Best Web Hosting Provider In India 2024

ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర.. ఇష్టం వచ్చినన్నే కొనుగోలు
కొవ్వు, ఎస్ఎన్ఎఫ్ శాతం సాకుతో అడ్డగోలుగా కోత
లీటర్‌కు రూ.10 నుంచి రూ.25 వరకు నష్టపోతున్న రైతులు
కూటమి సర్కార్ వచ్చిన తర్వాత 90 శాతానికి పైగా మూతపడిన అమూల్ పాల కేంద్రాలు
గతేడాది ఇదే నెలలో లీటర్ గేదె పాలు రూ.89–112, ఆవుపాలు రూ.44–54
ప్రస్తుతం గేదె పాలు రూ.40–50, ఆవుపాలు రూ.25–30
‘సీమ’ జిల్లాల్లో ఆవు పాల ధరకే గేదె పాలు సేకరిస్తున్న డెయిరీలు
భారీగా పెరిగిన దాణా ఖర్చులు.. దొరకని పశుగ్రాసం
ధర గిట్టుబాటు కాక నిర్వహణ భారం తట్టుకోలేక పశువులను అమ్మేసుకుంటున్న రైతులు
ప్రైవేటు డెయిరీలకు వత్తాసు పలుకుతున్న కూటమి ప్రభుత్వం
అమరావతి : పాడి రైతు చితికిపోతున్నాడు. ఓ వైపు దాణా ధరలు చుక్కలనంటుతుంటే మరోవైపు పశుగ్రాసం దొరకని దుస్థితి. పశు పోషణ భారంగా తయారైన ప్రస్తుత తరుణంలో పాల సేకరణ ధరలు పెంచాల్సింది పోయి ప్రైవేటు డెయిరీలు తగ్గించేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో తమకు నచ్చిన ధర చెల్లిస్తూ పాడి రైతులను ప్రైవేటు డెయిరీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వారు చెప్పిందే ధర.. చెల్లించిందే రొక్కం.. అన్నట్టుగా తయారైంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గేదె పాల సేకరణపై ప్రైవేటు డెయిరీలు విధిస్తోన్న ఆంక్షలు పాడి రైతులకు శాపంగా మారాయి. అరకొరగా సేకరించడంతోపాటు ఆవు పాల ధరలే ఇస్తున్నారు. వెన్న శాతం ఎంత ఉన్నా సరే తాము చెప్పిన ధరకు ఇస్తామంటేనే తీసుకుంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో చేసేది లేక అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ పాలనలో గిట్టుబాటు ధర లేక పాడి రైతులు జీవనాధారమైన పశు సంపదను తెగనమ్ముకోవాల్సి వస్తోంది.
నాడు అమూల్‌తో పాల విప్లవం..
వైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో 2020 అక్టోబర్‌లో జగనన్న పాల వెల్లువ (అమూల్) కేంద్రాలను ప్రారంభించింది. 19 జిల్లాలో 4,798 గ్రామాల నుంచి పాలసేకరణ జరిగేది. 4.75 లక్షల మంది నుంచి రోజుకు సగటున గరిష్టంగా 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ చేసేది. ప్రారంభంలో 10 శాతం వెన్నతో లీటర్ ఆవు పాలకు రూ.25–28, గేదె పాలకు రూ.56–60 చొప్పున ప్రైవేట్ డెయిరీలు చెల్లించగా, అమూల్ ప్రారంభంలోనే గేదె పాలకు (11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) లీటర్‌కు రూ.71.47, ఆవు పాలకు (5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.34.20 చొప్పున చెల్లించింది.
ఆ తర్వాత వరుసగా ఏడు సార్లు ధర పెంచడంతో గతేడాది మే నాటికి గేదె పాలకు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లించేది. 40 నెలల్లో ఏడుసార్లు పాల సేకరణ ధరలు పెంచడంతో లీటర్ గేదె పాలపై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెరిగింది. ఫలితంగా జేపీవీ (జగనన్న పాల వెల్లువ) ప్రాజెక్టు కింద అమూల్‌కు పాలుపోసే రైతులకు రూ.97.86 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది.
అమూల్‌తో పోటీని తట్టుకోలేక పాల సేకరణ ధరలు పెంచడం వల్ల ప్రెవేటు డెయిరీలకు పాలుపోసే రైతులకు రూ.4,911 కోట్ల మేర అదనంగా లబ్ధి కలిగింది. మరో వైపు వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి అణాపైసలతో సహా లెక్కగట్టి పది రోజులకోసారి నేరుగా వారి ఖాతాలకు డబ్బు జమ చేసేవారు. ఫలితంగా గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున గరిష్టంగా ధర లభించింది.
లీటర్‌కు ఏటా రూ.2–5 పెంచడమే గగనమనే ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలకు లీటర్‌పై రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. అయినప్పటికీ ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే అమూల్ పాల సేకరణ ధరలు 10–20 శాతం అధికంగానే ఉండేవి. సీజన్‌తో సంబంధం లేకుండా వెన్న, ఘన పదార్థాల శాతాన్ని బట్టి అమూల్ ఒకే రీతిలో చెల్లించి పాడి రైతులకు మేలు చేసింది.
నేడు పాడి రైతుల నిలువు దోపిడీ
ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక అమూల్ పాలసేకరణ నుంచి తప్పుకుంటోంది. ఇప్పటికే 14 జిల్లాల్లో పాలసేకరణ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, అన్నమయ్య జిల్లాల్లో కేవలం ఐదారు వందల గ్రామాల్లో నామమాత్రంగా పాలసేకరణ చేస్తోంది. గతేడాది ఇదే సమయంలో రోజుకు 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ చేయగా, ఈ ఏడాది కేవలం 50–60 వేల లీటర్లకు మించి సేకరించలేని దుస్థితి ఏర్పడింది.
గతంలో మంచి ధర లభించడంతో అమూల్‌కు పాలు పోసే ప్రతి ముగ్గురిలో ఒక పాడి రైతు 2–3 ఆవులను కొనుగోలు చేశారు. ఇప్పుడు పాల సేకరణ ధరలు పడిపోవడంతో రైతులు ఆవులను అమ్ముకుంటున్నారు. ఇదేసాకుగా ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు లీటర్‌కు రూ.15–40 మేర తగ్గించేయడంతో పాడి రైతుల జీవనోపాధికి గండి పడింది. వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాలతో సంబంధం లేకుండా 15 రోజులకోసారి సగటు ధర నిర్ణయిస్తుండడంతో ఒక్కో పాడి రైతు సగటున రోజుకు రూ.100–300 వరకు నష్టపోతున్నాడు.
రాయలసీమ, ఇటీవల ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీ వారు రోజు10 లీటర్లు పాలు పొసే రైతు నుంచి ఒక లీటర్, ఐదు లీటర్లు పాలు పొసే రైతుకు అరలీటర్ వెనక్కి ఇచ్చేస్తున్నారు. రైతులు ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వం చేయడం లేదు. గోశాలల పేరిట హంగామా చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో పాడి రైతులకు ఒక్కటంటే ఒక్క పాడి గేదె ఇచ్చిన పాపాన పోలేదు.
రైతుల వద్ద ఉన్న పాడిలో 25 శాతం తగ్గిపోయిందని లైవ్ స్టాక్ సెన్సెస్ స్పష్టం చేస్తోంది. జీడీపీ, జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలేస్తూ కాలం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో తగ్గిపోతున్న పాడి, పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం లేదు. మరొక వైపు రిటైల్ మార్కెట్లో పాల విక్రయ ధరలు ప్రైవేటు డెయిరీలు ఇష్టమొచ్చినట్టుగా పెంచేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్నాయి. అర లీటర్ ప్యాకెట్ ఫుల్ క్రీమ్‌తో రూ.32–37, రిచ్ గోల్డ్ పాలు రూ.30–32, గోల్డ్ పాలు రూ.28–30 చొప్పున విక్రయిస్తూ దోపిడీకి గురిచేస్తున్నాయి.
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లు తయారైంది పాల ధర. దీనివల్ల అటు పాడి రైతూ లాభ పడటం లేదు. ఇటు ప్రజలకూ మేలు జరగడం లేదు. మధ్యలో ప్రైవేట్ డెయిరీలు మాత్రం ఇష్టానుసారం దండుకుంటున్నాయి. ఇష్టానుసారం ధర నిర్ణయిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పైగా రైతులకు అండగా నిలిచిన అమూల్ డెయిరీని తరిమేస్తూ ప్రైవేట్ డెయిరీ దందాను ప్రోత్సహిస్తోంది.
పాలకు ధర లేదు
అమూల్ డెయిరీ పాల సేకరణను ఆపేయించడంతో ధరలు లేకుండా పోయాయి. దీంతో మాకున్న ఆవుల్లో సగానికిపైగా అమ్ముకోవాల్సి వచ్చింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పాల ధర లీటర్‌పై రూ.15 నుంచి 20 వరకు తగ్గించారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పోయండి.. లేదంటే మానుకోండి.. అంటున్నారు. చేసేదీ ఏమీ లేకు ఆవులను అమ్ముకుంటున్నాం. – విమల, కురవపల్లి, చిత్తూరు జిల్లా
రైతుల పొట్ట కొడుతున్నారు
అమూల్ డెయిరీ ఉన్నప్పుడు ప్రైవేటు డెయిరీలన్నీ గిట్టుబాటు ధర చెల్లించేవి. కూటమి ప్రభుత్వం రావడంతో కక్ష కట్టి అమూల్ కేంద్రాలను సాగనంపుతోంది. సహాయ నిరాకరణ చేస్తోంది. పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పోటీ లేకపోవడంతో ప్రైవేటు డెయిరీలు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అమూల్ డెయిరీకి పాలు పోసేటప్పుడు లీటర్ ఆవు పాలకు రూ.40–45 వచ్చింది. కానీ విధి లేని పరిస్థితిలో ప్రైవేటు డెయిరీలకు తక్కువ ధరకు పాలు పోయాల్సి వస్తోంది. – అచ్చమ్మ, అంగళ్లు,, అన్నమయ్య జిల్లా
ఇష్టానుసారం కొనుగోలు
ప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తూ పాలు కొనుగోలు చేస్తున్నాయి. 2024 ఏప్రిల్ వరకు లీటరు ధర రూ.80 ఉండగా, ప్రస్తుతం రూ.70–75తో కొనుగోలు చేస్తున్నారు. హెరిటేజ్, శ్రీనివాస డెయిరీలు వారి ఇష్టం కొద్దీ ధరలు నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తున్నారు. రైతు ధర నిర్ణయించి అమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. – శ్రీనివాసులు, రైతు నగరం, నంద్యాల
బయటి వాళ్లకు విక్రయిస్తున్నా
నాకు మూడు పాడి గేదెలున్నాయి. రెండు పూటలా 16 లీటర్ల పాలిస్తాయి. పాలలో వెన్నశాతం తక్కువగా వస్తోందనే సాకుతో ప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారం ధర తగ్గించేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలకు 5 లీటర్లు, బయటి వారికి 10 లీటర్ల పాలను విక్రయిస్తున్నాను. బయటి వారు లీటర్‌కు రూ.50 ఇస్తుంటే ప్రైవేటు డెయిరీలు మాత్రం రూ.32–34 ఇస్తున్నారు. – వావిలపల్లి హరిబాబు, ధవుమంతపురం, మన్యం జిల్లా
గతంలో లీటర్‌కు రూ.69..
ఆవు పాల ధర తగ్గించారు. గతంలో లీటర్‌కు రూ.69 వరకు ఇచ్చేవారు. విశాఖ డెయిరీ లీటర్‌కు రూ.3–5 తగ్గించేసింది. పాడి రైతులకు పెద్దగా గిట్టుబాటు రాక బయటి వాళ్లకు అమ్ముకుంటున్నాం. – పి.వెంకటరావు, యలమంచలి, అనకాపల్లి జిల్లా