

Best Web Hosting Provider In India 2024

Kodavatancha Temple : కోరి మొక్కితే వరాలిచ్చే కొడవటంచ నారసింహుడు.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
Kodavatancha Temple : కొడవటంచ.. ఓరుగల్లు చారిత్రక, సుప్రసిద్ధ ఆలయాల్లో పేరుగాంచిన పుణ్యక్షేత్రం. వందల ఏళ్ల కిందట వెలిసిన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. ఇక్కడ వెలిసిన లక్ష్మీ సమేతా నారసింహుడు కోరి మొక్కితే వరమిస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా చెప్పుకొనే కొడవటంచ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. కొడవటంచ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గడ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఆదివారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగగా.. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం స్వామివారి కల్యాణం, తలంబ్రాల కార్యక్రమంతో అసలు జాతర ప్రారంభం కానుంది.
కొడవటంచ పేరెలా వచ్చిందంటే..
ఉమ్మడి వరంగల్ జిల్లా పురాతన ఆలయాలకు పెట్టింది పేరు. వాటిలో కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి. ఈ ఊరి పేరు కొడవటంచగా విలసిల్లడానికి ఇక్కడ వెలిసిన స్వామివారే కారణమని పూర్వీకులు చెబుతున్నారు. స్వామివారి పుణ్యక్షేత్రం, ఊరి పేరు వెనక పూర్వీకులు, ఇక్కడి అర్చకులు చెబుతున్న ప్రకారం.. ప్రాచీణ కథొకటి ప్రచారంలో ఉంది.
నీరు తోడుతుండగా..
దాదాపు 900 ఏళ్లకు పూర్వం.. ప్రస్తుత ఆలయ ధర్మకర్తల వంశస్తుడు తూపురాణి రంగాచార్యులు ఒకానొక రోజు అక్కడున్న చేదబావిలో నీరు తోడుతుండగా.. అందులో లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ దొరికింది. దానిని తీసి రంగాచార్యులు భద్రపరిచి, నిద్రకు ఉపక్రమించాడు. లేచి చూసేసరికి స్వామివారి విగ్రహం ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో మళ్లీ ఓ రోజు స్వామివారు రంగాచార్యుల కలలోకి వచ్చి, తాను అక్కడున్న పుట్టలో శిలావిగ్రహంలా నిక్షిప్తమై ఉన్నట్లు చెప్పాడు.
కొడవలి సాయంతో..
దీంతో రంగాచార్యులు పుట్ట వద్దకు వెళ్లి వెతికినా స్వామివారి విగ్రహం కనిపించకపోవడంతో.. పక్కనే ఉన్న కొడవలి సహాయంతో పుట్టను పెకిలించాడు. అందులో స్వామివారి విగ్రహం బయటపడగా.. విగ్రహానికి తగిలి కొడవలి వంగిపోయింది. దీంతో అప్పటినుంచి కొడవలిని వంచిన స్వామి పేరున.. ఆ ఊరికి కొడవటంచగా పేరు పెట్టినట్టు పూర్వీకులు చెబుతున్నారు. కాగా కొడవటంచ కాలక్రమేణా కోటంచగా మారగా.. ప్రస్తుతం రెండు పేర్లు వాడుకలో ఉండటం విశేషం.
రూ.12.15 కోట్లతో ఆలయ అభివృద్ధి..
లక్ష్మీ సమేతా నరసింహస్వామి వెలిసిన ప్రదేశంలోనే గతంలో పూజలు నిర్వహించగా.. దాదాపు వంద ఏళ్ల కిందట స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని పట్టించుకునే నాథులు లేక ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.12.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులో ప్రధానంగా విమాన గోపురం అర్ధ మండపం, మహా మండపం పునర్నిర్మాణానికి రూ.3.77 కోట్లు కేటాయించారు.
కొనసాగుతున్న పనులు..
అద్దాల మండపం కోసం రూ.5 లక్షలు, అల్వార్ నిలయానికి రూ.1.10 లక్షలు, పాకశాల భవనానికి రూ.7.5 లక్షలు, క్యూలైన్ల నిర్మాణానికి రూ.30 లక్షలు, అన్నదాన సంత్రానికి రూ.40 లక్షలు, ఆలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.15 లక్షలు, భక్తుల బస కోసం రూ.5.5 లక్షలు, రూ.50 లక్షలతో చుట్టూ కాంపౌండ్, తాగునీటి ట్యాంక్ కోసం రూ.30 లక్షలు, ఈవో, ఇతర అధికారుల ఆఫీస్ కోసం రూ.50 లక్షలు, అర్చకుల వసతి గృహాలకు రూ.50 లక్షలు, రేగొండలో అసంపూర్తిగా ఉన్న ఆర్చీ నిర్మాణానికి రూ.9.5 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.
స్వామివారిని కొలిస్తే..
స్వామివారి దర్శనానికి చత్తీస్‌గఢ్ తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మానసిక వ్యాధులతో బాధపడే వారు స్వామివారిని కొలిస్తే నయమవుతారని భక్తుల విశ్వాసం. సంతానం లేని వారు 40 రోజులపాటు ఉదయం, సాయంత్రం స్వామివారిని పూజిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా ఉంది. దీంతోనే ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిత్య పూజలతో కళకళలాడుతోంది.
బ్రహ్మోత్సవాలు..
మార్చి 9 ఆదివారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజుల్లోనే దాదాపు 10 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టారు.
ఏ రోజు.. ఏ కార్యక్రమం..
మార్చి 9న ఆదివారం ఉదయం అభిషేకం, సూర్య వాహన సేవతో పాటు రాత్రి 8 గంటలకు శేషవాహన సేవ (పుట్ట బంగారం సేవ), అంకురారోహణంతో బ్రహ్మోత్స వాల ప్రారంభం
10న ధ్వజరోహణంతోపాటు అశ్వవాహన సేవ, స్వామి వారి ఎదుర్కోలు, స్వామి వారి కల్యాణం
11న ఉదయం గజవాహన సేవ, రాత్రి చంద్రవాహన సేవ
12న ఉదయం సింహవాహన సేవ, రాత్రి గరుడోత్సవం, సదస్యం
13న ఉదయం హనుమంత వాహనసేవ, రాత్రి చిన్న రథసేవ, దోపో త్సవం
14న హోలీ పండుగ రోజున బోనాలు, జాతర, సాయంత్రం పెద్ద రథోత్సవం
15న నిత్యనిధితో పాటు జాతర మొక్కుబడి సేవలు, స్వామివారి ఉత్సవ విగ్రహాలు, గజవాహనాల ఊరేగింపు
16న ఉదయం చక్రస్నానం (అభి షేకం), జాతర రాత్రి పుష్పయాగం
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
టాపిక్