

Best Web Hosting Provider In India 2024

SRSP Car Accident : వరంగల్ కెనాల్ ప్రమాదం విషాదాంతం, కారులో తండ్రీ కూతురి మృతదేహాలు- ప్రమాదానికి ముందు చివరి సెల్ఫీ
SRSP Car Accident : వరంగల్ జిల్లా ఎస్సారెస్పీ కెనాల్ లోకి కారు దూసుకెళ్లిన ఘటన విషాదాంతం అయ్యింది. ఈ ప్రమాదంలో భర్తతో పాటు ఇద్దరు పిల్లలు జలసమాధి అయ్యారు. ప్రమాదానికి ముందు వారంతా సెల్ఫీ దిగగా… ఈ ఫొటో చూసి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.

SRSP Car Accident : వరంగల్ జిల్లా ఎస్సారెస్పీ కెనాల్ లోకి కారు దూసుకెళ్లిన ఘటన విషాదాంతమైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజుపల్లి శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ లోకి ఓ కారు బోల్తా కొట్టిన ప్రమాదంలో మొదట రెండేళ్ల బాబు ప్రాణాలు కోల్పోగా.. తల్లి ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. కాగా తండ్రితో పాటు ఐదేళ్ల చిన్నారి కారుతో సహా గల్లంతవ్వగా.. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి కెనాల్ నుంచి కారును బయటకు తీయడంతో అందులో తండ్రీకూతుళ్ల మృతదేహాలు బయటపడ్డాయి.
దీంతో కెనాల్ కారు ప్రమాద ఘటన విషాదంతో ముగిసినట్లయ్యింది. కాగా భర్తతో పాటు ఇద్దరు పిల్లలు జలసమాధి కావడంతో ఆ తల్లి రోధించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కాగా కారు కెనాల్ లోకి దూసుకెళ్లే ముందు వాళ్లంతా సెల్ఫీ దిగగా.. అది చూసి వారి కుటుంబ సభ్యులంతా బోరున విలపిస్తున్నారు.
గుండెపోటు రావడంతో కెనాల్ లోకి
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి(5), కొడుకు సాయివర్థన్(2)తో కలిసి హనుమకొండ రాంనగర్ లోనే నివాసం ఉంటున్నాడు. వీకెండ్ కావడంతో శనివారం ఉదయం తమ స్వగ్రామమైన మేచరాజుపల్లి వెళ్లేందుకు టీఎస్ 03 ఎఫ్బీ 8881 నెంబర్ గల తమ కారులో హనుమకొండ నుంచి బయలు దేరారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజుపల్లి శివారుకు చేరుకున్నారు.
ఇంతలోనే ప్రవీణ్ కు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి మొదలవ్వగా.. గుండె నొప్పి వస్తున్నట్టుగా భావించిన ప్రవీణ్ తిరిగి వెనక్కి హనుమకొండకు వెళ్దామని తన భార్య కృష్ణ వేణికి చెప్పాడు. ఈ మేరకు కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి క్రాస్ వద్దకు చేరుకోగా.. ఛాతిలో నొప్పి ఎక్కువవడంతో కారు అదుపు తప్పింది. దీంతో కారు కెనాల్ లోకి దూసుకెళ్లింది. ఇంతలోనే కారు ఫ్రంట్ లెఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో కృష్ణవేణి కారులోంచి నీళ్లలో పడగా.. విషయం గమనించిన స్థానికులు ఆమెను కాపాడారు. అప్పటికే వారి రెండేళ్ల బాబు సాయివర్ధన్ నీళ్లు మింగేసి కొట్టుకుపోతుండగా.. అతడిని బయటకు తీసేసరికి చనిపోయి ఉన్నాడు. కానీ ప్రవీణ్, ఆయన కూతురు చైత్రసాయి కారుతో పాటే నీళ్లలో గల్లంతయ్యారు.
వెనుక సీట్ లో డెడ్ బాడీలు
స్థానికుల ద్వారా విషయం తెలసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. దాదాపు రెండు, మూడు గంటల పాటు గాలించగా.. కారు గల్లంతైన కొద్దిదూరంలోనే నీటి అట్టడుగున ఉన్నట్టు గజ ఈతగాళ్లు గుర్తించారు. అనంతరం కారుకు తాళ్లు కట్టి క్రేన్ సహాయంతో బయటకు తీశారు. అనంతరం కారు డోర్లు ఓపెన్ చేయగా.. ప్రవీణ్ తో పాటు ఆయన కూతురు డెడ్ బాడీ వెనక సీట్ లో లభ్యమయ్యాయి. దీంతో కృష్ణ వేణి తీవ్ర వేదనతో రోధించగా.. అక్కడున్న వాళ్లంతా కంటతడి పెట్టారు.
ప్రమాదానికి ముందు చివరి సెల్ఫీ
కారులో స్వగ్రామం మేచరాజుపల్లికి బయలు దేరే ముందు ప్రవీణ్, తన భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి ముగ్గురూ కలిసి సెల్ఫీ దిగారు. ఆ ఫొటోలో అందరూ నవ్వుతూ ఉండగా.. ఫొటో దిగిన కొంత సమయానికే కారు కెనాల్ లో గల్లంతైంది. అప్పటివరకు నవ్వుతూ గడిపిన వారి కుటుంబం అంతలోనే విషాదంలో మునిగింది. కాగా ఆ ఫొటో చూసి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా రోధించారు. ఇదిలాఉంటే కెనాల్ నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసిన అనంతరం వాటిని ఎంజీఎం మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్