Vanuatu : అసలేంటి ఈ వనాటు? ఈ దేశ పాస్​పోర్ట్​కి ఎందుకంత క్రేజ్​? లలిత్​ మోదీకి ఎందుకు షాక్​ తగిలింది?

Best Web Hosting Provider In India 2024


Vanuatu : అసలేంటి ఈ వనాటు? ఈ దేశ పాస్​పోర్ట్​కి ఎందుకంత క్రేజ్​? లలిత్​ మోదీకి ఎందుకు షాక్​ తగిలింది?

Sharath Chitturi HT Telugu
Published Mar 11, 2025 09:00 AM IST

Vanuatu passport : భారత పాస్​పోర్ట్​ని వదిలించుకోవాలని చూసిన లలిత్​ మోదీకి వనాటు ప్రధాని షాక్​ ఇచ్చారు! ఆయన దగ్గర ఉన్న వనాటు పాస్​పోర్ట్​ని రద్దు చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాలు..

తన కొత్త పార్ట్​నర్​తో లలిత్​ మోదీ..
తన కొత్త పార్ట్​నర్​తో లలిత్​ మోదీ.. (Instagram/ Lalit Modi)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోదీకి బిగ్​ షాక్​! భారత పాస్​పోర్ట్​ని వదులుకోవాలని నిర్ణయించుకుని, ఆయన పొందిన విలాసవంతమైన వనాటు పాస్​పోర్ట్​ని రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోతం నపత్.. పౌరసత్వ కమిషన్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ‘వనాటు’ అంటే ఏంటి? అది ఎక్కడుంది? ఈ ప్రాంతానికి ఎందుకింత క్రేజ్​? అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ వివరాలు..

వనాటు ఎక్కడుంది? ఈ ద్వీపం ప్రత్యేకతలేంటి?

దక్షిణ పసిఫిక్​లోని ద్వీప దేశం: వనాటు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని 83 ద్వీపాల ద్వీపసమూహం. వీటిల్లో 65 చోట్ల నివాసాలు ఉన్నాయి. వనాటును ఒకప్పుడు న్యూ హెబ్రిడ్స్ అని పిలిచేవారు. ఈ పేరును బ్రిటిష్ అన్వేషకుడు జేమ్స్ కుక్ 1774లో ఇచ్చారు. ఈ దేశం అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ వనాటు.

భూభాగం- జనాభా: వనాటు 12,199 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కలిగి ఉంది. ఇందులోని ఎస్పిరిటు శాంటో అతిపెద్ద ద్వీపం. రాజధాని నగరం పోర్ట్ విలాలో 2020 నాటికి సుమారు 49,000 మంది నివసిస్తున్నారు. ఇది ఆస్ట్రేలియాలోని కెయిర్న్స్​కు తూర్పున 2,394 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సిటిజెన్​షిప్​ బై ఇన్వెస్ట్​మెంట్​: వనాటు ద్వీప దేశంలో కనీసం రూ. 1.3కోట్లు పెట్టుబడి పెడితే, సిటిజెన్​షిప్​ బై ఇన్వెస్ట్​మెంట్​ ప్రోగ్రామ్​ ద్వారా పౌరసత్వం పొందొచ్చు. ఇది చాలా ఫేమస్​! ఇది నాన్​-రిఫండెంబుల్​ డొనేషన్​గా పరిగణిస్తారు. సంబంధిత వ్యక్తి దేశంలో ఉండాల్సిన అవసరం లేదు! ద్వంద్వ పౌరసత్వం కూడా కలిగి ఉండవచ్చు. లలిత్​ మోదీ ఇదే విధానంలో పాస్​పోర్ట్​కి అప్లై చేసుకున్నారు.

50ఏళ్లుగా వనాటు వార్తల్లో ఉంది. ఇక్కడ అనేక ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఇక్కడ పర్సనల్​ ట్యాక్స్​ అనేది ఉండదు. క్యాపిటల్​ గెయిన్​ ట్యాక్స్​, ఇన్హరిటెన్స్​ ట్యాక్స్​, వెల్త్​ ట్యాక్స్​ వంటివి కూడా ఉండవు.

లలిత్​ మోదీ వనాటు పాస్​పోర్ట్​ రద్దు..

ఐపీఎల్ 2009 ఎడిషన్ నిర్వహణ నేపథ్యంలో టెలికాస్ట్ డీల్​కు సంబంధించిన విదేశీ మారకద్రవ్య నియంత్రణ ఉల్లంఘనల ఆరోపణలపై లలిత్ మోదీ మీద వివిధ ఎన్​ఫోర్స్​మెంట్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఛైర్మన్​గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలను ఎగవేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

కాగా తన భారతీయ పాస్​పోర్ట్​ని సరెండర్ చేయాలని మార్చ్​ 7న లండన్​లోని భారత హైకమిషన్​కు లలిత్​ మోదీ దరఖాస్తు చేసుకోవడంతో వనాటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లండన్​లో నివసిస్తున్న ఆయన వనాటు పౌరసత్వం పొందినట్లు వార్తలు వచ్చాయి.

అంతర్జాతీయ మీడియాలో ఇటీవల వెల్లడైన విషయాలు తెలిసిన తర్వాత లలిత్​ మోదీ పాస్​పోర్ట్​ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాని జోతమ్ నపత్ తెలిపారు. దరఖాస్తు దశలో నిర్వహించిన ఇంటర్​పోల్ స్క్రీనింగ్​లతో పాటు అన్ని ప్రామాణిక నేపథ్య తనిఖీల్లో మోదీ నేరారోపణకు సంబంధించిన రికార్డు కనిపించలేదని ఆయన వెల్లడించారు.

లలిత్​ మోదీపై అలర్ట్​ నోటీసు జారీ చేయాలని ఇంటర్​పోల్​కి 24 గంటల వ్యవధిలో రెండుసార్లు భారత్​ విజ్ఞప్తి చేసింది. సరైన ఆధారాలు లేవంటూ వీటిని ఇంటర్​పోల్​ తిరస్కరించింది. ఈ విషయం కూడా తన దృష్టికి వచ్చిందని వనాటు ప్రధాని అన్నారు.

అయితే అప్పగింతల నుంచి తప్పించుకునేందుకు తమ పాస్​పోర్ట్​ని వాడుకోకూడదని తేల్చిచెప్పారు నపత్​.

“వనాటు విసా అంటే హక్కు కాదు, ప్రివిలేజ్​! అప్పగింతలను తప్పించుకోవడంతో పాటు మరే ఇతర చట్టబద్ధమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ పాస్​పోర్ట్​ని వాడుకోకూడదు,” అని నపత్​ అన్నారు.

అయితే నపత్​ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే లలిత్​ మోదీ తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో ఒక పోస్ట్​ పెట్టారు. ఆ పోస్ట్​లో ఆయన వనాటులోనే ఉన్నట్టు స్పష్టమైంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link