


Best Web Hosting Provider In India 2024
Srikakulam Army Soldier: తుపాకీ పేలి జమ్మూ కశ్మీర్లో శ్రీకాకుళం జవాను మృతి, స్వగ్రామంలోఅంత్య క్రియలు
Srikakulam Army Soldier: జమ్మూకశ్మీర్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందాడు.సర్వీస్ రైఫిల్ నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని అమలపాడు గ్రామానికి చెందిన తిరుపతిరావు ప్రాణాలు కోల్పోయాడు.
Srikakulam Army Soldier: జమ్మూకాశ్మీర్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందారు. తన సర్వీస్ రైఫిల్ నుండి బుల్లెట్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ నుంచి ఆర్మీ జవాన్ పార్దీవదేహాన్ని గురువారం స్వగ్రామానికి చేరుకుంది. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని అమలపాడు గ్రామానికి చెందిన బచ్చల వెంకటరావు, కామేశ్వరి దంపతలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు గోవింద గ్రామంలోనే నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు తిరుపతి రావు (26) 2017లో ఆర్మీలో చేరాడు. తండ్రి వెంకటరావు సైతం బీఎస్ఎఫ్లో జవాన్‌గా విధులు నిర్వహించారు. తిరుపతి రావుకు ఇటీవలే గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. అంత బాగానే ఉందనుకున్న సమయంలో ఇలాంటి చేతు వార్తా ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.
జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాల్లో కమల్ కోట్ సెక్టార్‌లోని 8 ఆర్ఆర్ మద్రాస్ రెజిమెంట్ తరపున ఎల్వోసీ వద్ద తిరుపతి రావు జవాను విధులు నిర్వహిస్తుండగా ఈనెల 5 గన్ పేలిన శబ్దం వినిపించింది. దీంతో వెంటనే ఆర్మీ అధికారులు వెళ్లి పరిశీలించారు. తిరుపతిరావు అక్కడే పడి ఉన్నాడు. పక్కనే ఏకే-47 గన్ ఉంది. దీంతో వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. అమలపాడు గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి కావల్సిన కుమారుడు మృతి చెందాడన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. గురువారం కాశ్మీర్ నుంచి భౌతికకాయం స్వగ్రామానికి చేరుకుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
అప్పులు ఎక్కువైపోవడం, వచ్చిన జీతం మిగలకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌లు కూడా కారణం కావచ్చని మరికొందరు చెబుతున్నారు. ఇల్లు నిర్మించి పెళ్లి చేసుకుంటానని తిరుపతిరావు చెప్పేవాడని, అందుకు కొంతమేర అప్పలు చేశారని, అయితే వివిధ కారణాలతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపారు. ఏది ఏమైనా తిరుపతిరావు మరణం ఆ కుటుంబానికి తీరనిలోటని అంటున్నారు.
తిరుమపతి రావు మరణంపై స్పందించిన ఆర్మీ అధికారులు కమల్‌కోట్ సెక్టార్‌లోని ఒక ఫార్వర్డ్ లోకేషన్లో తుపాకీ గాయాలతో ఆర్మీ జవాన్ మరణించాడని తెలిపారు. మరణించిన జవాన్ సర్వీస్ రైఫిల్ నుండి బుల్లెట్ పేలిందని, అతని మరణానికి ఖచ్చితమైన పరిస్థితులను నిర్ధారించలేదని అన్నారు. ఇది ఆత్మహత్య కారణంగా జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్