


Best Web Hosting Provider In India 2024

OTT Comedy Web Series: ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న కామెడీ వెబ్ సిరీస్.. టాప్ ట్రెండింగ్‌లో.. ట్విస్టులే ట్విస్టులు
OTT Comedy Web Series: ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఓ కామెడీ వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది. ఈ మధ్యే ఓటీటీలోకి అడుగుపెట్టిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ను వెనక్కి నెట్టి మరీ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇందులోని ట్విస్టులు కూాడా బాగున్నాయి.

OTT Comedy Web Series: ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ ఒకటి ప్రస్తుతం ఇండియా టాప్ ట్రెండింగ్ లో నంబర్ వన్ గా ఉండటం విశేషం. కామెడీ జానర్లో వచ్చినా అంతర్లీనంగా సమాజానికి ఓ సందేశాన్ని ఇస్తూ సాగిన ఈ వెబ్ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్లతో అలరిస్తోంది. హిందీ వెబ్ సిరీస్ చూసే వారికి ఇది బాగా నచ్చుతుంది.
గత శుక్రవారం (మార్చి 7) ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ సిరీస్ ను మిస్ కావద్దు. ఇదే ప్రైమ్ వీడియోలో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్ రెండో సీజన్ ను కూడా వెనక్కి నెట్టేసిందంటే ఈ సిరీస్ ఎంతగా నవ్విస్తోందో అర్థం చేసుకోవచ్చు.
టాప్ ట్రెండింగ్‌లో దుపహియా
ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న కామెడీ వెబ్ సిరీస్ పేరు దుపహియా (Dupahiya). అంటే టూవీలర్ అని అర్థం. కేవలం హిందీ ఆడియోతోనే ఈ ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్.. ప్రేక్షకులను బాగా నవ్విస్తోంది. బీహార్ లోని ధడక్‌పూర్ అనే ఊళ్లో జరిగిన కథగా దీనిని తెరకెక్కించారు.
నవ్వులు పూయిస్తూనే సమాజంలో నిలువెల్లా పాతుకుపోయిన వరకట్నం అనే సమస్యను ఎత్తిచూపుతూ, దానిని నిర్మూలించాలంటూ సాగిపోయే వెబ్ సిరీస్ ఇది. సీనియర్ నటీనటులు గజ్‌రాజ్ రావ్, రేణుకా షహానే (హమ్ ఆప్కే హై కౌన్ ఫేమ్) నటించిన ఈ సిరీస్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
దుపహియా స్టోరీ ఏంటంటే?
దుపహియా వెబ్ సిరీస్ ను సోనమ్ నాయర్ డైరెక్ట్ చేశారు. గజ్‌రాజ్ రావ్, రేణుకా షహానేతోపాటు స్పర్శ్ శ్రీవాస్తవ, శివానీ రఘువంశీ, భువన్ అరోరా, యశ్‌పాల్ శర్మలాంటి వాళ్లు నటించారు. బీహార్ లోని ధడక్ పూర్ అనే గ్రామ నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది. ఇదొక సింపుల్ బైక్ చోరీ స్టోరీ.
25 ఏళ్లుగా అసలు తమ గ్రామంలో నేరమంటూ జరగదని ధడక్ పూర్ వాసులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఊళ్లో ఓ ఇంట్లో అమ్మాయి పెళ్లి కుదురుతుంది. అబ్బాయి తరఫు వాళ్లు కట్నంగా రూ.3 లక్షల ఖరీదైన దుపహియా (బైక్) అడుగుతారు.
అమ్మాయి పెళ్లి కోసం ఆ కుటుంబం ఎంత కష్టమైనా సరే ఆ బండి ఇవ్వడానికి సిద్ధమవుతారు. పట్నంలో బాగా ఎంజాయ్ చేయాలని కలలు కనే ఆ అమ్మాయి, సినిమాల్లో హీరో అవ్వాలని కలలు కంటూ రీల్స్ చేస్తూ ముంబై వెళ్లడానికి అవకాశం కోసం చూసే ఆమె తమ్ముడు, స్కూల్లో ప్రమోషన్ కోసం ఎదురు చూసే ఆమె తండ్రి.. ఇలా అందరికీ ఆ పెళ్లి కలిసొచ్చేలా అనిపించడంతో లక్షలు పెట్టి బైకు కొంటారు.
కానీ తీరా పెళ్లికి వారం రోజుల ముందు ఆ బైకును ఎవరో దొంగిలిస్తారు. అసలు 25 ఏళ్లుగా చోరీ లేని ఆ ఊళ్లో ఆ బైకును ఎవరు, ఎందుకు దొంగిలిస్తారు? ఇంత జరిగినా ఆ అమ్మాయి కుటుంబం ఎందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లదు? చివరికి ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది అన్నదే ఈ దుపహియా స్టోరీ.
ట్విస్టులు.. నవ్వులు
ఈ వెబ్ సిరీస్ మొత్తం ఆ ధడక్ పూర్ అనే చిన్న ఊళ్లోనే సాగుతుంది. సింపుల్ స్టోరీ, అచ్చూ మన ఊళ్లలో ఉండేవారిలాగే కనిపించే మనుషులు, వాళ్ల మధ్య బంధాలు.. ఇలా ఈ దుపహియా వెబ్ సిరీస్ కు ఇట్టే మనం ఆకర్షితులం అయిపోతాం. బైకు చోరీ అనే కాన్సెప్ట్ కు ప్రతి ఎపిసోడ్లో వచ్చే ట్విస్టులు, నవ్వులు 9 ఎపిసోడ్ల ఈ సిరీస్ ను బింజ్ వాచ్ చేసేలా చేస్తాయి.
ఆ బైకు ఎవరు చోరీ చేశారన్నది చివరి వరకూ రివీల్ చేయకుండా సస్పెన్స్ కొనసాగించిన తీరు కూడా బాగుంటుంది. చోరీ విషయంలో ఒక్కోసారి ఒక్కొక్కరిపై అనుమానం వచ్చేలా సిరీస్ ను ముందుకు నడిపించారు డైరెక్టర్. ఇక సిరీస్ చివర్లో వచ్చే సందేశం ఆలోచింపజేసేలా ఉంటుంది.
ఇక ఇందులో నటించిన నటీనటులే ఈ సిరీస్ కు పెద్ద బలం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారు. ఇదే ప్రైమ్ వీడియోలో గతంలో వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ మూడు సీజన్లుగా ఎలా అలరిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇదే సిరీస్ ను ఈ మధ్యే తెలుగులో సివరపల్లి పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడీ దుపహియా కూడా మరో పంచాయత్ అవుతుందనడంలో సందేహం లేదు.
సంబంధిత కథనం