




Best Web Hosting Provider In India 2024

Warangal MGM : వరంగల్ ఎంజీఎంలో పేలిన ఆక్సిజన్ సిలిండర్ – తప్పిన పెను ప్రమాదం…!
వరంగల్ ఎంజీఎంలో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో స్వీపర్ కు గాయాలయ్యాయి. పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న వాల్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పక్కనే మరికొన్ని సిలిండర్లు ఉండగా.. అవి లీకైతే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఎంజీఎం సిబ్బంది పేర్కొంటున్నారు.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఘోర ప్రమాదం తప్పింది. వార్డులోని ఆక్సిజన్ సిలిండర్ పేలగా.. ఓ స్వీపర్ కు గాయాలయ్యాయి. దీంతో ఆమెను హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డులో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….
ఎంజీఎం హాస్పిటల్ లోని ఆర్థో వార్డులోని పేషెంట్లకు ఆక్సిజన్ అందించేందుకు ఒక్కో బెడ్ కు ఒక్కో సిలిండర్ ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం సమయంలో హాస్పిటల్ లో పని చేస్తున్న జ్యోతి అనే స్వీపర్ ఓ పేషెంట్ కు ఆక్సిజన్ సిలిండర్ అవసరమై అక్కడికి వెళ్లింది. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ సిలిండర్ పై ఉన్న క్లిప్పు ఒక్కసారిగా ఊడిపోయి పేలుడు సంభవించింది. దానిపై ఉన్న ఇనుప చువ్వ జ్యోతికి తగలడంతో ఆమెకు గాయాలయ్యాయి. కాగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న వాల్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పక్కనున్న ఇతర సిబ్బంది స్పందించి జ్యోతిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను ఎంజీఎం క్యాజువాలిటీ వార్డులో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
తప్పిన పెను ప్రమాదం
ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. ఇలా వరంగల్ ఎంజీఎంలో నిత్యం మూడు నుంచి నాలుగు వేల మంది వరకు ఓపీ సేవల కోసం పేషెంట్లు వస్తుండగా.. అందులో దాదాపు ఐదారు వందల మందికిపైగా ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతుంటారు. దీంతోనే హాస్పిటల్ ఎప్పుడూ ఫుల్ రద్దీగా ఉంటుంది. కాగా ఆర్థో విభాగానికి నిత్యం వంద మందికి పైగా వస్తుండగా.. ఆ వార్డులో ఉన్న సిలిండర్ పేలడం కలకలం రేపింది.
వాస్తవానికి సిలిండర్ తీసుకొచ్చే పని వార్డ్ బాయ్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ వార్డులో ఉన్న స్వీపర్ కు పని చెప్పడం వల్ల సిలిండర్ పేలి ఉంటుందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కాగా ఆ పక్కనే మరికొన్ని సిలిండర్లు ఉండగా.. అవి లీకైతే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఎంజీఎం సిబ్బంది పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్లలో చాలా వరకు రిపేర్లకు వచ్చినట్లు తెలుస్తోంది. వాటి ఆక్సీ మీటర్లు కూడా మరమ్మతులకు గురవుతున్నాయని, దీంతోనే ఆక్సీజన్ లీక్ అయి పేలుడు ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఆసుపత్రి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది, రోగులు కోరుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
టాపిక్