్ఆర్ సిద్ధాంతం. కూటమి పానలపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. కూటమి హామీలు నమ్మి ప్రజలు విపరీతమైన అప్పులు చేశారు’ అని మాజీ ఆర్థిక మంత్రి విమర్శించారు.
ఎందుకు పొగిడారో..
‘గత ప్రభుత్వాన్ని దూషిస్తూ.. సీఎం, ఆయన కుమారుడిని ప్రశంసలతో ముంచెత్తారు. కూటమి ప్రభుత్వం తాజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. చట్టసభల్లో సభ్యుడుగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఎప్పుడూ ఇలా పొగడ్తలతో బడ్జెట్‌ను ముంచేయడం చూడలేదు. ఇటువంటి సంప్రదాయం కొత్తగా ఉంది. బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు ఇన్నిసార్లు చంద్రబాబు, లోకేష్‌లను పొగిడారో అర్థం కాలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై కేటాయింపులు ఎక్కడా లేవు. ప్రభుత్వం ప్రజలను మళ్లి మోసం చేసింది’ అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
నిరాశకు గురిచేసింది..
‘రాష్ట్ర బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారు. గత బడ్జెట్ లోనూ దారుణంగా ప్రజలను మోసం చేశారు. పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ లో అయినా హమీల అమలుకు కేటాయింపులు చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారు. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్. మహిళలకు సూపర్ సిక్స్ లో పెద్దపీట వేస్తున్నామని హామీలు ఇచ్చారు. కానీ నేడు బడ్జెట్ లో వాటికి సంబంధించిన కేటాయింపులు కనిపించడం లేదు. మేనిఫేస్టోలో పెట్టిన ఏ అంశాన్ని అమలు చేసే పరిస్థితి లేదు’ అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు.
టాపిక్