

Best Web Hosting Provider In India 2024
SLBC Rescue Operation : టన్నెల్ లోపల ఆక్సిజన్ లేదు.. రంగంలోకి రోబోలు.. ఎస్ఎల్‌బీసీ వద్ద తాజా పరిస్థితి ఏంటి?
SLBC Rescue Operation : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగి రెండు వారాలు గడుస్తున్నాయి. కానీ గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నా ఫలితం దక్కడం లేదు. టన్నెల్ లోపలికి వెళ్లే పరిస్థితులు అనుకూలంగా లేవు. టన్నెల వద్ద తాజా పరిస్థితులు ఇలా ఉన్నాయి.
ఎస్ఎల్‌బీసీ వద్ద జరిగిన ప్రమాదం ఒక జాతీయ విపత్తు అని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం, సహాయక చర్యల్లో ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగిస్తున్నట్టు వివరించారు. శనివారం ఉదయం అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్‌ను సందర్శించారు. వివిధ రంగాల నుంచి పనిచేస్తున్న రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
పురోగతిపై ఆరా..
సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి ఉన్న పురోగతి గురించి అధికారులు మంత్రికి వివరించారు. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, క్యాడవర్ డాగ్ బృందం, ర్యాట్ మైనర్స్, రోబోటిక్ రంగాల నిపుణులతో ఇత్తమ్ చర్చించారు. సహాయక చర్యలు వేగంగా జరగకపోవడానికి గల కారణాలు, అడ్డంకులు, వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
సరిగా ఆక్సిజన్ లేదు..
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో అవాంతరాలను అధిగమిస్తూ.. వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సొరంగం లోపల సరిగ్గా ఆక్సిజన్ స్థాయి లేకపోవడం, నీరు అధికంగా ఊరటం, టీబీఎం లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. అయినా సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
అండగా ఉంటాం..
రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేసే కార్మికులు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. త్వరగా కార్మికులను గుర్తించేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఎంత నిధులు ఖర్చు అయిన సరే ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. టీబీఎం శకలాలు రాళ్లు, మట్టి, నీళ్లలో కూరుకుపోయి ఉండటంతో.. రెస్క్యూ చేసే సిబ్బందికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.
రంగంలోకి రోబోలు..
రోబోటిక్ నిపుణులతో సహాయక చర్యలు చేపట్టేందుకు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రోబోలను వెంటనే రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న అధికారులు, నిపుణులు, సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు. తాను మళ్లీ 11వ తేదీన వస్తానని.. వీలైతే ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వస్తారని స్పష్టం చేశారు.
టాపిక్