

Best Web Hosting Provider In India 2024

soyachunks pakodi: మీల్‌మేకర్ పకోడీ ఎప్పుడైనా తిన్నారా? ఈ రెసిపీతో చేసి చూడండి బెస్ట్ స్నాక్ ఇది అంటారు!
soyachunks pakodi: మీల్‌మేకర్ తో కర్రీ, ఫ్రైడ్ రైస్ మాత్రమే కాదు కరకరలాడే పకోడీలు కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్‌గా, చాలా త్వరగా. రుచిలో కూడా మీల్‌మేకర్ పకోడీలు ది బెస్ట్ అనుకోండి. ఎలా తయారు చేయాలో చూసేద్దా రండి.

మీల్‌మేకర్లు ఆరోగ్యానికి చేసే మేలు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఎన్నో రకాల ప్రొటీన్లు కలిగిన మీల్‌మేకర్ ఎముకల నుంచి గుండె వరకూ, హార్మోన్ సమస్యల నుంచి అరుగుదల వరకూ చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. అందుకే వీటిని ఏదో ఓక రకంగా తమ డైట్లో చేర్చుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు. మీల్‌మేకర్‌తో మీరు ఇప్పటి వరకూ కర్రీ తిని ఉండచ్చు, మీల్‌మేకర్ రైస్ కూడా రుచి చూసే ఉండచ్చు. ఈసారి కొత్తగా మీల్‌మేకర్ పకోడీని ట్రై చేసి. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వీటిని చేసి పెట్టారంటే వారు చాలా సరదాగా తినేస్తారు. ఇంటికి వచ్చిన అతిథులకు అప్పటికప్పుడు ఈజీగా, త్వరగా వీటిని తయారు చేసి పెట్టచ్చు. రుచిలో కూడా మీల్‌మేకర్ పకోడీలు అద్భుతంగా ఉంటాయి. మరి వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా..
మీల్‌మేకర్ పకోడీ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు:
- ఒక కప్పు మీల్‌మేకర్
- రెండు టేబుల్ స్పూన్ల పెరుగు
- అర టీస్పూన్ కారం
- పావు టీస్పూన్ పసుపు
- అర టీస్పూన్ ధనియాల పొడి
- అర టీస్పూన్ గరం మసాలా
- అర టీస్పూన్ జీలకర్ర పొడి
- ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- కరివేపారు రెబ్బలు
- రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్
- రుచికి తగినంత ఉప్పు
- డీప్ ఫ్రైకి సరిపడా నూనె
మీల్‌మేకర్ పకోడీ తయారీ విధానం..
- మీల్‌మేకర్ పకోడీ తయారు చేయడం కోసం ముందుగా ఓక వెడల్పాటి బౌల్ తీసుకుని దాంట్లో గోరు వెచ్చని నీరు పోయండి. దీంట్లోనే శుభ్రంగా కడిగిన మీల్‌మేకర్లను వేసి నానబెట్టండి.
- పావుగంట పాటు నానిన మీల్‌మేకర్లలో నుంచి నీటిని వడకట్టి తడి లేకుండా గట్టిగా పిండి పక్కు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో పెరుగు వేసి గడ్డలు లేకుండా చక్కటి పేస్టులా తయారయ్యేంత వరకూ బాగా చిలకండి.
- తరువాత ఈ పెరుగులో కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లులి పేస్ట్, సన్నగా తురిమిన కరివేపాకు రెబ్బలు, కార్న్ ఫ్లోర్ రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి.
- ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టి తడి లేకుండా గట్టిగా పిండుకుని పక్కకు పెట్టుకున్న మీల్‌మేకర్లను వేయండి.
- మీల్‌మేకర్లకు మసాలాలు, కార్న్ ఫ్లోర్ అన్నీ పట్టేంతవరకూ చేత్తో బాగా కలపండి.
- ఇలా కలిపిన మీల్‌మేకర్ మసాలా మిశ్రమాన్ని అరగంట పాటు అలాగే వదిలేయండి.
- అరగంట తర్వాత డీప్ ఫ్రై చేయడానికి సరిపోయే ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె పోసి వేడి చేయండి.
- నూనె బాగా వేడెక్కిన తర్వాత మారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న మీల్‌మేకర్లను ఒక్కొక్కటిగా నూనెలో వేసి వేయించండి.
- వీటిని మధ్య మధ్యలో తిప్పుతూ చక్కటి బంగారు రంగులోకి మారేంత వరకూ వేయించండి.
- మీల్‌మేకర్లు క్రిస్పీగా మారిన తర్వాత బయటకు తీసి ఒక బౌల్‌లో వేసుకుని చాట్ మసాలాను పైపైన చల్లుకున్నారంటే కరకరలాడే మీల్‌మేకర్ పకోడీ రెడీ అయినట్టే.
దీన్ని సాయంత్రం టీ, కాఫీలతో పాటు గానీ లేదా కెచప్, సాస్ వంటి వాటితో గానీ తిన్నారంటే వావ్ అనకుండా అస్సలు ఉండలేరు. కావాలంటే ట్రై చేసి చూడండి.
సంబంధిత కథనం
టాపిక్