



Best Web Hosting Provider In India 2024
Sabarimala darshan route : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త! దర్శనానికి ఇక కొత్త రూట్..
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త! దర్శనానికి కొత్త మార్గాన్ని అమలు చేయనున్నారు. ఫలితంగా ఇప్పటివరకు 5 సెకన్లు మాత్రమే ఉన్న స్వామి దర్శనం.. ఇప్పుడు 20 నుంచి 25 సెకన్ల వరకు పెరుగుతుందని అంచనా!

శబరిమలకు వెళ్లే అయప్ప భక్తులకు శుభవార్త! భక్తుల చిరకాల కోరికను పరిగణనలోకి తీసుకున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు.. శబరిమలలోని ‘దర్శనం’ మార్గాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇక నుంచి సన్నిధానంలోని పవిత్ర 18 మెట్లు ఎక్కే భక్తులు నేరుగా దర్శనానికి వెళతారు.
ఈ మార్పును మార్చ్ 15 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, విషుపూజ సందర్భంగా 12 రోజుల పాటు కొత్త మార్గంలో దర్శనం కొనసాగుతుందని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఇది విజయవంతమైతే వచ్చే మండల-మకరవిలక్కు సీజన్లో ఈ మార్పును శాశ్వతంగా అమలు చేస్తామని తెలిపారు.
నెరవేరిన అయ్యప్ప భక్తుల కోరిక..!
18 పవిత్ర మెట్లు ఎక్కిన తర్వాత మెరుగైన దర్శన అనుభవం కోసం మార్గాన్ని మార్చాలని కోరుతూ భక్తుల నుంచి వేలాది లేఖలతో సహా బోర్డుకు అనేక అభ్యర్థనలు వచ్చాయని ఆయన చెప్పారు.
“ప్రస్తుతం పవిత్ర మెట్లు ఎక్కే భక్తులను వంతెన వద్దకు పంపి, అక్కడ క్యూలైన్లో నిల్చోపెడతారు. ఆ తర్వాత దర్శనం కోసం అవతలి వైపునకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పద్ధతి వారికి కేవలం ఐదు సెకన్ల దర్శనానికి అనుమతిస్తుంది. దీని వల్ల శబరిమలను సందర్శించే లక్షలాది మంది భక్తులలో దాదాపు 80 శాతం మందికి సంతృప్తికరమైన అనుభవం లభించడం లేదు,” అని ప్రశాంత్ విలేకరుల సమావేశంలో వివరించారు.
ఆలయ తంత్రి నుంచి అనుమతి పొంది, భాగస్వాములతో విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రశాంత్ పేర్కొన్నారు.
కొత్త ఏర్పాటుతో ప్రతి భక్తుడికి సుమారు 20 నుంచి 25 సెకన్ల పాటు దర్శనం లభిస్తుందని ప్రశాంత్ తెలిపారు.
ఆలయ అభివృద్ధిలో అయ్యప్ప భక్తులను భాగస్వామ్యం చేయడానికి బోర్డు పంబలో ప్రపంచ అయ్యప్ప భక్తుల సమావేశాన్ని కూడా నిర్వహించనుంది.
శబరిమలలో అభివృద్ధి కార్యక్రమాలకు బోర్డు వద్ద తగినన్ని నిధులు లేవని, భక్తులు ఆసక్తిగా విరాళాలు ఇచ్చేందుకు ఈ సమావేశం అవకాశం కల్పిస్తుందని ప్రశాంత్ పేర్కొన్నారు.
‘ఇదేమీ పెద్ద సభ కాదు. దాదాపు 150 మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. మే నెలలో నెలవారీ పూజల కోసం ఆలయం తెరిచినప్పుడు రెండు రోజుల కార్యక్రమంగా దీనిని ప్లాన్ చేస్తున్నాము,” అని ప్రశాంత్ తెలిపారు.
అయ్యప్పస్వామి బంగారు పెండెంట్లు..
అయ్యప్పస్వామి బొమ్మతో చెక్కిన బంగారు పెండెంట్లను అందించేందుకు తమిళనాడుకు చెందిన జీఆర్టీ జ్యువెలర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెలర్స్ టెండర్ దక్కించుకున్నట్లు ప్రశాంత్ ప్రకటించారు. 1 గ్రాము, 2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాముల సైజుల్లో లభించే ఈ పెండెంట్లను ఏప్రిల్ 14న ‘విషుక్కైనెట్టం’గా పంపిణీ చేయనున్నారు.
వీటిని కొనుగోలు చేయాలనుకునే భక్తులు ఏప్రిల్ 1 నుంచి www.sabarimalaonline.org వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కూడా ఆలయ పూజలకు సంబంధించిన రేట్లను 30 శాతం పెంచాలని నిర్ణయించింది. చివరిసారిగా 2016లో రేట్లను సవరించారని, అయితే ప్రతి ఐదేళ్లకోసారి వాటిని సవరించే అధికారం బోర్డుకు హైకోర్టుకు ఇచ్చిందని ప్రశాంత్ పేర్కొన్నారు.
“వరదలు, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, మేము ఎటువంటి రేట్ల పెంపును అమలు చేయలేకపోయాము. అయితే తొమ్మిదేళ్ల తర్వాత వాటాదారులతో సంప్రదింపులు, అంబుడ్స్మన్ సిఫార్సులు, హైకోర్టు ఆమోదంతో రేట్లను సవరిస్తున్నాం. గత తొమ్మిదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయి. రేట్లు సర్దుబాటు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు,”ని ప్రశాంత్ వివరించారు.
2016లో జీతాలు, పింఛన్ల కోసం బోర్డు ఖర్చు రూ.380 కోట్లు కాగా, 2025 నాటికి అది రూ.910 కోట్లకు పెరిగిందన్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link