


Best Web Hosting Provider In India 2024
Syria clashes : ప్రతీకార దాడులతో రగిలిపోతున్న సిరియా- 1000మంది మృతి, మహిళలను నగ్నంగా ఊరేగించి..
Syria clashes : సిరియాలో సాయుధులు- మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 1000కిపైగా మంది మరణించారు. అనేక ప్రాంతాల్లో మహిళలను వీధుల్లోకి ఈడ్చుకొచ్చి, నగ్నంగా ఊరేగించి, కాల్చి చంపేశాారు!

దశాబ్ద కాలంగా అల్లకల్లోలాలు, రక్తపాతానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన సిరియా.. హింసాత్మక ఘర్షణలతో మళ్లీ అట్టుడుకుతోంది. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారులు- భద్రతా దళాల మధ్య రెండు రోజులు పాటు సాగిన ఘర్షణల్లో 1000కిపైగా మంది మరణించారు. ఈ పరిస్థితుల మధ్య అనేక నగరాల్లోని వీధులపై మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఈ హింసకు ముగింపు పడిందని అధికారులు చెబుతున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా ఆందోళకరంగానే ఉన్నట్టు సమాచారం.
సిరియాలో తాజా హింసకు కారణాలు..
సిరియాలో ఇటీవలే అధికారం మారిన విషయం తెలిసిందే. కాగా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్‌కి నమ్మకస్తులుగా పేరు సంపాదించుకున్న మైనారిటీ అలవైట్ ప్రజలను ఇప్పుడు టార్గెట్ చేశారు. ఆ అలవైట్లకు అసద్ పాలనలో అనేక పవర్స్ ఉండేవి. అనేక టాప్ ర్యాంకుల్లో వారు ఉండేవారు. చాలా విశాలవంతమైన జీవితాలు గడిపినవారు కూడా ఉన్నారు.
కానీ సిరియాలో అధికారం మారడంతో అలవైట్ల పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. మూడు నెలలుగా వీరిపై ‘ప్రతీకార’ దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే గురువారం వీరిపై సాయుధులు అనేక ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డారు.
సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమెన్ రైట్స్ ప్రకారం.. తాజా హింసాకాండలో 745మంది పౌరులు మరణించారు. 125మంది ప్రభుత్వ భద్రతా దళాలు, అసద్‌తో సంబంధం ఉన్న మిలిటెంట్ గ్రూప్‌నకు చెందిన 148మంది మృతిచెందారు.
హింసకు తాత్కాలికంగా ముగింపు పడిందని అధికారులు చెబుతున్నారు. హింసాకాండ చెలరేగిన అనేక ప్రాంతాలు ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే రోడ్లను మూసివేసినట్టు వివరిస్తున్నారు.
కానీ సిరియాలోని అనేక చోట్ల పరిస్థితులు ఇప్పటికీ ఆందోళనకరంగా, ప్రజల జీవితాలు దయనీయంగానే ఉన్నట్టు అబ్జర్వేటరీ చెప్పింది. అలవైట్లు అధికంగా ఉండే లటకియా నగరంలో హింస చెలరేగిందని, దానితో పాటు విద్యుత్- మంచి నీటి సరఫరా కూడా నిలిచిపోయిందని పేర్కొంది.
వీటితో పాటు అనేక ఇళ్లు దోపిడీకి గురయ్యాయయని, అనేక నివాసాలకు దుండగులు నిప్పంటించారని తెలుస్తోంది.
ఈ పరిస్థితుల మధ్య భయంతో బిక్కుబిక్కుమంటు బతకడం కంటే ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న కొందరు అలవైట్లు సిరియాని వదిలి లెబనాన్‌కి వలస వెళ్లిపోతున్నారు.
మహిళలను నగ్నంగా ఊరేగించి..
హింసతో కొట్టుమిట్టాడుతున్న సిరియా నుంచి మరిన్ని ఆందోళనకర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలను ఇళ్ల నుంచి లాక్కొచ్చి, వారిని నగ్నంగా చేసి వీధుల్లో ఊరేగించారని, ఆ తర్వాత వారిని కాల్చి చంపేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
బనియస్ అనే పట్టణంలో అనేక మృతదేహాలు రోడ్ల మీద పడి ఉన్నాయి. కొన్ని శవాలు ఇళ్ల పైకప్పు మీద వేలాడుతూ కనిపించాయి.
“చాలా బాధాకరం! మృతదేహాలు వీధుల్లో ఉండిపోయాయి. ఆయుధాలు పట్టుకున్నవారు మాత్రం.. మృతులకు అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకోవడం లేదు,” అని ఒక స్థానికుడు మీడియాకు చెప్పాడు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link