

Best Web Hosting Provider In India 2024

Guntur : ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థినితో ఇన్విజిలేటర్ అసభ్య ప్రవర్తన.. ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ వేధింపులు
Guntur : గుంటూరులో పరీక్షలు రాసే విద్యార్థినితో ఇన్విజిలేటర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ వేధించాడు. విద్యార్థిని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. యాజమాన్యం ఫిర్యాదుతో ఇన్విజిలేటర్‌ను పోలీసులు మందలించారు. విద్యార్థిని తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు.

ఈ ఘటన గుంటూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన విద్యార్థిని గుంటూరులోని ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీ హాస్టల్లో ఉండి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. మార్చి 3 నుంచి పొన్నూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కాలేజీ ఎగ్జామ్ సెంటర్‌లో ఆ విద్యార్థిని పరీక్షలు రాస్తోంది. అదే పరీక్షా కేంద్రంలో ఎంబీఏ చదువుతున్న యువకుడిని ఇన్విజిలేటర్‌గా నియమించారు.
ఎంబీఏ కుర్రాడిని ఇన్విజిలేటర్‌గా..
ప్రభుత్వ అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతోనే ఎంబీఏ చదివే యువకుడిని ఇన్విజిలేటర్‌గా నియమించారు. విద్యార్థిని పరీక్ష రాస్తున్న రూమ్‌కు ఆ యువకుడు ఇన్విజిలేటర్‌గా వ్యవహరించాడు. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ వేధింపులకు దిగుతున్నాడు. ఇన్విజిలేటర్ చేష్టలతో విద్యార్థిని ఆందోళనకు గురైంది. తన పరీక్షలపై ప్రభావం పడుతోందని, కీలకమైన పరీక్షల్లో ఒత్తిడికి లోనవ్వకూడదని విద్యార్థిని భావించింది.
పోలీసులకు ఫిర్యాదు..
విద్యార్థిని ఈ విషయాన్ని తాను చదువుతున్న కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితమే పోలీసులు ఆ యువకుడిని తీవ్రంగా మందలించారు. ఆ రోజు నుంచి ఆయనను ఇన్విజిలేషన్ విధుల నుంచి తొలగించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు.. చీఫ్ సూపరింటెండెంట్ తోపాటు కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. ఆ యువకుడిని కాలేజీకి పిలిపించారు. అందరి ముందే తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు.
అధికారులు సీరియస్..
ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ చదువుతున్న యువకుడిని ఇన్విజిలేటర్‌గా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతోనే ఎంబీఏ చదువుతున్న యువకుడిని ఇన్విజిలేటర్‌గా నియమించినట్లు కాలేజీ యాజమాన్యం చెబుతోంది. ఇదే విషయాన్ని ఆర్ఐవో జీకే జుబేర్ దృష్టికి వెళ్లడంతో.. ఎంబీఏ విద్యార్థిని ఇన్విజిలేటర్‌గా నియమించడంపై చీఫ్ సూపరింటెండెంట్‌ను సంజాయిషీ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు.
విద్యార్థులపై ఒత్తిడి..
అసలే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు. విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. పరీక్షలు బాగా రాయాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థుల్లో ఉంటుంది. ఆ దృష్టితోనే వారు పరీక్షలకు సిద్ధం అవుతారు. నిద్రహారాలు మాని చదువుతారు. ఇలాంటి ఘటనల వల్ల వారిపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. పరీక్షలు సరిగా రాయలేరు. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, హాస్టల్ యాజమాన్యాలు, ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు, అధికారులు దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్