



Best Web Hosting Provider In India 2024

CM Chandrababu : ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు వరాలు- కుట్టుమిషన్లు, ఈ-బైకులు పంపిణీ, అంగన్వాడీలకు గ్రాట్యుటీ
CM Chandrababu : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. మహిళా రైడర్లను ప్రోత్సహిస్తూ ప్రధాన నగరాల్లో 1000 మంది మహిళా రైడర్లకు ఈ-బైక్లు, ఈ-ఆటోలు అందించారు. 1.50 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.

CM Chandrababu : ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన సీఎం… మహిళలు తయారు చేసిన పలు ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరటి చెట్ల వ్యర్థాలతో తయారు చేసిన టోపీని సీఎం చంద్రబాబు ధరించారు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై దృష్టి పెట్టాలని మహిళలకు సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలన్నారు. అనంతరం ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
అనంతరం పోలీసు శాఖ రూపొందించిన ‘శక్తి యాప్’ను సీఎం ప్రారంభించారు. మహిళల చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు. మహిళల భద్రత కోసం, మహిళా రైడర్లని ప్రోత్సహిస్తూ, ప్రధాన నగరాల్లో 1,000 మంది మహిళా రైడర్లకు 760 ఈ-బైక్లు, 240 ఈ-ఆటోలు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. మహిళా రైడర్ల ప్రోత్సాహించేందుకు ర్యాపిడోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
చేనేత రథం
చేనేత మహిళలకు చేనేత రథం అందించి, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా, ముందుగా జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్క వ్యాన్ ఖరీదు రూ.60లక్షలుగా తెలుస్తోంది. దాని ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయించేందుకు మరింత సులభతరం కానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు “శక్తి టీమ్స్” ను ప్రారంభించారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కల్పించడమే “శక్తి టీమ్స్” లక్ష్యమని సీఎం తెలిపారు. మహిళల రక్షణకు 13 సేవలతో “శక్తి యాప్”ను రూపొందించారు. శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన 5-7 నిమిషాల్లో పోలీసులు వచ్చేలా ఏర్పాటు చేశారు.
మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు
అలాగే మహిళలు, పిల్లలపై నేరాలను నివారించడానికి, ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో “ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ వింగ్” ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ సాయంతో మహిళలు పండించే వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులకు విలువ జోడించి విక్రయించాలని సీఎం సూచించారు. ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ద్వారా మార్కెటింగ్ చేసేలా మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమాల వివరాలు ముఖ్యమంత్రి అడిగితెలుసుకున్నారు. అనంతరం 1.50 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ, మిషన్లు పంపిణీ చేయనున్నారు.
అంగన్వాడీలకు గుడ్ న్యూస్
అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. 62 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అంగన్ వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ అందిస్తామని ప్రకటించారు. అంగన్వాడీ మెయిన్, మినీ వర్కర్లకు రూ.1 లక్ష, హెల్పర్లకు రూ.40 వేల చొప్పున సర్వీస్ ముగింపు సమయంలో అందిస్తారు. మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీలకు సీఎం చంద్రబాబు జీవోను అందించారు.
సంబంధిత కథనం
టాపిక్