



Best Web Hosting Provider In India 2024

Bread Icecream: వేసవిలో పిల్లల నోరు కట్టేయకండి, ఇంట్లోనే బ్రెడ్ ఐస్ క్రీం తయారుచేసి షాక్ ఇవ్వండి!
Bread Icecream: బయట నుంచి తీసుకొచ్చే ఐస్ క్రీం గురించి అనుమానం ఉందా? వేసవిలో పిల్లలకు ఐస్ క్రీం అంటే నో చెప్పేయకండి. ఇంట్లోనే బ్రెడ్ ఐస్ క్రీం తయారుచేసి సర్ ప్రైజ్ ఇవ్వండి. ఇదిగోండి మీ కోసం ఈ సింపుల్ రెసిపీ.

ఐస్ క్రీంను ఇష్టపడతాం. కానీ, అంతకంటే ఎక్కువగా భయపడతాం. ఎందుకంటే, బయట కొనుక్కొని తినే ఐస్ క్రీం వల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని దాదాపు నో చెప్పేస్తుంటాం. మీకు ఆ టెన్షన్ లేకుండా ఇంట్లోనే, అది కూడా బ్రెడ్ తో తయారుచేసుకునే రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాం. ఎటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్స్ యాడ్ చేయకుండానే ఐస్ క్రీమ్ ను తయారుచేసుకుని పిల్లలకు తినిపించేయండి. మార్కెట్లో దొరికే ఐస్ క్రీంలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండే, బ్రెడ్ ఐస్ క్రీం రెసిపీ ఏంటో చూసేద్దామా..
బ్రెడ్ ఐస్ క్రీం ఎలా తయారు చేయాలంటే..
కావాల్సిన పదార్థాలు:
- 5 బ్రెడ్ ముక్కలు
- 200 మిల్లీలీటర్ల కండెన్స్‌డ్ మిల్క్ (చక్కెర కలిపి చల్లార్చిన పాలు)
- 1 గుప్పెడు బాదం
- 1 తరిగిన అరటిపండు
- 200 మి.లీ పెరుగు
- 2 టేబుల్ స్పూన్ల పైనాపిల్ జామ్
- 1 తరిగిన ఆపిల్
తయారుచేసే విధానం:
స్టెప్ 1: బ్రెడ్ తీసుకుని దానిపై కొద్దిగా జామ్ అప్లై చేయాలి. తర్వాత దానిని ఒక గిన్నె లేదా ట్రేలో ఉంచాలి.
స్టెప్ 2: ఇప్పుడు ఒక కప్పులో పెరుగు తీసుకుని దానిపై మస్లిన్ గుడ్డను ఉంచండి. కప్పును వంచి పూర్తిగా నీరు పోయేంత వరకూ వడకట్టండి.
స్టెప్ 3: పెరుగులో నీటిని పూర్తిగా వడకట్టిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకోండి. అందులో చిక్కటి పాలను కలపండి.
స్టెప్ 4: అందులో బాదంపప్పులను వేసి మిక్సీ సహాయంతో మెత్తగా చేసుకోండి.
స్టెప్ 5: ఆ తర్వాత ఆపిల్, అరటిపండు ముక్కలు కట్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రతి బ్రెడ్ ముక్క మీద స్ప్రెడ్ చేయాలి.
స్టెప్ 6: వాటి పైన తురిమిన బాదం పప్పులు, పెరుగుతో కలిపిన మిశ్రమాన్ని తీసుకుని పూర్తిగా గట్టిపడే వరకు ఫ్రీజర్‌లో 8 గంటల పాటు ఉంచండి.
స్టెప్ 7: అలా 8 గంటల పాటు ఉంచిన తర్వాత ఫ్రీజర్ నుండి తీసి రుచికరమైన బ్రెడ్ ఐస్ క్రీంను టేస్ట్ చేయండి.
గమనించాల్సిన విషయాలు:
- పెరుగును పూర్తిగా వడకట్టడం చాలా ముఖ్యం. అందులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఐస్ క్రీమ్ సరిగా గడ్డకట్టదు.
- ఇందులో చక్కెర కలిపిన పాలకు బదులుగా తేనె కూడా కలుపుకోవచ్చు.
- రుచి కోసం వెనీలా ఎసెన్స్, కోకో పౌడర్ లేదా ఇతర ఎసెన్స్ ఉపయోగిస్తే మరింత రుచిని జోడించినట్లు అవుతుంది.
- ఐస్‌క్రీమ్‌ను కచ్చితంగా 8 గంటలకు పైగా ఉంచాలి. అలా ఉంచిన ఐస్‌క్రీమ్‌ను బయటకు తీసిన కాసేపటికి తింటే బాగుంటుంది.
- ఇందులో మీకు, మీ ఫ్యామిలీకి నచ్చే ఫ్రూట్స్ కలుపుకోవచ్చు. యాపిల్, అరటిపండ్లు, ద్రాక్ష, కిస్‌మిస్ స్ట్రాబెర్రీలతో ఏ కాంబినేషన్ ట్రై చేసినా బాగుంటుంది. మీ రుచికి తగ్గట్టు ప్రిపేర్ చేస్తే సరిపోతుంది.
సమ్మర్ సీజన్ కాబట్టి, అందరూ ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. బయట కొనే బదులు ఇంట్లోనే రుచికరంగా తయారుచేసుకుంటే, కొత్త టేస్ట్ ట్రై చేయడంతో పాటు హెల్తీ కూడా. పిల్లలు ఐస్ క్రీం కోసం పట్టుబడితే ఇంట్లోనే తయారుచేసి ఇవ్వండి. దీనిని ఖచ్చితంగా ఇష్టపడతారు కూడా.
సంబంధిత కథనం