

Best Web Hosting Provider In India 2024

AP Health Survey : ఏపీలో బీపీ ఎక్కువే.. ఆ తర్వాత షుగర్.. కారణాలు, పరిష్కారాలు ఏంటి?
AP Health Survey : జీవనశైలి మారుతోంది. శారీరక శ్రమ తగ్గుతోంది. జంక్ ఫుడ్ ఎక్కువ అవుతోంది. ఫలితంగా మన రాష్ట్రంలో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎన్‌సీడీ సర్వే-3లో ఈ విషయం వెల్లడైంది. బీపీలో కోనసీమ, షుగర్‌లో కృష్ణా జిల్లాలు ముందున్నాయి.

బీపీ, షుగర్.. ఈ రెండూ ఒకదానితో మరొకటి చెట్టాపట్టాలు వేసుకుని ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం.. ఇలా కారణాలేమైనా రాష్ట్రంలో బీపీ, షుగర్ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇటీవల వైద్యఆరోగ్య శాఖ నిర్వహించిన ఎన్‌సీడీ సర్వే-3లో బీపీలో కోనసీమ, మధుమేహంలో కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉన్నాయి.
కోటీ 34 లక్షల మంది వివరాలు..
రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారు 4 కోట్లకు పైగా ఉన్నారు. మూడో సర్వేలో ఇప్పటివరకు కోటీ 34 లక్షల మంది వివరాలను సేకరించారు. వారిలో 14.73 శాతం మంది రక్తపోటు, 11.78 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నారు. వైద్యారోగ్య శాఖ గతేడాది నవంబర్ నుంచి రాష్ట్రంలో క్యాన్సర్, బీపీ, షుగర్ బాధితులను గుర్తిస్తోంది. అదే సమయంలో జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం విడతల వారీగా సర్వే చేస్తున్నారు. ఇప్పటికే రెండు సర్వేలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో సర్వే కొనసాగుతోంది.
ప్రతీ ఇంటికి వెళ్లి..
ఆరోగ్య కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులపై ఆరా తీస్తున్నారు. ఈ సర్వేలో ఎక్కువగా బీపీ, షుగర్‌తో ఎక్కువమంది బాధపడుతున్నట్టు తేలింది. పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్ కారణంగా బీపీ, షుగర్ బాధితులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. శారీరక శ్రమ చేసేవారిలో బీపీ, షుగర్ వంటి సమస్యలు తక్కువగా ఉన్నట్టు సర్వేలో స్పష్టమవుతోంది.
బీపీ కంట్రోల్ ఇలా..
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు (సోడియం) తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. నడక, పరుగు, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయవచ్చు. అధిక బరువు ఉంటే, బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలి.
సరిపడా నిద్ర అవసరం..
యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను ప్రయత్నించాలి. సరిపడా నిద్రపోవాలి. మద్యపానం, ధూమపానం మానుకోవాలి. మద్యపానం, ధూమపానం రక్తపోటును పెంచుతాయి. వీటిని మానుకోవడం వలన బీపీ అదుపులో ఉంటుంది. క్రమం తప్పకుండా రక్తపోటును తనిఖీ చేయించుకోవాలి. వైద్యుడు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
షుగర్ కంట్రోల్ ఇలా..
అన్నం, బంగాళాదుంపలు, తీపి పదార్థాలు వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, చేపలు, మాంసం, పప్పులు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తగినంత తీసుకోవాలి. తక్కువ GI ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడవడం, సైకిల్ తొక్కడం లేదా ఈత కొట్టడం వంటి వ్యాయామాలు చేయాలి.
టాపిక్