


Best Web Hosting Provider In India 2024

AP Free Bus Scheme : అప్పుడు ఫ్రీ..ఫ్రీ, ఇప్పుడు కండీషన్స్ అప్లై-ఉచిత బస్ పథకంపై కూటమి వర్సెస్ ప్రతిపక్షాలు
AP Free Bus Scheme : ఏపీలో ఫ్రీ బస్ పథకంపై రచ్చ మొదలైంది. జిల్లా వరకే ఫ్రీ బస్ అంటూ మంత్రి సంధ్యారాణి ప్రకటనతో దుమారం రేగింది. ఎన్నికలకు ముందు రయ్..రయ్, ఇప్పుడు నై..నై అంటున్నారని వైసీపీ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఫ్రీ, ఫ్రీ అని ఇప్పుడు కండీషన్స్ అప్లై ఎలా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

AP Free Bus Scheme : ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఒకటి. ఈ హామీ అమలుపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉగాది నుంచి ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుపై మంత్రుల కమిటీ అధ్యయనం చేస్తుంది. ఫ్రీ బస్ స్కీమ్ పై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇటీవల శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ఫ్రీ బస్ పథకం రాష్ట్రవ్యాప్తంగా కాదని, జిల్లా వ్యాప్తంగా మాత్రమేనని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితమని స్పష్టం చేశారు. ఏ జిల్లాలోని మహిళలకు ఆ జిల్లాల్లోనే ప్రయాణించాలని, వేరే జిల్లాకు వెళ్తే ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపారు.
తెలంగాణ, కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు. అయితే ఏపీలో ఆ తరహా అమలు చేయడంలేదని ఉచిత ప్రయాణంపై మంత్రి సంధ్యారాణి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఫ్రీ బస్ అని ప్రకటించి ఇప్పుడు జిల్లా వరకే అంటున్నారని వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది.
అప్పుడు రయ్ రయ్, ఇప్పుడు నై నై
“ఎన్నికల ముందు రయ్ రయ్.. గెలిచాక నై నై అంటే ఎలా ? కర్ణాటక, తెలంగాణ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఫ్రీ బస్సు అనేది సూపర్-6 హామీల్లో ఒకటి కాదా? అప్పుడేమో రాష్ట్రమంతా అని ఊదరగొట్టి.. ఇప్పుడు గెలిచాక జిల్లా వరకే ఫ్రీ అంటారా? ఆర్టీసీ బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్లండి. కండక్టర్ టికెట్ డబ్బు అడిగితే నా పేరు చెప్పండి అని చంద్రబాబు చెప్పిన మాట నిజం కాదా? ఇప్పుడు గెలిచాక మాట మార్చేస్తారా? ఇంతకంటే సిగ్గులేనితనం ఉంటుందా? ఈ హామీపై ప్రచారం చేసి.. ఇప్పుడు తేలుకుట్టిన దొంగలా జనసేన గప్ చుప్? ఇంకెన్నాళ్లు ఇలా అబద్ధాలతో బతికేస్తారు?” అని వైసీపీ ట్వీట్ చేసింది.
టీడీపీ కౌంటర్
వైసీపీ విమర్శలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. “ఒక జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం అని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. జనానికి మేలు జరిగితే ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్నారు” అని టీడీపీ ట్వీట్ చేసింది.
ఫ్రీ బస్ కండీషన్ అప్లై – షర్మిల విమర్శలు
ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ..ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని, ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణం అన్నారు. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం అన్నారు. అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక సాకులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే అన్నారు.
“ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహార యాత్రలు చేశారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణమే. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా అంతా ఉచితమే. ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంతదూరమైనా జీరో టికెట్.
ఇలాంటి మంచి పథకాన్ని, అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదు. నెలకు రూ.350 కోట్లు మహిళల కోసం ఆర్టీసికి ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా ? ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా సాధికారిత? తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని, రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండాలని రాష్ట్రంలోని మహిళల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది” – వైఎస్ షర్మిల
సంబంధిత కథనం
టాపిక్