




Best Web Hosting Provider In India 2024

AP CID Notices: కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విజయసాయి రెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు, బుధవారం విచారణకు పిలుపు
AP CID Notices: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీ పోర్టు బదలాయింపు వ్యవహారంలో దాని పూర్వపు యజమాని కేవీ రావు ఫిర్యాదుపై సాయిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యవహారంలో ఈడీ కూడా కేసులు నమోదు చేసింది.

AP CID Notices: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. బుధవారం ఉదయం విచారణకు రావాలని ఆదేశించింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను బలవంతంగా బదలాయించుకున్నారని కాకినాడ సీ పోర్ట్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు గతంలో ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత సీ పోర్ట్ నాటకీయ పరిణామాల మధ్య పూర్వపు యజమాని చేతికి తిరిగి వెళ్లింది. అదే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి సాయిరెడ్డి రాజీనామా చేశారు. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన అరబిందో గ్రూప్ చేతికి సీ పోర్టును బదలాయించారు. ఇది రాజకీయంగా దుమారం రేపింది.
క్రియాశీల రాజకీయాలకు దూరమవుతున్నట్టు మాజీ ఎంపీ సాయిరెడ్డి ప్రకటించినా కేసులు మాత్రం వెంటాడుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులిచ్చింది. బుధవారం విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం నోటీసులు ఇవ్వడానికి సాయిరెడ్డి నివాసా నికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన అందుబాటులో లేకపోవటంతో, సాయిరెడ్డి సతీమణికి నోటీసులు అందజేశారు. ఈ కేసులో విజయ సాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నారు.
కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ వాటాలు బదలాయింపులు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేసింది. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును నమోదు చేసింది. ఈ అభియోగాలపై రెండు నెలల క్రితమే సాయిరెడ్డిని ఈడీ విచారించింది. తాజాగా సీఐడీ విచారణకు పిలవడంతో ఆసక్తి నెలకొంది.
సంబంధిత కథనం
టాపిక్