





Best Web Hosting Provider In India 2024

TG SERP : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. మహిళా సంఘాలకు మరో బాధ్యత.. గుత్తేదార్ల వ్యవస్థ రద్దు!
TG SERP : ఏ చిన్న అవకాశం వచ్చినా.. మహిళలకు మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వెనకాడటం లేదు. ఇప్పటికే ఆర్టీసీ అద్దె బస్సులు, మహిళా శక్తి క్యాంటీన్‌లు వంటివి ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటు అందించింది. తాజాగా సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహిళలకు మరింత మేలు జరగనుంది.

ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాశక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాలు, పాఠశాలలకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పోషకాహార పంపిణీ చేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి రంగం సిద్ధమవుతోంది.
మహిళా సంఘాల ద్వారా..
ఇప్పుడు ఉన్న గుత్తేదార్ల వ్యవస్థను తొలగించి.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మహిళా సంఘాల ద్వారా పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం కోసం విధివిధానాలను రూపొందించాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌లను సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో సెర్ప్ కార్యాచరణ రూపొందిస్తోంది.
కుళ్లిన కూరగాయలు..
రాష్ట్రంలో ఇప్పుడు వసతిగృహాలకు, గురుకులాలకు ఆహార వస్తువులను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. చాలామంది కుళ్లిన, ముదిరిన కూరగాయలు, నాసిరకం పప్పులు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విధానానికి స్వస్తి పలికి.. స్థానికంగా ఉన్న మహిళా సంఘాల ద్వారా కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే ప్రభుత్వ లక్ష్యం..
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా కూరగాయలు, పండ్లు, పప్పుల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆహార పదార్థాలతో పాటు చిరుధాన్యాలకు ప్రాధాన్యమిస్తారు.
గతంలో అమలు..
సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసినప్పుడు.. స్థానిక అంగన్‌వాడీ కేంద్రాలకు మహిళా సంఘాల ద్వారా చిరుధాన్యాల ఆహారాన్ని పంపిణీ చేయించారు. ఇదే తరహాలో గురుకులాలు, వసతిగృహాలు, పాఠశాలలకు కూడా అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
రైతులకు మేలు..
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పండించే కందులకు, వేరుసెనగకు సరైన ధరలు రావడం లేదు. కూరగాయలనూ రైతులు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోంది. వాటిని మహిళా సంఘాలు కొనుగోలు చేయడం వల్ల.. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని గురుకులాలు, వసతిగృహాలు, పాఠశాలలు, వాటిలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మహిళా సంఘాలను ఎంపిక చేసి.. సరుకుల సరఫరా బాధ్యతలను అప్పగించేందుకు వీలుగా సెర్ప్ ప్రణాళిక రూపొందించనుంది.
త్వరలో నిర్ణయం..
2025-26 విద్యా సంవత్సరం నుంచి మొత్తంగా అమలు చేయాలా.. దశలవారీగా చేపట్టాలా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కొత్త కార్యక్రమం రూపకల్పన కోసం త్వరలో సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన సెర్ప్ సీఈవో, అన్ని గురుకుల విద్యాలయాల సంస్థలు, విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. దీనిపై మార్చి నెలాఖరులోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వడానికి సెర్ప్ కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం అమలు అయితే.. అటు మహిళలకు, ఇటు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
టాపిక్