

Best Web Hosting Provider In India 2024

Karimnagar News : కరీంనగర్ లో అనాథ యువతికి వివాహం- కలెక్టర్, ఎమ్మెల్యే పెళ్లి పెద్దలు
Karimnagar News : కరీంనగర్ లో అనాథ యువతికి ఉద్యోగులు అండగా నిలిచారు. బాలసదనంలో పెరిగి పెద్దైన యువతికి కలెక్టర్, ఎమ్మె్ల్యే పెద్దలకు వ్యవహరించి వివాహం చేశారు. కరీంనగర్ లో కళాభారతి వేదికగా ఆదివారం ఉదయం 11 గంటల 10 నిముషాలకు యువతికి వైభవంగా వివాహం జరిపించారు.

Karimnagar News : అమ్మా నాన్న లేని అనాథకు అధికారులు అండగా నిలిచారు. అయిన వారు కానరాని పరిస్థితిలో అన్నీ తామై పెళ్లి చేశారు. అనాథ అమ్మాయికి వైభవంగా కరీంనగర్ లో వివాహం జరిపించి ఓ ఇంటి వారిని చేశారు. ఎవరు లేరని బాధపడొద్దు మేమున్నామని చాటిచెప్పి మానవత్వాన్ని చాటుకున్నారు.
మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించే బాలసదనంలో పెరిగిన అనాథ అమ్మాయి మౌనిక అలియాస్ పూజ వివాహం వైభవంగా జరిగింది. చిన్నప్పుడే అమ్మా నాన్న కన్నాల యశోద మల్లయ్య కాలం చేయడంతో మౌనికతోపాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లను స్థానికులు బాలసదనంలో చేర్పించారు. చదువుకుంటూ పెరిగి పెద్దైన మౌనికకు పెళ్లీడు రావడంతో మంథనికి చెందిన బండారి కళావతి-వెంకన్న దంపతుల ఏకైక కుమారుడు సాయితేజ అనాథ అమ్మాయి మౌనికను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు.
పెళ్లి పెద్దలుగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వ్యవహరించారు. జిల్లా అధికార యంత్రాంగం అమ్మాయికి అండగా నిలిచి అందరినీ అహ్వానిస్తూ శుభలేఖలు పంచారు. కరీంనగర్ లో కళాభారతి వేదికగా ఆదివారం ఉదయం 11 గంటల 10 నిముషాలకు వైభవంగా వివాహం జరిపించారు.
నవదంపతులను ఆశీర్వదించిన అతిథులు
మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచి ఆలుమగలుగా మారిన మౌనిక సాయితేజ నవదంపతులను అధికారులు ప్రజాప్రతినిధులు బంధుమిత్రులు ఆశీర్వదించారు. అమ్మానాన్న లేనంత మాత్రాన తమకు ఎవరు లేరని బాధపడొద్దని అనాథలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మౌనికతోపాటు ఆమె ఇద్దరు చెల్లెళ్ల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మౌనికకు ఏ లోటు లేకుండా అన్ని తామై చూసుకుంటామని తెలిపారు. మౌనిక వివాహానికి హాజరైన వారు నవదంపతులను ఆశీర్వదించి కట్నకానుకలు సమర్పించి విందు భోజనాన్ని ఆరగించారు.
మౌనికను చదివించాలి – కలెక్టర్
మౌనిక అనాథ కాదని… అందరం కలిసి ఓ ఇంటి వారిని చేశామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మౌనికను పెళ్లి చేసుకున్న సాయితేజను అభినందిస్తూ ఆమెను బాగా చదివించాలని కోరారు. అమ్మానాన్న లేని మౌనిక ఇద్దరు చెల్లెళ్ళను సాయితేజ కుటుంబం సొంత పిల్లలుగా చూసుకోవాలని సూచించారు. అనాథలు తమకు ఎవరు లేరని బాధపడొద్దని అధికారులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. మౌనికకు తాము ఉన్నామని అనాథ కాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
అభినందనల వెల్లువ
కళాభారతి వేదికగా కళ్యాణం నిర్వహించిన అధికార యంత్రం, మౌనికకు కట్నం కానుకలు సమర్పించి అత్తగారింటికి సాగనంపారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగం దగ్గరుండి మౌనిక వివాహతంతును పూర్తి చేశారు. అనాథ యువతిని అధికారులు అక్కున చేర్చుకొని ఆదర్శంగా వివాహం జరిపించడం అందరు అభినందిస్తున్నారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్