

Best Web Hosting Provider In India 2024
Viveka Murder Case : వివేకా హత్య కేసులో ప్రత్యక్ష, కీలక సాక్షి.. రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం
Viveka Murder Case : వివేకా హత్య కేసుతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోతున్నారు. తాజాగా వివేకా వాచ్‌మెన్ రంగన్న మృతిచెందారు. రంగన్న మృతిపై ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీంతో రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు.
వివేకా హత్య కేసులో ప్రత్యక్ష, కీలక సాక్షిగా ఉన్న వాచ్ మెన్ రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం ముగిసింది. పులివెందులలోని బాకరాపురం శ్మశావాటికలో సుమారు 4 గంటలపాటు వైద్యబృందం, నిపుణులు రీపోస్టుమార్టం నిర్వహించారు. రంగన్న మృతదేహం నుంచి పలు అవయవాలను సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు, వాటిని భద్రపరిచి పరీక్షల కోసం ల్యాబ్ కు తీసుకెళ్లారు.
మృతిపై సందేహాలు..
3 రోజుల కిందట వాచ్‌మెన్ రంగన్న మృతిచెందగా.. ఆయన మృతిపై భార్య సుశీలమ్మ సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని నివృత్తి చేసేందుకు మరోసారి శవపరీక్ష నిర్వహించారు. మంగళగిరి, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ మెడికల్ కళాశాల వైద్య బృందం ఆధ్వర్యంలో.. పులివెందుల పోలీసులు, ఆర్డీవో సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహించారు.
గాయాలు పరిశీలన..
పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీశారు. రంగన్న శరీరంపై ఎక్కడైనా గాయాలు ఉన్నాయా లేదా అనే అంశంపై వైద్యబృందం, నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. పోస్టుమార్టం నిర్వహించే సమయంలో రంగన్న భార్య సుశీలమ్మ కూడా అక్కడే ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన ప్రాంతానికి 200 మీటర్ల పరిధి వరకూ ఎవరినీ అనుమతించలేదు. రీ పోస్టుమార్టం నివేదికలో ఏం వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ప్రభుత్వం ఫోకస్..
వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఈ మరణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ ఇష్యూపై ఇప్పటికే సిట్‌ఏర్పాటు చేసింది. మరణించిన ఆరుగురు సాక్షులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా.. వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.
మృతులు వీరే..
వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు, అనుమానితులైన కే.శ్రీనివాసులు రెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, కల్లూరి గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, వాచ్‌మన్ రంగన్నలు మృతి చెందారు. వారికి ఈ కేసుకు ఉన్న సంబంధం గురించి డీజీపీ కేబినెట్ సమావేశంలో మంత్రులకు వివరించినట్టు తెలిసింది. ఈ మరణాలన్నింటిపై విచారణ చేయిస్తున్నామని డీజీపీ చెప్పినట్టు తెలుస్తోంది.
టాపిక్