

Best Web Hosting Provider In India 2024

Warangal : రెండేళ్లుగా ట్యాక్స్ కట్టని ఫలితం.. వరంగల్‌లో బార్ అండ్ రెస్టారెంట్ సీజ్!
Warangal : వరంగల్ నగరంలో పన్నుల వసూలు విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. పన్నుల వసూలు లక్ష్యం ఇంతవరకు సగం కూడా పూర్తి కాకపోవడంతో.. బకాయిదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హనుమకొండలో ఓ బార్‌ను సీజ్ చేశారు.

పన్నులు కట్టనివారిపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్నిచోట్ల ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రెండేళ్ల నుంచి పన్ను కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న.. హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు.
నోటీసులు ఇచ్చినా..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే ఆదేశాల మేరకు.. కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ శనివారం బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేశారు. రెండేళ్ల నుంచి దాదాపు 2 లక్షల 56 వేల వరకు పన్ను బకాయి పడగా.. వెంటనే ట్యాక్స్ చెల్లించాల్సిందిగా అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు.
కమిషనర్ ఆగ్రహం..
అయినా డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం నుంచి స్పందన లేదు. దీంతో ఇటీవల రెడ్ నోటీస్ కూడా అందజేశారు. నిర్దుష్ట గడువులోగా యాజమాన్యం స్పందించకపోవడం, పన్ను చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ మేరకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆర్డర్స్‌తో బార్ అండ్ రెస్టారెంట్ ను సీజ్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ రవీందర్ వివరించారు. పన్నులు సకాలంలో చెల్లించేందుకు ప్రజలు తమకు సహకరించాలని డిప్యూటీ కమిషనర్ కోరారు.
70 మంది ఆఫీసర్లకు నోటీసులు..
గ్రేటర్ వరంగల్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల లక్ష్యం రూ.117.27 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.52.66 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే టార్గెట్ 45.25 శాతం మాత్రమే రీచ్ కాగా.. మున్సిపల్ కమిషనర్ పన్ను వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ మేరకు రెవెన్యూ ఇన్ స్పెక్టర్లతో పాటు బిల్ కలెక్టర్లకు టార్గెట్ పెట్టారు. ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు ప్రతి రోజు 300 ఇళ్లు సందర్శించి, ట్యాక్స్ వసూలు చేయాలని లక్ష్యం నిర్దేశించారు.
కమిషనర్ అసంతృప్తి..
ట్యాక్స్ కట్టని వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు.. మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అయినా టార్గెట్ చేరుకోవడంలో వెనుకబడి పోయిన సిబ్బంది పట్ల ఇటీవల మున్సిపల్ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని చేరుకోని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లు ఇప్పటికే సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
సిబ్బంది తిప్పలు..
దాదాపు 70 మంది సిబ్బందికి నోటీసులు జారీ చేయగా.. అందులో 11 మంది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మరో 59 మంది బిల్ కలెక్టర్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో రెవెన్యూ సిబ్బంది పన్నులు వసూలు చేయలేక తలలు పట్టుకోవాల్సి వస్తోంది. పన్నుల వసూలు కోసం అధికారులు బల్క్ మెసేజ్‌లు పంపించాలని కమిషనర్ సూచించారు. నగర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించడం, మొండి బకాయిదారుల వెంటపడాలని ఆదేశించారు.
విలీన గ్రామాల్లో ఇలా..
క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేసే పనిలో పడ్డారు. కానీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో దాదాపు 42 విలీన గ్రామాలు ఉండగా.. ఆయా ఊళ్లలో పన్నులు చెల్లించేందుకు జనాలు ముందుకు రావడం లేదు. ఫలితంగా బకాయిలు అలాగే ఉండిపోతున్నాయి. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఇచ్చిన గడువులోగా అధికారులు ఏమేరకు టార్గెట్ రీచ్ అవుతారో చూడాలి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
టాపిక్