Best Web Hosting Provider In India 2024
.jpg)
వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర పిలుపు
తాడేపల్లి: ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు, నిరుద్యోగ యువత తరలిరావాలని వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్ధులను వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది.
పేద పిల్లలకు పెద్ద చదువులు సాకారం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆనాడు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో నాడు ఫీజు రీయింబర్స్మెంట్ కు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్యలో ఈ పథకానికి తిలోదకాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెట్టి, కాలేజీ యాజమాన్యాలను, విద్యార్ధులను ఇబ్బందుల పాలు చేసింది. వైయస్ఆర్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైయస్ జగన్ 93 శాతం మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఈ పథకాన్ని విస్తరింపచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూటమి సర్కార్ ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోంది.
మెగా డీఎస్సీ కాదు..దగా డీఎస్సీ
ప్రభుత్వం కేవలం 6100 పోస్టులతో ప్రకటించినది మెగా డీఎస్సీ కాదని, నిరుద్యోగుల పాలిట దగా డీఎస్సీ అని రవిచంద్ర విమర్శించారు. చద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన మొదటి సంతకానికి తూట్లు పొడిచారు. డీఎస్సీ కోసం ఎదురు చూస్తూ తల్లిదండ్రులు పంపిన డబ్బులతో హాస్టళ్లు, రూముల్లో ఉంటూ శిక్షణ తీసుకుంటూ చదువుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది?. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైయస్ఆర్సీపీ హయాంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అయిదు కాలేజీల నిర్మాణం పూర్తై, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిల్లో నిర్మాణపనులు పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్రప్రభుత్వమే లేఖ రాయడం దుర్మార్గం.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందలు పడుతున్నారు. పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట యువత పోరు కార్యక్రమానికి పార్టీ అధినేత, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకూ చేపడుతున్న ర్యాలీ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి కదం తొక్కాలని రవిచంద్రా పిలుపునిచ్చారు.