Best Web Hosting Provider In India 2024
Warangal Weather : పగలు మండే ఎండ – సాయంత్రం దాటితే చలితో గజగజ..!
వరంగల్ లో భిన్న వాతావరణం ఉంది. పగటి సమయంలో ఎండల తీవ్రత ఉంటుండగా… రాత్రయితే చాలు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. అంతేగాకుండా అర్ధరాత్రి నుంచి తెల్లవారే దాక ఉమ్మడి జిల్లాను మంచు దుప్పటి కప్పేస్తుండటంతో వాతావరణం చలి కాలాన్ని తలపిస్తోంది.
గత నాలుగు రోజులుగా ఓరుగల్లులో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. తెల్లవారుజామునే మంచు దుప్పటి కప్పేస్తుండగా.. ఆ తరువాత సాయంత్రం వరకు మండే ఎండతో టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఇక రాత్రి అయ్యిందంటే చాలు ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి కాలాన్ని తలపిస్తోంది. ఇలా ఒక రోజులోనే భిన్నమైన వాతావరణం కంగారు పుట్టిస్తుండగా.. ఓరుగల్లు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా వాతావరణ సమతుల్యత సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
35 డిగ్రీలు దాడుతున్న ఎండ
ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచి కొట్టడం మొదలు పెట్టాయి. ఇక మార్చి నుంచి అవి కాస్త ఎక్కువయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి ఎండ వేడి ఎక్కువవుతుండగా.. సాయంత్రం వరకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డే సమయంలో కొద్దిరోజులుగా గరిష్టంగా 35.5 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదు అవుతుండగా.. పొద్దటి నుంచి సాయంత్రం వరకు ఎండలతో మండిపోతోంది.
దీంతో జనాలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు పని చెబుతున్నారు. దీంతో ఉపశమనం కోసం ఏసీలు, కూలర్ల వినియోగం కూడా పెరిగి పోయి రికార్డు స్థాయిలో విద్యుత్తు డిమాండ్లు నమోదు అవుతున్నాయి. మార్చి నెలలోనే ఇలా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండగా.. మున్ముందు ఏప్రిల్, మే నెలల్లో పూర్తిగా ఎండలతో టెంపరేచర్లు మరింత పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది.
తెల్లారితే మంచు దుప్పటే
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం ఒకలా ఉంటుంటే.. రాత్రి నుంచి తెల్లవారేదాక పరిస్థితి ఇంకోలా ఉంటోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణం చలి కాలాన్ని తలపిస్తోంది. పొద్దంతా 35 డిగ్రీలు దాటుతున్న టెంపరేచర్లు.. రాత్రయితే కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. కొద్దిరోజులుగా 16 డిగ్రీలకంటే తక్కువకు పడి పోతుండటంతో జనాలు రాత్రి అయ్యిందంటే చాలు చలితో వణికిపోతున్నారు. అంతేగాకుండా అర్ధరాత్రి నుంచి తెల్లవారే దాక ఉమ్మడి జిల్లాను మంచు దుప్పటి కప్పేస్తుండటంతో వాతావరణం చలి కాలాన్ని తలపిస్తోంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
చుట్టుపక్కలా ఎక్కడా ఎలాంటి తుఫాన్ వాతావరణం లేకున్నా ఇలా చలికాలాన్ని తలిపించేలా టెంపరేచర్లు పడిపోతుండటం, ఉదయం లేస్తే రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేకపోవడంతో జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నాలుగు రోజులుగా ఉదయం నుంచి మంచు దుప్పటి కప్పేస్తుండటంతో సాధారణ జనాలు ఎండాకాలంలో చలి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుండగా.. వాహనదారులు మాత్రం ఉదయం సమయంలో రోడ్లు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న హైవేలు పూర్తిగా కనిపించలేని పరిస్థితి నెలకొంటుండటంతో వెహికిల్స్ మరింత జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే వాతావరణ సమతుల్యత దెబ్బ తినడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో డీ ఫారెస్టేషన్ పెరిగిపోవడం, వృక్ష సంపద పెంచేందుకు చర్యలు తీసుకోకపోవడం వల్ల వాతావరణం దెబ్బతింటోందని పేర్కొంటున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
సంబంధిత కథనం
టాపిక్