Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial March 11: తాత వీలునామాతో జ్యోత్స్న షాక్.. పారిజాతం గగ్గోలు.. కేసు వేసేందుకు కార్తీక్ నో
Karthika Deepam 2 Serial Today Episode March 11: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. ఆస్తులకు సంబంధించి శివన్నారాయణ రాసిన వీలునామాను లాయర్ చదివి వినిపించాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కేసు పెడదామంటూ కార్తీక్ దగ్గరికి శ్రీధర్ వెళతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి(మార్చి 11) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. ఆస్తులపై శివన్నారాయణ రాసిన వీలునామాను సిద్ధం చేసి తీసుకొని వస్తాడు లాయర్ వినాయక రావు. “ఆ ఆస్తి మొత్తం ఎందరి పేరున రాశాడో. కొడుకుకు ఏం రాశాడో, కూతురుకు ఏం రాశాడో.. మనరాలికి ఏం రాశాడో.. నాకేం రాశాడో” అని మనసులో కంగారు పడుతుంది పారిజాతం. “బావ పేరు మీద కూడా ఆస్తి రాసి ఉంటాడా.. లేదులే నేను ఇష్టమైన మనవరాలిని కదా నా పేరు మీదే రాసి ఉంటాడు” అని జ్యోత్స్న అనుకుంటుంది. దశరథ్, సుమిత్ర కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వీలునామా చదవాలని లాయర్ వినాయక రావుతో శివన్నారాయణ అంటాడు.
ఆస్తి అంతా కొడుకు, కోడలి పేరుపై..
ఆస్తి పంపకాల గురించి శివన్నారాయణ రాసిన వీలునామాను లాయర్ చదువుతాడు. “నా యావదాస్తిని కొడుకు దశరథ్‍కు, అతడి భార్య సుమిత్రకు, వాళ్లకు పుట్టిన బిడ్డకు చెందేటట్టుగా రాస్తున్నాను” అని శివన్నారాయణ రాసినట్టు వీలునామా చదువుతాడు లాయర్. ఆస్తులన్నీ ముందుగా దశరథ్, సుమిత్రకు వారి తర్వాత వారి బిడ్డకు చెందేలా నిర్ణయం తీసుకుంటాడు శివన్నారాయణ. అయితే, తన పేరు ఎక్కడా రాయకుండా దశరథ్, సుమిత్రల బిడ్డ, వారసురాలు అని ఉండటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. “పుట్టిన బిడ్డ ఏంటి.. జ్యోత్స్న పేరు రాయాలి కదా. మరి నాకేం రాశాడు” అని పారిజాతం అనుకుంటుంది.
జ్యోత్స్నలో కంగారు
తన పేరు లేకపోవడంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. “పుట్టిన బిడ్డ అంటే దీప. అంటే నాకు ఏం లేనట్టే. ఇంకా ఏం రాశాడో చూడాలి” అని జ్యోత్స్న అనుకుంటుంది. దశరథ్, సుమిత్రకు పుట్టిన అసలైన బిడ్డ తాను కాదని, దీప అని తెలిస్తే ఆస్తి ఆమెకే వెళుతుందని షాకవుతుంది జ్యోత్స్న. ఆస్తుల వివరాలను లాయర్ చదువుతాడు. అన్నీ దశరథ్, సుమిత్ర పేరు మీద రాసిన శివన్నారాయణ.. వారి తర్వాత వారి కూతురు వారసురాలు చెందాలని పేర్కొని ఉంటాడు.
జ్యోత్స్న పేరు ఎందుకు రాస్తా
ఆస్తి మొత్తం కొడుకు, కోడలు పేరు మీద రాస్తే.. జ్యోత్స్నకేం రాశారని శివన్నారాయణను పారిజాతం ప్రశ్నిస్తుంది. “చదివింది వినపడలేదా. అర్థం కాలేదా. ఆస్తి మొత్తం దశరథ్, సుమిత్రలదే. వాళ్ల కూతురు ఈ ఇంటి వారసురాలు కాబట్టి వాళ్ల తదనంతరం ఆస్తులు వాళ్ల కూతురికే చెందుతాయి. వాళ్ల వాళ్ల కూతురికి ఇచ్చుకుంటాడు. ఈ మాత్రానికి నేను నేరుగా జ్యోత్స్న పేరు ఎందుకు రాస్తాను. వాళ్ల వాళ్ల కూతురికి ఎప్పుడైనా.. ఎంతైనా ఇచ్చుకోవచ్చు” అని శివన్నారాయణ బదులిస్తాడు. ఆ ఆస్తులను దశరథ్ అమ్మాలన్నా.. సుమిత్ర ప్రమేయం అవసరం అని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న మరోసారి షాక్ అవుతుంది. దశరథ్, సుమిత్రకు ఉన్నది ఒకటే కూతురు అని, వారి తర్వాత ఆమెకే ఆస్తి అని, దీంట్లో అభ్యంతరం ఏంటని పారును శివన్నారాయణ ప్రశ్నిస్తాడు.
మొత్తం నాశనం చేశావ్ తాత
తన పేరును ఎక్కాడా రాయనందుకు రగిలిపోతుంది జ్యోత్స్న. “మొత్తం నాశనం చేశావ్ తాత. వారసురాలు.. వారసురాలు అని తప్ప.. జ్యోత్స్న అని ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే సుమిత్ర, దశరథ్‍ల కూతురే ఈ యావదాస్తికి వారసురాలు. కూతురు స్థానంలో నేను ఉన్నాను కాబట్టి నేను వారసురాలిని. నిజం తెలిస్తే దీపే వారసురాలు. కత్తితో పొడవకుండానే చంపేశావ్ కదా తాత” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
పారిజాతం అసంతప్తి
మరి నాకేం రాశారని పారిజాతం అడుగుతుంది. ఊరు చివరన ఓ డైరీఫామ్ ఉందని, దాంట్లో ఉన్న 50 ఆవులు నీకే అని శివన్నారాయణ అంటాడు. ఎందుకు పేడ ఎత్తుకునేందుకా అని పారిజాతం అసంతృప్తి చెందుతుంది. పీడెత్తుకుంటావో.. పిడకలు చేసుకుంటావో నీ ఇష్టమని శివన్నారాయణ అంటాడు. నెలకు రూ.20వేలు నీకు దశరథ్ ఖర్చులకు ఇస్తాడని చెబుతాడు. అది తనకు మేకప్ ఖర్చులకే సరిపోవని పారు అంటుంది. తాను ఎవరికి ఏం రాయాలనుకున్నానో రాశానని శివన్నారాయణ అంటాడు.
రెండో వీలునామా.. కానీ!
శివన్నారాయణ రెండో వీలునామా కూడా రాశారని లాయర్ చెబుతాడు. తాను ఒకటే చదివానని, ఈ రెండోది సీల్ చేసి ఉందని అంటాడు. అది కూడా చదవండి అని పారిజాతం అంటుంది. ఒకటి నా సమక్షంలో చదివేది.. రెండోది నేను లేనప్పుడు చదివేది అని శివన్నారాయణ అంటాడు. తాను చనిపోయాక ఆ రెండో వీలునామా వినాలని చెబుతాడు. దీంట్లో దాంట్లో ఏముందోనని అందరూ షాక్ అవుతారు. దీంతో లాయర్ వెళ్లిపోతాడు.
కూతురు కూడా ఉంది కదా..
మీకు ఏమీ మిగుల్చుకోకుండా ఆస్తి మొత్తం మాపై ఎందుకు రాశారని శివన్నారాయణను దశరథ్ అడుగుతాడు. నువ్వు, కోడలు ఉన్నారన్న ధైర్యం నాకు చాలు అని శివన్నారాయణ అంటాడు. నీకు నేను ఒక్కడినే కాదు నాన్న. కూతురు (కాంచన) కూడా ఉంది. నాతో సమానంగా చెల్లికి కూడా వాటా పంచాలి” అని దశరథ్ అడుగుతాడు. వాళ్లకేంటి రాసేది, పుట్టగతులు లేకుండా పోతావని ఆ కూతురే శపించిందని పారిజాతం అంటుంది. ఇంటి ఆడపడుచుకు అన్యాయం చేస్తారా అని సుమిత్ర అడుగుతుంది. ఆపుతారా.. నా ఆస్తి అంతా ఇష్టప్రకారమే రాశా.. ఇంకెవరు మాట్లాడకండని శివన్నారాయణ అంటాడు. రెండో వీలునామాలో ఏముందో నాకు తెలుసు అని పారు అంటుంది.
కాంచన, కార్తీక్‍కు శివన్నారాయణ ఆస్తి రాయకపోవటంతో దశరథ్, సుమిత్ర బాధపడతారు. ఎవరేమనుకుంటారోనని, తనకే ఏదోలా ఉందని దశరథ్ అంటాడు. కనీసం మనిషిగా కూడా గుర్తుంచలేదని కాంచన బాధపడుతుందని సుమిత్ర అంటుంది. “పాపం దాసుకు కూడా ఎంతో కొంత ఇవ్వాల్సింది. నాకు తప్ప అందరికీ అన్యాయం జరిగింది. ఇప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండగలను” అని మనసులో అనుకుంటాడు కార్తీక్.
ఏడ్వాల్సింది నేను..
నా ముసలి మొగుడు నాకే అన్యాయం చేశాడే, మట్టికొట్టాడే అంటూ జ్యోత్స్న ముందు గగ్గోలు పెడుతుంది పారిజాతం. నువ్వు కాదు ఏడ్వాల్సింది.. నేను అను అని జ్యోత్స్న అంటుంది. “ఆస్తి మొత్తం కొడుకు, కోడలికి రాసి.. ఆ తర్వాత వాళ్ల వారసురాలికి చెందాలని రాశాడు” అని జ్యోత్స్న అంటే.. వారసురాలు నువ్వే కదా అని పారు అంటుంది. కాదని నీకు తెలియదా అని జ్యోత్స్న అంటే.. వాడికి తెలియదు కదా అని పారు బదులిస్తుంది.
వచ్చినా బతకనివ్వం
అసలైన వారసురాలు బతికుందో లేదో తెలియదు.. ఉన్నా దానికి కథంతా ఎవరు చెబుతారని పారిజాతం అంటుంది. “చెప్పినా మనల్ని దాటుకొని ఇంటి వరకు రాదు. వచ్చినా బతకనివ్వం” అని పారిజాతం అంటుంది. ఇలా కలలు కంటూ కూర్చుంటే అది ఏదో ఒకరు రోజు నేనే వారసురాలు అని కళ్ల ముందుకు వస్తుందని జ్యోత్స్న కంగారుగా అంటుంది.
జ్యో మాటలతో పారు షాక్
అదెక్కడుందో నీకు తెలుసా అని పారిజాతం అంటుంది. తెలుసు అంటూ నోరు జారుతుంది జ్యోత్స్న. ఏంటి అంటూ షాకై లేస్తుంది పారిజాతం. తెలుసా.. అంటే బతికే ఉందని తెలుసు కదా అని జ్యోత్స్న కవర్ చేస్తుంది. దీపే అసలైన వారసురాలు అనే నిజం మళ్లీ దాచేస్తుంది. దాసుకు స్పృహలోకి వచ్చి మీ వారసురాలు జ్యోత్స్న కాదు.. వేరే ఉందని చెబితే అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. అసలైన వారసురాలు ఎక్కడుందో వాడికి తెలియాలి కదా అని పారిజాతం అంటుంది. ఇద్దరిని చంపిన దాన్ని.. ఈ స్థానం నిలబెట్టేందుకు మరో ఇద్దరిని చంపలేనా అని పారిజాతం అంటుంది. దీంతో జ్యో షాకవుతుంది. ఈ ఇంట్లో వాళ్లను కాదులే అని పారు చెబుతుంది.
అవాక్కైన శ్రీధర్
వీలునామాలో శివన్నారాయణ ఏం రాశాడో అని కంగారుగా ఉంటాడు శ్రీధర్. పారిజాతానికి కాల్ చేస్తాడు. ఏమైందని అడుగుతాడు. నీకు తట్ట ఎత్తడం, పిడకలు చేయడం వచ్చా అని పారిజాతం అంటుంది. దీంతో శ్రీధర్ చిరాకు పడతాడు. ఊరు చివరి డైరీఫామ్‍లో నాకు కొన్ని ఆవులను రాశాడని బాధగా చెబుతుంది పారు. ఇద్దరూ సెటైర్లు వేసుకుంటారు. మాకెంత రాశారో చెప్పండని శ్రీధర్ అడుగుతాడు. ఆస్తి మొత్తం కొడుకు, కోడలికి తగలెట్టాడని పారిజాతం చెప్పడంతో శ్రధర్ అవాక్కవుతాడు. కుర్చీలో కుప్పకూలతాడు.
చేసి చూపిస్తా..
శ్రీధర్ షాక్ అయితే.. యాహూ అంటే గంతులేస్తుంది అతడి రెండో భార్య కావేరి. ఇన్నాళ్లు కనిపెట్టుకొని ఉన్న ఆస్తంతా ఎక్కడో ఉన్న వారసురాలికి పోతోందని పారిజాతం అంటుంది. ఎక్కడుంతో తెలియని వారసురాలు ఏంటి.. వారసురాలు అంటే జ్యోత్స్నే కదా అని శ్రీధర్ అంటాడు. అవును.. అవును అంటూ కవర్ చేస్తుంది పారు. కూతురికి (తన మొదటి భార్య కాంచన)కు ఎందుకు రాయలేదని, అసలు వదలిపెట్టనని శ్రీధర్ అంటాడు. చేయాల్సిన వారితో పోరాటం చేయిస్తానని అంటాడు. ఏం చేస్తానో చెప్పను.. చేసి చూపిస్తా అని చెబుతాడు. అక్కకి, కార్తీక్‍కు అన్యాయం జరిగింది.. ఒక వాటా ఇంటి ఆడపడుచుకి రాసి ఉండాల్సిందని కావేరి మనసులో అనుకుంటుంది.
రెస్టారెంట్‍కు కస్టమర్లు ఎక్కవగా వచ్చేలా దీప చేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కస్టమర్లు బాగా వస్తున్నారని, సూపర్ అని కార్తీక్‍ను మేనేజర్ పొగుడుతాడు. ఈ ప్లాన్ దీపదే అని కార్తీక్ చెబుతాడు.
సంతకం పెట్టు
కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటే.. రెస్టారెంట్‍లోకి ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్. ఏ పేపర్ తీసుకొచ్చి సంతకం పెట్టాలని కార్తీక్‍ను అడుగుతాడు. ఎందుకు అని కార్తీక్ అంటే.. మీ తలరాత మార్చడానికి అని చెబుతాడు. మీ తాత మీద కేసు పెట్టడానికి సంతకం అని శ్రీధర్ అంటాడు. మీ అమ్మకు రావాల్సిన ఆస్తి కోసం కేసు పెట్టాలని చెబుతాడు. ఆస్తి వద్దని అమ్మ చెప్పిన విషయం మరిచిపోయారా అని కార్తీక్ అంటాడు.
కేసు పెట్టేందుకు కార్తీక్ నిరాకరణ
కూతురు గురించి ఆలోచించకపోయినా మనవడైనా నీకైనా ఆస్తిలో వాటా ఇవ్వాలి కదా అని కార్తీక్‍తో శ్రీధర్ అంటాడు. దశరథ్, సుమిత్ర పేరు మీదే మొత్తం ఆస్తి రాశాడని, మొత్తం జ్యోత్స్నకే చెందుతుందని అంటాడు. మనవరాలు మాత్రమే వారసురాలా.. మనవడు కాదా చెబుతాడు. నన్ను పెళ్లి చేసుకున్నందుకే కార్తీక్‍ను తాత వద్దనుకుంటున్నారా అని మనసులో అనుకుంటుంది దీప. నా బాధంతా.. నీ గురించి, మీ అమ్మ గురించి అని శ్రీధర్ అంటాడు.
చెప్పాల్సిందంతా నీకు ఇంటికి వచ్చినప్పుడు నేను, మా అమ్మ చెప్పాం.. ఇప్పుడూ అదే మాట అని కార్తీక్ అంటాడు. తాత మీద కేసు పెట్టకపోతే కోట్ల ఆస్తి చేజారినట్టే అని శ్రీధర్ చెబుతాడు. తాను సంపాదించింది దాంట్లో ఒక్క రూపాయి లేదని కార్తీక్ అంటాడు. మీ తాతది అంటే మీ అమ్మది, మీ అమ్మది అంటే నీది అని శ్రీధర్ అంటాడు. అమ్మ వద్దనుకుందని కార్తీక్ బదులిస్తాడు. మీ అమ్మ నన్నే వద్దనుకుంది.. ఆస్తి ఒక లెక్కా అని శ్రీధర్ అంటాడు. నేనూ ఆ తల్లి రక్తం పంచుకొని పుట్టిన కొడుకును, నా తల్లి వద్దనుకుంది నాకూ వద్దు.. అది నువ్వైనా, తాత ఆస్తి అయినా అని కార్తీక్ చెబుతాడు. ఆస్తి కోసం తాతపై కేసు పెట్టనని చెప్పేస్తాడు. కోట్ల ఆస్తి.. ఎన్నాళ్లు కష్టపడితే సంపాదిస్తావ్ అని శ్రీధర్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 11) ఎపిసోడ్ ముగిసింది.