Pakistan Cricket: మీ జట్టు కంటే అఫ్గాన్ ఎక్కువ గెలిచింది: పాకిస్థాన్ టీవీ షోలో ఆ దేశ మాజీ కెప్టెన్‍కు అజయ్ జడేజా చురక

Best Web Hosting Provider In India 2024


Pakistan Cricket: మీ జట్టు కంటే అఫ్గాన్ ఎక్కువ గెలిచింది: పాకిస్థాన్ టీవీ షోలో ఆ దేశ మాజీ కెప్టెన్‍కు అజయ్ జడేజా చురక

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 28, 2025 01:18 PM IST

Pakistan Cricket: ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలో వైదొలిగి చతికిలపడింది పాకిస్థాన్. ఈ సందర్భంగా ఆ దేశ మాజీ కెప్టెన్‍కు చురకలు అంటించారు భారత మాజీ ప్లేయర్ అజయ్ జడేజా. ఆ దేశ టీవీ షోలోనే కామెంట్లు చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు (AFP)

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‍కు ఘోర పరాభవం ఎదురైంది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలువకుండా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. వాన వల్ల బంగ్లాదేశ్‍తో మ్యాచ్ రద్దవటంతో ఒక్క పాయింట్ మాత్రమే సాధించింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడింది. మరోవైపు, అఫ్గానిస్థాన్ మాత్రం సంచలనం సృష్టించింది. ఇంగ్లండ్‍ను ఓడించి సెమీస్ రేసులో ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ టీవీ ఛానెల్ షో ‘డ్రెస్సింగ్ రూమ్’లో చర్చ జరిగింది. తన తదుపరి మ్యాచ్‍లో ఆస్ట్రేలియాను ఓడించి అఫ్గానిస్థాన్ సెమీఫైనల్ చేరగలదా అనే ప్రశ్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్‍కు ఎదురైంది.

ఇంగ్లండ్‍తో మ్యాచ్‍లో అఫ్గానిస్థాన్ అద్భుతంగా ఆడి గెలిచిందని వకార్ యూనిస్ అన్నారు. కానీ అఫ్గాన్‍పై ఆస్ట్రేలియా ఏకపక్షంగా గెలిచే అవకాశం కూడా ఉందని చెప్పారు. అయితే, అఫ్గాన్ జోరు కొనసాగిస్తే ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలదని అన్నారు. మొత్తంగా ఆస్ట్రేలియాపై అఫ్గాన్ విజయం కష్టమేనేలా మాట్లాడారు.

పాక్ కంటే అఫ్గాన్ ఎక్కువ గెలిచింది

ఇదే చర్చలో భారత మాజీ ప్లేయర్ అజయ్ జడేజా కూడా పాల్గొన్నారు. గత మూడు ఐసీసీ ఈవెంట్లలో పాకిస్థాన్ కంటే అఫ్గాన్ ఎక్కువ మ్యాచ్‍లు గెలిచిందని వకార్ యూనిస్‍కు జడేజా చురకలు అంటించారు. “మై ఫ్రెండ్.. మీ జట్టు (పాకిస్థాన్) కంటే వాళ్లు (అఫ్గానిస్థాన్).. ఐసీసీ ఈవెంట్లలో ఎక్కువగా గెలిచారు. ఏదో ఒకసారి జరిగిన విషయంగా దాన్ని ఎవరైనా చూస్తే వాళ్లను వాళ్లు తప్పుదోవ పట్టించుకున్నట్టే” అని జడేజా అన్నారు. అఫ్గాన్ అద్భుత ప్రదర్శన ఏదో అలా కలిసివచ్చిన విషయం కాదనేలా చెప్పారు.

అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్-బీ మ్యాచ్ శుక్రవారం (ఫిబ్రవరి 28) జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది.

పాక్ కంటే అఫ్గాన్ ఎక్కువ విజయాలు

గత మూడు ఐసీసీ ఈవెంట్లలో అఫ్గానిస్థాన్ 10 మ్యాచ్‍లు గెలిచింది. గతేడాది టీ20 ప్రపంచకప్‍లో ఐదు మ్యాచ్‍ల్లో విజయం సాధించి.. సెమీస్ చేరి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను కూడా ఓడించింది. 2023 వన్డే ప్రపంచకప్‍లో తొమ్మిది మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచింది. కాస్తలో సెమీస్ అవకాశాన్ని మిస్ చేసుకుంది. ప్రస్తుత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోలో ఓ మ్యాచ్ గెలిచింది.

మరోవైపు, పాకిస్థాన్ గత మూడు ఐసీసీ ఈవెంట్లలో కేవలం ఆరు మ్యాచ్‍ల్లోనే విజయం సాధించింది. ఒక్కసారి కూడా గ్రూప్ దశ దాటలేక తీవ్రంగా విఫలమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీకి అతిథ్య జట్టుగా ఉండి.. గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.

2023 వన్డే ప్రపంచకప్‍లో అఫ్గానిస్థాన్ జట్టుకు కన్సల్టెంట్‍లా చేశారు అజయ్ జడేజా. ఏ స్థితిలో ఉన్నా మ్యాచ్ గెలువగలమని ఆ జట్టు ఆటగాళ్లు అనుకుంటారని, ఇటీవలే కాలంలో అదే చాలా ప్లస్‍గా మారిందని తెలిపారు. ఐసీసీ టోర్నీల్లో దాన్ని అఫ్గాన్ చూపిస్తోందని అన్నారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో భారత్ ఇప్పటికే సెమీస్ చేరుకుంది. గ్రూప్-ఏలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‍పై గెలిచింది. న్యూజిలాండ్‍తో చివరి గ్రూప్ మ్యాచ్‍లో మార్చి 3న తలపడనుంది. ఈ టోర్నీలో తన మ్యాచ్‍లను దుబాయ్ వేదికగా ఆడుతోంది టీమిండియా. మిగిలిన వేరే మ్యాచ్‍లు పాకిస్థాన్‍లో జరుగుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link