

Best Web Hosting Provider In India 2024

Chittoor Murder: చిత్తూరు జిల్లాలో దారుణం… మద్యం మత్తులో సోదరుడి కుమారుడి హత్య చేసి పరారీ…
Chittoor Murder: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో అన్న కొడుకును సొంత బాబాయి హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Chittoor Murder: చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం చిన్నరాజుకుప్పంలో అన్న కొడుకును సొంత బాబాయి హత్య చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం పుత్తూరు మండంల చిన్నరాజుకుప్పం గ్రామంలో సుబ్బరాయుడు, వెంకటేష్ అన్నదమ్ములున్నారు.
దివ్యాంగుడైన వెంకటేష్ టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుబ్బరాయుడి కుమారుడు మణికంఠ (29) ఇంటర్మీడియట్ చదివి తిరుపతి సమీపంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.
మణికంఠకి తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి సమీపంలోని కేజీకండ్రిగ పంచాయతీలోని ఆర్కే పురానికి చెందిన జననీతో పెళ్లి జరిగింది. మణికంఠ, జననీ దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం భార్య మళ్లీ మూడు నెలల గర్భిణిగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి మణికంఠ, చిన్నాన్న వెంకటేష్ ఇంట్లో ఇద్దరూ మద్యం తాగారు. మద్యం తాగుతున్న సమయంలోనే కొంది సేపు తరువాత మద్యం మత్తులోకి వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మణికంఠపై చిన్నాన్న వెంకటేష్ దాడికి దిగాడు. మణికంఠ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న మణికంఠను అక్కడే వదిలేసి, చిన్నాన్న వెంకటేష్ పరారయ్యాడు.
అదే గ్రామానికి చెందిన మహిళ అటుగా జాకెట్లను కుట్టేందుకు టైలర్ వెంకటేష్‌కు ఇచ్చేందుకు వెళ్లింది. అక్కడ రక్తపుడుగులో ఉన్న మణికంఠను చూసి భయంతో కేకలు వేసింది. ఆమె కేకలు విన్న స్థానికులు, మణికంఠ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వచ్చారు.
రక్తపు మడుగులో ఉన్న కొడుకుని చూసి తల్లిదండ్రులు, భర్తను చూసి భార్య జననీ రోదించారు. స్థానికులు సహాయంతో వెంటనే మణికంఠను పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి, అలాగే ఆసుపత్రికి వివరాలు సేకరించారు. డీఎస్పీ రవి కుమార్, సీఐ సురేంద్ర నాయుడు, ఎస్ఐ ఓబయ్య ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు.
నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. దర్యాప్తు పూర్తి అయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు మణికంఠ మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. నిండు గర్భిణి అయిన భార్య జననీ విలపించడం అందరిని కలచివేసింది. చిన్నరాజుకుప్పం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్