

Best Web Hosting Provider In India 2024
SLBC Accident : గల్లంతైన వారిని గుర్తించడంలో పురోగతి.. మనుషుల ఆనవాళ్లను కనుగొన్న కాడవర్ డాగ్స్!
SLBC Accident : ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు వారాల తర్వాత కాస్త పురోగతి కనిపించింది. కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్.. మనుషుల ఆనవాళ్లను గుర్తించినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిలో కొందరిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. టన్నెల్లో గల్లంతైన వారిని గుర్తించడంలో.. కాస్త పురోగతి కనిపించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్ దగ్గర మనుషుల ఆనవాళ్లను కేరళ కాడవర్ డాగ్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు.
ముమ్మర ప్రయత్నాలు..
అయితే.. మనుషుల ఆనవాళ్లు లభించినట్టు అధికారులు ఇంకా కన్ఫామ్ చేయలేదు. సొరంగంలో గల్లంతైన వారిలో కొందరిని ఆదివారం రాత్రి వరకు గుర్తించే అవకాశం ఉంది. మృతదేహాలు లభిస్తే.. బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు. 11వ తేదీ మళ్లీ వస్తానని చెప్పారు. సీఎం రేవంత్ కూడా వెళ్లే అవకాశం ఉంది.
ఎంత ఖర్చైనా భరిద్దాం..
రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసే కార్మికులు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు. త్వరగా కార్మికులను గుర్తించేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఎంత ఖర్చు అయిన ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. టీబీఎం శకలాలు రాళ్లు, మట్టి, నీళ్లలో కూరుకుపోయి ఉండటంతో.. రెస్క్యూ చేసే సిబ్బందికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.
కాడవర్ డాగ్స్ ప్రత్యేకతలు..
1.ఈ జాగిలాలకు వాసనలు పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
2.అతి సూక్ష్మ శబ్దాల్ని కూడా పసిగట్టగలిగే వినికిడి శక్తి ఈ జాగిలాల సొంతం.
3.విపత్తు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గుర్తించడంలో ఈ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయి.
4.కేరళలోని వయనాడ్‌ను రాత్రికి రాత్రే వరదలు ముంచెత్తినప్పుడు.. శిథిలాల కింద అనేక మందిని ఈ జాగిలాలు గుర్తించాయి.
5.ఇప్పుడు తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ కోసం.. సహాయక చర్యలలో ఈ జాగిలాలను వినియోగిస్తున్నారు.
6.ఈ జాగిలాలను కేరళ పోలీసులు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగిస్తారు.
రోబోలను దింపండి..
రోబోటిక్ నిపుణులతో సహాయక చర్యలు చేపట్టేందుకు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రోబోలను వెంటనే రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న అధికారులు, నిపుణులు, సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు.
టాపిక్