Lauki Carrot Pancakes: హెల్తీగా, క్రిస్పీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ కావాలా? ఇదిగోండి సొరకాయ, క్యారెట్ ప్యాక్ కేక్స్ రెసిపీ

Best Web Hosting Provider In India 2024

Lauki Carrot Pancakes: హెల్తీగా, క్రిస్పీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ కావాలా? ఇదిగోండి సొరకాయ, క్యారెట్ ప్యాక్ కేక్స్ రెసిపీ

Ramya Sri Marka HT Telugu
Published Mar 10, 2025 06:30 AM IST

Lauki Carrot Pancakes: బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా ఉండటమే కాకుండా క్రిస్పీగా, రుచిగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే సొరకాయ క్యారెట్‌తో ఇలా ప్యాన్ కేక్స్ తయారు చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం చాలా సులువు కూడా. ఎలాగో తెలుసుకుందాం రండి.

సొరకాయ, క్యారెట్‌తో తయారు చేసిన రుచికరమైన ప్యాన్ కేక్స్
సొరకాయ, క్యారెట్‌తో తయారు చేసిన రుచికరమైన ప్యాన్ కేక్స్

ఉదయాన్నే ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు నాలుకకు కాస్త రుచిగా ఉండే ఆహారం తినాలనేదే మీ లక్ష్యమా? రొటీన్‌గా ఇడ్లీ, దోస కాకుండా కొత్తగా కూరగాయలతో తయారు చేసుకుని తింటే మరింత బాగుంటుందని ఫీలవుతున్నారా? అయితే ఈ క్రిస్పీ అండ్ హెల్తీ రెసిపీ మీ కోసమే. సొరకాయ, క్యారెట్‌తో తయారు చేసి చూడండి. ఇవి ఉదయాన్నే పిల్లుల ఇష్టంగా తినేలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇక రుచి గురించి చెప్పనక్కర్లేదు అనుకోండి. తిన్నారంటే ఎవ్వరైనా మెచ్చుకుని తీరాల్సిందే. సొరకాయ క్యారెట్ ప్యాన్‌కేక్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి..

లౌకీ క్యారెట్ ప్యాన్ కేక్స్ తయారీకి కావలసిన పదార్థాలు:

  • లౌకి అంటే సొరకాయ తురుము- 1/2 కప్పు
  • క్యారెట్ తురుము – 1/2 కప్పు
  • సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు – 1/3 కప్పు
  • సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర- 1 టేబుల్ స్పూన్
  • శనగపిండి- 1 1/2 టేబుల్ స్పూన్లు
  • బియ్యం పిండి- 2 టేబుల్ స్పూన్లు
  • నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
  • పసుపు పొడి- చిటికెడు
  • జీలకర్ర పొడి- 1/3 స్పూన్
  • ఉప్పు- రుచికి తగినంత
  • నల్ల మిరియాల పొడి- 1/3 స్పూన్

సొరకాయ క్యారెట్ ప్యాన్ కేక్ తయారీ విధానం..

  1. సొరకాయ క్యారెట్ ప్యాన్ కేక్ తయారీ కోసం ముందుగా ఒక సొరకాయను తీసుకుని తొక్కతీసి సన్నగా తురుముకుని పక్కకు పెట్టుకోండి.
  2. తరువాత రెండు లేదా మూడు క్యారెట్లను తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తురిమి పక్కకు పెట్టుకోండి.
  3. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో సొరకాయ తురుము, క్యారెట్ తురుము వేయండి.
  4. తరువాత దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, వేసి అన్నింటినీ బాగా కలపండి.
  5. ఇప్పుడు ఈ మిశ్రమంలో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు వేయండి.
  6. తరువాత దీంట్లోనే శనగపిండి, బియ్యం పిండి కూడా వేసి కొద్దిగా నీరు పోసి అన్నీ కలిసిపోయేంత వరకూ చేత్తో బాగా కలపండి.
  7. నీరు ఒకటి లేదా రెండు స్పూన్లు వేస్తే చాలు. ఈ మిశ్రమం వదులుగా కాకుండా గట్టిగా కాకుండా ఉంటేనే ప్యాన్ కేక్స్ చక్కగా తయారవుతాయి.
  8. సొరకాయ, క్యారెట్ తురుముకు పిండి, మసాలాలు అన్నీ చక్కగా పట్టేంత వరకూ బాగా కలిపి మూత పెట్టి ఒక పావుగంట పాటు అలాగే వదిలేయండి.
  9. పావుగంట తర్వాత మూత తీసి మరోసారి బాగా కలపండి.
  10. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లొ నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయండి.
  11. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ నేరుగా పెనం మీద చిన్న చిన్న కేకుల్లా వేసి నొక్కాలి.
  12. వీటిని తయారు చేసేటప్పుడు స్టవ్ మీడియం లేదా చిన్న మంట మీద మాత్రమే ఉండాలని గుర్తుంచుకోండి.
  13. ఇలా తక్కువ మంట మీద 5 నుంచి 10నిమిషాల పాటు ఉడికించి కేకును మరోవైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి.దీని మీద కూడా కాస్తంత నూనె లేదా నెయ్యి వేసుకోవాలి.
  14. ఇలా రెండు వైపులా చిన్న మంట మీద వేయించడం వల్ల ప్యాన్‌కేక్ బయట క్రిస్పీగా, లోపల బాగా ఉడికి రుచికరంగా తయారవుతుంది.
  15. ప్యాన్ కేక్ రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకూ వేయించుకున్నారంటే క్రిస్పీ అండ్ హెల్తీ లౌకీ(సొరకాయ)క్యారెట్ ప్యాన్ కేక్స్ తయారు అయినట్టే. మిగిలిన మిశ్రమంతో కూడా ఇలాగే ప్యాన్ కేక్స్ తయారు చేసుకుని వేయించండి.

వీటిని సాస్, కెచప్ లేదా పెరుగుతో నంచుకుని తిన్నారంటే అదిరిపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతిఒక్కరూ తినచ్చు. డీప్ ఫ్రై లేకుండా ఆరోగ్యానికి మేలు చేసే వెజీస్ తో తయారయ్యే ఈ ప్యాన్ కేక్స్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అయినా తినచ్చు, సాయంత్రం స్నాక్స్ గా కూడా తినచ్చు. ఎలా అయినా దీని రుచి ప్రతిఒక్కరికీ చాలా బాగా నచ్చుతుంది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024