Sunil Chhetri U-Turn: ఇండియాలో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లే లేరా? మరీ ఇంత దారుణమా.. 40 ఏళ్ల వయసులో లెజెండ్ రీ ఎంట్రీ

Best Web Hosting Provider In India 2024


Sunil Chhetri U-Turn: ఇండియాలో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లే లేరా? మరీ ఇంత దారుణమా.. 40 ఏళ్ల వయసులో లెజెండ్ రీ ఎంట్రీ

Chandu Shanigarapu HT Telugu
Published Mar 07, 2025 04:06 PM IST

Sunil Chhetri U-Turn: భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ పై యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 40 ఏళ్ల వయసులో అతను తిరిగి జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో భారత్ లో ఫుట్‌బాల్‌ టాలెంట్ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సునీల్ ఛెత్రి
సునీల్ ఛెత్రి (HT_PRINT)

ఫుట్‌బాల్‌ దిగ్గజం సునీల్ ఛెత్రి రిటైర్మంట్ పై యూటర్న్ తీసుకున్నాడు. 40 ఏళ్ల వయసులో తిరిగి ఫుట్‌బాల్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇండియాలో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లే లేరన్నంటూ.. మళ్లీ ఛెత్రిని టీమ్ లోకి తీసుకోవాల్సిన దుస్థితిపై క్రీడా పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఛెత్రి రాక సంతోషాన్ని ఇచ్చేదే అయినా.. ఈ వయసులోనూ అతని అవసరం జట్టుకు ఉండటం యువ ఆటగాళ్ల నైపుణ్యాలపై సందేహాలకు కారణమవుతోంది.

ఆ మ్యాచ్ తో రీ ఎంట్రీ

2024 లో సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. కన్నీరు నిండిన కళ్లతో మైదానం వీడాడు. అప్పుడు మళ్లీ అతను జట్టులోకి వస్తాడనే అంచనాలే లేవు. అతని వయసే అందుకు కారణం. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఛెత్రి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏఎఫ్ సీ ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్ లో భాగంగా బంగ్లాదేశ్ తో భారత్ మ్యాచ్ లో ఛెత్రి తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు.

ఈ మ్యాచ్ కోసం ప్రధాన కోచ్ మనోలో మార్క్వెజ్ ప్రకటించిన 26 మంది ఆటగాళ్ల జట్టు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మనసు మార్చుకుని యూ టర్న్ తీసుకున్నాడు.

ఎంతో కీలకం

‘‘ఆసియా కప్ కు అర్హత సాధించడం మాకు చాలా కీలకం. టోర్నమెంట్ ప్రాముఖ్యత, రాబోయే మ్యాచ్ ల దృష్ట్యా జాతీయ జట్టును బలోపేతం చేయడానికి పునరాగమనం గురించి సునీల్ ఛెత్రితో చర్చించాను. అందుకు అతడు అంగీకరించాడు కాబట్టి జట్టులోకి తీసుకున్నాం’’ అని అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటనలో కోచ్ మనోలో మార్క్వెజ్ పేర్కొన్నాడు. అయితే ఛెత్రి రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు మరింత బలహీనపడింది.

హైదరాబాద్ లో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్ లో చిత్తయింది. ఆ తర్వాత ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ లోనూ ఓడింది. జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు కరవయ్యారు. దీంతో అంతర్జాతీయ ప్రమాణాలకు జట్టు దూరంగానే ఆగిపోతోంది.

152వ మ్యాచ్

సునీల్ ఛెత్రి ఇప్పటివరకూ భారత్ తరపున 151 అంతర్జాతీయ మ్యాచ్ లాడాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ అతనికి 152వ మ్యాచ్ కానుంది. ఫిఫా అంతర్జాతీయ విండో కోసం భారత జట్టుకు ఛెత్రి కీలకంగా మారబోతున్నాడు. ఏఎఫ్ సి ఆసియా కప్ సౌదీ అరేబియా 2027 క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్ ప్రారంభ మ్యాచ్ కు సన్నాహకంగా మార్చి 19న మాల్దీవులతో భారత్ స్నేహపూర్వక మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్ లు షిల్లాంగ్ లో జరగనున్నాయి.

ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్లతో పాటు భారత్ క్వాలిఫయింగ్ గ్రూప్లో ఉంది. టోర్నీ గత ఎడిషన్లో అన్ని మ్యాచ్ ల్లోనూ ఓడిన భారత్ గ్రూప్ దశను దాటలేక నిరాశపరిచింది.

100 గోల్స్

2005లో అరంగేట్రం చేసిన ఛెత్రి.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఇండియా ఆటగాడిగా గత ఏడాది రిటైరయ్యాడు. 151 మ్యాచ్ ల్లో 94 గోల్స్ చేశాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్ బాల్ లో ఛెత్రి కంటే పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (135), అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ (112), ఇరాన్ కు చెందిన అలీ డేయ్ (108) మాత్రమే ఎక్కువ గోల్స్ చేశారు. యూటర్న్ తీసుకుని జట్టులోకి వస్తున్న ఛెత్రి 100 గోల్స్ ను అందుకునే అవకాశముంది.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link