




Best Web Hosting Provider In India 2024

Netflix Scam: నెట్‍ఫ్లిక్స్ పేరుతో నయా సైబర్ స్కామ్.. జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారు! వివరాలివే
Netflix Scam: నెట్‍ఫ్లిక్స్ పేరుతో తాజాగా మరో స్కామ్ జరుగుతోంది. సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్‍తో జనాలను మోసం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు మాయం చేసేందుకు ఈ-మెయిళ్లతో పన్నాగాలు చేస్తున్నారు. ఆ స్కామ్ వివరాలు ఇవే..

సైబర్ నేరాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. రకరకాల రీతుల్లో సైబర్ నేరస్తులు.. జనాలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొత్త విధానాలు పాటించి నమ్మించి డబ్బు కొల్లగొట్టేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. కొత్తగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నుంచి మెయిల్ వచ్చిందనేలా ఓ కొత్త సైబర్ స్కామ్ జరుగుతోంది. ఈ మెయిళ్ల ద్వారా మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
స్కామ్ ఎలా జరుగుతోందంటే..
మీ నెట్‍ఫ్లిక్స్ అకౌంట్ హోల్డ్ అయిందని, వెంటనే పేమెంట్ వివరాలు అప్‍డేట్ చేయాలంటూ సైబర్ నేరస్తులు.. ఫేక్ ఈ-మెయిల్స్ పంపుతున్నారు. వెంటనే వివరాలు అప్‍డేట్ చేయకపోతే నెట్‍ఫ్లిక్స్ వాడలేరంటూ మెయిల్ చేస్తున్నారు. అచ్చం నెట్‍ఫ్లిక్స్ సంస్థే మెయిల్ పంపిందనేలా డిజైన్, లోగోలతో మెయిల్స్ రూపొందిస్తున్నారు. ‘అప్‍డేట్ అకౌంట్ నౌ’ అనే బటన్ క్లిక్ చేయాలంటూ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి వివరాలు అప్‍డేట్ చేయాలని ఉంటుంది.
స్కామర్లు పంపిన మెయిల్‍లోని అప్‍డేట్ బటన్‍పై నొక్కితే ఫేక్ నెట్‍ఫ్లిక్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజీ చూసేందుకు నెట్‍ఫ్లిక్స్ అఫీషియల్ పేజీలానే ఉంటుంది. కలర్స్, లోగో అన్నీ అలాగే కనిపిస్తాయి. కానీ అది ఫేక్. నెట్‍ఫ్లిక్ లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలనే బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత పేమెంట్ డీటైల్స్ అప్‍డేట్ కోసం.. క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయాలని వస్తుంది.
ఒకవేళ యూజర్ కార్డు వివరాలను ఆ ఫేక్ పేజీలో ఎంటర్ చేస్తే.. వారి బ్యాంకు ఖాతాలో డబ్బు మాయమయ్యే రిస్క్ ఉంటుంది. జనాల డబ్బును దోచేసేందుకు ఇలా నెట్‍ఫ్లిక్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరస్తులు.
ఈ జాగ్రతలు పాటించండి
- ఒకవేళ నెట్‍ఫ్లిక్స్ నుంచి ఈ-మెయిల్ వచ్చినట్టు కనిపిస్తే నిశితంగా పరిశీలించండి. ఏదైనా స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయా, అనుమానించే విధంగా ఉంటే ఎలాంటి లింక్‍ను క్లిక్ చేయకండి. నెట్‍ఫ్లిక్స్ అఫీషియల్ మెయిల్ (@netflix.com డొమైన్) నుంచి అది వచ్చిందా అని చూడండి. ఒకవేళ ఏదైనా తేడాగా, తప్పుగా ఉండే ఆ మెయిల్ ఫేక్ అని గుర్తించొచ్చు.
- పేమెంట్ డిటైల్స్ అప్‍డేట్ చేయాలని ఈమెయిల్ ద్వారా నెట్‍ఫ్లిక్ అడగదు. ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. అందుకే పేమెంట్ అప్‍డేట్ చేయాలనే మెయిల్ వస్తే ఎలాంటి లింక్స్ క్లిక్ చేయవద్దు. డౌట్ ఉంటే అఫీషియల్ యాప్, వెబ్ పేజీకి వెళ్లి చెక్ చేసుకోవాలి.
- ఒకవేళ ఫేక్ మెయిల్‍లోని లింక్‍ను క్లిక్ చేస్తే.. ఓపెన్ అయ్యే పేజీలో యూఆర్ఎల్‍ను నిశితంగా పరిశీలించండి. నెట్‍ఫ్లిక్స్ అధికారిక వెబ్‍సైట్ https://www.netflix.com తో మొదలవుతుంది. ఏదైనా తేడాగా ఉంటే కచ్చితంగా నకిలీది అని అర్థం.
- మెయిల్ ద్వారా వచ్చే అనుమానిత లింక్‍లను క్లిక్ చేయవద్దు. అఫీయయల్ ప్లాట్‍ఫామ్‍లోకి వెళ్లిన తర్వాతే పేమెంట్‍కు సంబంధించినవి తనిఖీ చేసుకోవాలి.
- ఒకవేళ నకిలీ లింక్ క్లిక్ చేసి మీ కార్డు వివరాలు సమర్పిస్తే వెంటనే బ్యాంక్ స్టేట్‍మెంట్ చెక్ చేసుకోండి. ఒకవేళ స్కామ్‍కు గురైతే వెంటనే సైబర్ క్రైమ్‍కు కంప్లైట్ చేయండి. మొత్తంగా అసలు మెయిల్ ద్వారా వచ్చిన అనుమానిత లింక్‍లను ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయకపోవడమే మంచిది.
సంబంధిత కథనం