

Best Web Hosting Provider In India 2024

AP MPDOs : ఏపీ ఎంపీడీవోల నియామకాల్లో మార్పులు, డైరెక్ట్ నియామకం రద్దు
AP MPDOs : ఏపీలో మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను ఇకపై ఇంటర్ కేడర్ బదిలీల ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపీడీవో డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానానికి ముగింపు పలకనున్నారు. ఫీడర్ క్యాడర్ ఉద్యోగులకు పదోన్నతులతో ఎంపీడీవో పోస్టులను భర్తీ చేయనున్నారు.

AP MPDOs : రాష్ట్రంలో మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎంపీడీవోలు) పోస్టులను ఇక నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే విధానానికి ముగింపు పలకనున్నారు. అలాగే తప్పనిసరి శిక్షణతో పాటు ఇంటర్ కేడర్ బదిలీల అమలు చేయనున్నారు.
పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో)లను నేరుగా నియమించే విధానం రద్దుకానుంది. తక్కువ స్థాయి (ఫీడర్ క్యాడర్) ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, ఎంపీడీవో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 22న పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగ సంఘాలతో కమిషనర్ కృష్ణతేజ సమావేశం నిర్వహించి సంస్కరణల దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల క్యాడర్లలో వ్యత్యాసాలు లేకుండా సర్వీస్ నిబంధనల్లో సవరణలు చేస్తున్నారు.
ఇటీవలి రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ ఒక నోట్‌ను విడుదల చేశారు. ఏపీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్ రూల్స్-2001లోని సంబంధిత నిబంధనలను సవరించడానికి ఉత్తర్వులు జారీ చేసేందుకు అనుమతి ఇస్తూ నోట్ లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపినట్లు ఆయన నోట్‌లో పేర్కొన్నారు.
1. ఎంపీడీవో, డీఎల్‌వోపీలను ఒకే కేడర్‌గా నిర్ధారించడం.
2. డీవోపీ (ఏడీ కేడర్)ను డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డిప్యూటీ డైరెక్టర్ కేడర్), పంచాయతీరాజ్ శిక్షణ కళాశాలల ప్రిన్సిపాళ్లకు డిప్యూటీ కమిషనర్ (అడిషనల్ డైరెక్టర్) స్థాయికి అప్‌గ్రేడ్ చేయడం.
3. ఎంపీడీవోను నేరుగా నియమించే విధానాన్ని నిలిపివేయడం.
4. డీడీవో/ డీవోపీ/ డీప్యూటీ సీఈవో (1/3వ సబ్‌స్టాంటివ్ పోస్టులు) కోసం ప్రత్యక్ష నియామకాన్ని ప్రవేశపెట్టడం.
5. మండలాల్లో ప్రస్తుతం ఉన్న ఈవో (పీఆర్&ఆర్‌డీ)ని డీప్యూటీ ఎంపీడీవోగా పరిగణిస్తారు.
6. ప్రస్తుత నిబంధన ప్రకారం జెడ్పీ సీఈవో పోస్టులలో 50 శాతం ఐఏఎస్ అధికారులకు కేటాయిస్తారు. వారు అందుబాటులో లేనప్పుడు డివిజినల్ డెవలప్మెంట్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ డిప్యూటీ సీఈఓలను డిప్యూటేషన్ ద్వారా నియమిస్తారు. మొత్తం పోస్టుల్లో మూడోవంతు వీరికి కేటాయించనున్నారు. వీరు కూడా తగినంత మంది లేనప్పుడు ఇతర ప్రభుత్వ శాఖల అధి కారులను డిప్యుటేషన్‌పై తీసుకునే వెసులుబాటు కల్పించారు.
7. తప్పనిసరి శిక్షణతో ఇంటర్-కేడర్ బదిలీల అమలు
ఉద్యోగులు వారి కేడర్‌తో సంబంధం లేకుండా ఎంపీడీవో, డీడీవో, డీపీవో, సీఈవో మొదలైన కార్యాలయ పదవుల అధిపతిగా పదోన్నతి పొందుతారు. వారి పదోన్నతులు పొందే ముందు ఫౌండేషన్ ఇన్ట్సిట్యూషనల్ ట్రైనింగ్‌తో ఆన్ జాబ్ ట్రైనింగ్ అవసరం. అందువల్ల పదోన్నతి పొందే ముందు ఇతర ఉద్యోగాలకు ఎక్స్‌పోజర్ పొందడానికి ఇంటర్ కేడర్‌కి ఒక నిబంధన చేయాలి. సీనియారిటీలో చాలా వర్టికల్ విధానాన్ని నివారించాలి. దానిని సరళీకృతం చేయడానికి, హేతుబద్ధీకరించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
టాపిక్