




Best Web Hosting Provider In India 2024

VMC Works: సచివాలయ ఉద్యోగులకు ఇంజనీరింగ్ బాధ్యతలు, నగరంలో గాడి తప్పిన నీటి సరఫరా, పారిశుధ్యం, ఎమ్మెల్యే సుజనా ఫిర్యాదు
VMC Works: విజయవాడ కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ పనులు అస్తవ్యస్థంగా మారాయి. నగర పరిధిలో ఏఈలు నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని సచివాలయ సిబ్బందితో సర్దుబాటు చేయడంతో నగరవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. విజయవాడ పశ్చిమ పరిధిలో పలు ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా తాగునీరు అందక పోవడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

VMC Works: విజయవాడలో ఇంజనీరింగ్ విభాగం చేయాల్సిన పనుల్ని సచివాలయ సిబ్బందితో సర్దుబాటు చేయడంతో నగరంలో పౌర సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనికి తోడు వైసీపీ హయంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు బిల్లుల్ని రాబట్టుకోడానికి కొందరు కార్పొరేటర్ల ఒత్తిడితో కింద స్థాయి సిబ్బంది తాగునీటి సరఫరాలో కృత్రిమ అవరోధాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మార్చి నెలాఖరులోగా బిల్లులు మంజూరు చేయించుకోడానికి విఎంసిలో కార్పొరేటర్లు, కింది స్థాయి సిబ్బందితో కలిసి తాగునీటి సరఫరాలో అవంతరాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఏఈ స‌్థాయి అధికారుల పర్యవేక్షణలో చేయాల్సిన ఇంజనీరింగ్ పనుల్ని సచివాలయ సిబ్బందితో చేయిస్తుండటంతో మునిసిపల్ మంత్రికి స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఫిర్యాదు చేశారు.
వేసవి ముందే తాగునీటి ఎద్దడి…
విజయవాడ పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని కొన్ని డివిజన్లలో నాలుగైదు రోజులుగా మంచి నీటి సరఫరా జరగడం లేదు. దీనిపై స్థానిక సచివాలయాలు సైతం ప్రజలకు సరైన సమాచారం అందివ్వలేదు. దీంతో ఈ వ్యవహారం స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. సాధారణంగా కార్పొరేషన్ పరిధిలో 24గంటలకు మించి తాగునీటి సరఫరా లేకపోతే ముందస్తు సమాచారం అందిస్తారు. మంచినీటి పైప్‌లైన్లకు మరమ్మతులు చేయాల్సి వచ్చినా రెండు మూడు రోజుల ముందే విఎంసి ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది.
నాలుగైదు రోజుల పాటు మంచి నీటి సరఫరా జరగక పోవడం, ముందస్తు హెచ్చరికలు లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.విజయాడ మునిసిపల్ కార్పొరేషన్ హెడ్ వాటర్ వర్క్స్ పరిధిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకపోయినా మంచి నీటి సరఫరా జరగక పోవడంతో ఉన్నతాధికారులు ఆరా తీశారు.
బిల్లుల కోసం ఆరాటం…
2024 మే నెలకు ముందే విజయవాడలోని పలు డివిజన్లలో పాత పైప్‌లైన్ల స్థానంలో కొత్త పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. 2022-23, 2023-24 ఆర్ధిక సంవత్సరాల్లో మంజూరైన నిధుల్ని ఖర్చు చేయడం కోసం, అవసరం లేని పనుల్ని కూడా అప్పటి అధికార పార్టీ కార్పొరేటర్ల ఒత్తిడితో చేపట్టారు. ప్రధానంగా మురికివాడలు, ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాల్లో ఈ తరహా అక్రమాలు జరిగాయి.
దశాబ్దాల క్రితం నిర్మించిన మంచి నీటి పైప్‌లైన్లను విధిగా మార్చాలంటూ కొత్త పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో మంచి నీటి పైప్‌లైన్లు ఎలాంటి లీకులు లేకుండా పనిచేస్తున్నాయి. 80, 90 దశకాల్లో ప్రికాస్ట్ ఐరన్‌తో తయారు చేసిన పైప్‌లైన్లు నగరమంతటా ఉన్నాయి. వాటిలో వచ్చే నీరు తాగడం సరికాదని కొత్త లైన్ల ఏర్పాటుకు కార్పొరేటర్లు తెర తీశారు.
కార్పొరేటర్లే కాంట్రాక్టర్లు…
విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్లే కాంట్రాక్టర్లుగా వ్యవహరించడం చాలా కాలంగా సాగుతోంది. బినామీ పేర్లతో పనులు చేపట్టి వాటిని సొమ్ము చేసుకోడానికి కొందరు కార్పొరేటర్లు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఏర్పాటు చేసిన మంచి నీటి పైప్ లైన్ల అంశం మళ్లీ తెరపైకి తెచ్చారు. అప్పట్లో రోడ్లను కట్ చేసి ఏర్పాటు చేసిన పైప్ లైన్లను వినియోగంలోకి తెచ్చేందుకు కొద్ది నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొత్తగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్ల నుంచి మంచి నీటి కుళాయిలకు రీ కనెక్షన్లు ఇచ్చే పనులు జరుగుతున్నాయి. ఇలా రీ కనెక్షన్ ఇచ్చేందుకు ఒక్కో ఇంటికి రూ.2700 వసూలు చేయాలని నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో పాత కనెక్షన్లలో నీరు వస్తుండగా రీ కనెక్షన్ ఎందుకని జనం ఎదురు తిరుగుతున్నారు. దీంతో మంచినీటి సరఫరాలో అవాంతరాలు సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంజనీరింగ్ పనులపై అభ్యంతరం..
విజయవాడ పరిధిలో ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన పనుల్ని సచివాలయ సిబ్బందితో చేయించడంపై స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణకు లేఖ సైతం రాశారు. ఏఈ స్థాయి అధికారులు చేయాల్సిన పనుల్ని సచివాలయ ఉద్యోగులతో చేపట్టడాన్ని సుజనా చౌదరి ప్రస్తావించారు.
అనుభవం లేకపోవడం వల్ల సాంకేతికమైన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇంజనీరింగ్ పనుల్లో అనుభవం ఉన్న అధికారుల్ని వినియోగించాల్సిన చోట క్షేత్ర స్థాయి విధులు చేయాల్సిన సచివాలయం సిబ్బందితో చేయించడం సరికాదని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో మునిసిపల్ కుళాయిల రీ కనెక్షన్ పేరుతో బలవంతపు వసూళ్లు చేస్తున్నారని సీపీఎం ఆరోపించింది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
సంబంధిత కథనం
టాపిక్