

Best Web Hosting Provider In India 2024

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకుంటున్నారా? ముందుగా ఇలా చేయండి!
New Ration Card : కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రేషన్ కార్డు, ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానంతో… ఇప్పటికే రేషన్ కార్డు ఉంటే కొత్త కార్డు దరఖాస్తు చేసుకోలేరు. కొత్తగా వివాహం చేసుకున్న మహిళలు పుట్టినింటి కార్డుల్లో పేర్లు తొలగించుకుంటేనే కొత్తగా దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.

New Ration Card : కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా ఆహార భద్రత కల్పించేందుకు ఆధార్ తో రేషన్ కార్డులను అనుసంధానం చేస్తుంది. ఎక్కడైనా ఒక ఆధార్ నంబర్ రేషన్ కార్డుకు అనుసంధానమై ఉంటే మరో కొత్త కార్డుకు దరఖాస్తు చేయలేం. కొత్తగా వివాహం చేసుకున్న మహిళలు ఈ విషయం గమనించడంలేదు. చాలా మందికి తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో పేర్లు ఉంటాయి. మెట్టినింటికి వచ్చిన అనంతరం నూతన కార్డు కోసం దరఖాస్తులు చేసినప్పుడు అవి తిరస్కరణకు గురవుతున్నాయి. అయితే వీరు పాత కార్డులోని తమ వివరాలను తొలగించాలని అధికారులు సూచిస్తు్న్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి?
వివాహం జరిగిన మహిళలు తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డు లో తమ పేరు తొలగించుకోవాలంటే తెల్ల కాగితంపై స్థానిక తహసీల్దారుకు అభ్యర్ధన పెట్టాలి. అత్తారింట్లో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నామని, పేరు తొలగించాలని రాస్తే సరిపోతుంది. వివాహం జరిగి ధ్రువీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికను జత చేయాలి. ఒకటి లేదా రెండు రోజుల్లో పేర్లను తొలగిస్తారు. అనంతరం కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మీసేవలో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుకు మీ సేవలో దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది, దీనికోసం కొత్తగా పెళ్లయిన వారికి ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, పిల్లల ఆధార్ కార్డులు జత చేసి దరఖాస్తు నింపి ఇవ్వాల్సి ఉంటుంది. మీ సేవలో దరఖాస్తు చేశాక రెవెన్యూ సిబ్బంది ఎంక్వయిరీ చేసి నూతన రేషన్ కార్డును మంజూరు చేస్తారు.
రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడిదలాబాద్ జిల్లా, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్