Best Web Hosting Provider In India 2024
Mahabubabad : ఊరంతా కన్నీరే..! గంటల వ్యవధిలో నీళ్లలో మునిగి ఐదుగురు మృతి – శోకసంద్రంలో ‘మేచరాజుపల్లి’
మహబూబాబాద్ జిల్లా మేచరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. SRSP కెనాల్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… మరోవైపు ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. దీంతో గంటల వ్యవధిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి శోక సంద్రంలో మునిగింది. గ్రామానికి చెందిన ఓ ఎల్ఐసీ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఫ్యామిలీ వరంగల్ జిల్లా తీగరాజుపల్లి వద్ద కారుతో సహా కెనాల్ లో పడిపోగా.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనకు ముందే గ్రామంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువు కుంటలో పడి మృత్యువాత పడ్డారు. దీంతో గంటల వ్యవధిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, వారంతా నీళ్లలోనే మృతి చెందడం కలవరానికి గురి చేస్తుండగా.. వారి మరణంతో ఊరంతా కన్నీరు పెడుతోంది.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
చేపల వేట కోసం చెరువులోకి దిగిన ఇద్దరు వ్యక్తులు అందులో ఉన్న గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో శుక్రవారం రాత్రి జరగగా.. ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది.
స్థానిక ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మేచరాజుపల్లి పెద్దతండాకు చెందిన భూక్య రాములు(50), బాధావత్ శేఖర్(20) ఇద్దరూ బంధువులు. వారి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉండటంతో సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మేచరాజుపల్లి సమీపంలోని కుమ్మరికుంటలో చేపల వేట కోసం వల తీసుకుని వెళ్లారు. అక్కడ కుమ్మరికుంట వద్ద దుస్తులు, సెల్ ఫోన్లు పెట్టి వల పట్టుకొని నీళ్ళలోకి దిగారు. ఇదిలాఉంటే అప్పటికే
కొద్దికాలంగా రాములు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శేఖర్ కు ఈత రాకపోవడంతో రాములు సహాయంతో నీళ్ళలోకి దిగారు. వల సహాయంతో చేపలు పడుతూ కొద్దికొద్దిగా లోపలికి వెళ్లారు. కాగా అక్కడ జేసీబీతో తవ్విన లోతైన గుంత ఉండగా.. అనుకోకుండా అందులో పడ్డారు. ఓ వైపు రాములుకు ఆరోగ్యం బాలేకపోవడం, మరోవైపు శేఖర్ కు ఈత రాకపోవడంతో ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు.
రాత్రయినా ఇంటికి రాకపోవడంతో..
ఇళ్ల నుంచి వెళ్లిన రాములు, శేఖర్ రాత్రి తొమ్మిది గంటలు దాటినా ఇంత వరకు ఇంటికి చేరకపోవడం, ఫోన్లో కూడా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. దీంతో వారి జాడ కోసం వెతుకుతూ కుమ్మరికుంట వద్దకు చేరుకోగా… అక్కడ కట్ట మీద ఇద్దరి దుస్తులు కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించగా రాత్రి 11 గంటల సుమారులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. రెండు కుటుంబాల సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మ రకు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రమేష్ బాబు వివరించారు.
కెనాల్ ప్రమాదంలో ముగ్గురు:
ఎల్ఐసీ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ తన కుటుంబంతో కలిసి స్వగ్రామం వస్తుండగా.. శనివారం కారు కెనాల్ లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రవీణ్, ఆయన రెండేళ్ల కొడుకు సాయి వర్ధన్, ఐదేళ్ల పాప చైత్రసాయి ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్య కృష్ణవేణి మాత్రమే బతికి బయటపడింది. ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపగా.. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచి వేస్తోంది.
ఐదుగురి మృతితో విషాదం…
ఓ వైపు కెనాల్ ప్రమాదంలో ముగ్గురు, చేపల వేటకు వెళ్లి ఇద్దరు చనిపోగా మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గంటల వ్యవధిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచి వేస్తుండగా.. శనివారం రాములు, శేఖర్ అంత్య క్రియలు ముగిశాయి. ఆదివారం ప్రవీణ్, ఛైత్రసాయి, సాయి వర్ధన్ మృత దేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
కాగా ఐదుగురి మృతితో మేచరాజుపల్లి శోక సంద్రంలో మునిగింది. ఇదిలా ఉంటే చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన శేఖర్ కుటుంబం వ్యవసాయమే ఆధారంగా జీవిస్తుండగా.. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఆయన చేపల వేట కోసం వెళ్లి మృత్యువాత పడటం అందరినీ కలచి వేసింది. కాగా తమ చేతికి అందవచ్చిన కొడుకును కోల్పోయామంటూ శేఖర్ తల్లిదండ్రులు రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
రిపోర్టింగ్: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్