

Best Web Hosting Provider In India 2024

East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం, కన్న కూతురిపై కొన్నాళ్లుగా తండ్రి లైంగిక దాడి
East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లాలో ఓ తండ్రి కన్న కూతురుపై కొన్నాళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. అయితే ఎవరితో చెప్పుకోలేక బాలిక తనలో తాను మదనపడుతుంది. దిగాలుగా ఉన్న విద్యార్థిని గమనించిన ఉపాధ్యాయురాలు…ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురుపైనే తండ్రి కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మనోవేదనతో ఉంటున్న ఆ చిన్నారిని గమనించి పాఠశాల ఉపాధ్యాయురాలు ఆరా తీసింది. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ తాను పడుతున్న బాధను, తాను అనుభవిస్తోన్న వేదనను ఉపాధ్యాయురాలికి చెప్పింది. ఉపాధ్యాయుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడుతున్న తండ్రిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్రి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కూతురిపై కొన్నాళ్లుగా జరుగుతున్న అఘాయిత్య ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 45 ఏళ్ల వ్యక్తి మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఆయనకు 17 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే భార్య భర్తల మధ్య విభేదాల కారణంగా ఎనిమిదేళ్ల క్రితమే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వెళ్తూ ముగ్గురు పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది.
తండ్రితో ఉంటున్న పెద్ద కూతురు
వీరిలో 15 ఏళ్ల పెద్ద కుమార్తె మూడేళ్లుగా తండ్రి వద్దకు వచ్చి ఉంటోంది. ఈ బాలిక రాజమహేంద్రవరంలోనే ఒక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ బాలికపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. మద్యం మత్తులో ఆమెపై ఈ అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. అయితే సొంత తండ్రే ఇలా చేస్తున్నాడని ఎవరికి చెప్పుకోలేక, తనలోనే తాను మనోవేదన చెందింది. ఎవరికి చెబితే ఏం అవుతోందనని భయపడుతూ ఉండేది. దీంతో ఆ బాలిక తండ్రి అఘాయిత్య చేష్టలను భరిస్తూ వస్తోంది. కన్న కూతురనే కనికారం కూడా లేకుండా తండ్రి ఆగడాలు పెరిగాయి.
మంగళవారం ఎప్పటిలానే స్కూల్‌కు వెళ్లింది. బాలిక నిరుత్సాహంతో, ముఖంలో ఎటువంటి చిరునవ్వు లేకుండా వేదనతో ఉండటాన్ని పాఠశాల ఉపాధ్యాయురాలు గమనించింది. బాలికను దగ్గరకు తీసుకుని ఆమెను ఓదార్చుతూ ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నావు? చెప్పామ్మ? నీకు నేను ఉన్నాను? అంటూ అక్కున చేర్చుకుంది. తన అమ్మలా ఉపాధ్యాయురాలు తన మనసును గమనించిందని భావించిన బాలిక, తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఏడుస్తూ వివరించింది. తన తండ్రి గత కొద్ది రోజులుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు చెబుతూ ఉపాధ్యాయురాలి వద్ద బాలిక కన్నీరు పెట్టుకుంది.
పోక్సో కేసు నమోదు
బాలిక తన మనోవేదనను చెబుతుంటే, ఆ ఉపాధ్యాయురాలు కూడా చలించిపోయింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది నెలల క్రితం నుంచి తన తండ్రి మద్యం మత్తులో తనపై అఘాయిత్యం చేస్తోన్నాడని, తరచూ ఆయన ఈ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన బాలిక తండ్రిపై పోక్సో కేసు నమోదు చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న నిందితుడు పరారీలో ఉన్నాడు. బాలిక ఫిర్యాదు చేసిందని, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పిల్లలకు రక్షణ ఉండి, చేయి పట్టుకుని నడిపిస్తూ పిల్లలకు కొండంత ధైర్యంగా ఉండాల్సిన తండ్రే ఇలాంటి నీచపు పనులకు దిగడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అభంశుభం తెలియని పసిపాపపై ఇలాంటి చర్యలకు పూనుకోవడం సభ్య సమాజం తలదించుకోవడమేనని పేర్కొన్నారు. తండ్రంటే పిల్లలకు ఒక ధైర్యం, అండ అని, అలాంటి తండ్రే పిల్లల పాలిట శాపంగా మారడం దారుణమన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్