





Best Web Hosting Provider In India 2024

Pachi pulusu: వేసవిలో పచ్చిపులుసును తింటే ఎంతో ఆరోగ్యం, దీన్ని ఇలా చేయండి శరీరానికి చలువ చేస్తుంది
Pachi pulusu: వేసవిలో పచ్చిపులుసును తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరానికి చలువ చేస్తుంది. పచ్చిపులుసును టేస్టీగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.

పూర్వకాలం నుంచి మనం తినే ఆహారాల్లో పచ్చిపులుసు కూడా ఒకటి. దీన్ని పెద్దగా వండాల్సిన అవసరం లేదు. కేవలం పోపు పెట్టేందుకు మాత్రమే మంట అవసరం పడుతుంది. వేడివేడి అన్నంలో పచ్చి పులుసు వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా ఇది శరీరానికి చలవ చేస్తుంది. కాబట్టి వేసవిలో కచ్చితంగా తినాల్సిన రెసిపీ ఇది. ఈ పచ్చిపులుసు ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. రెసిపీ ఫాలో అయిపోండి. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకోండి.
పచ్చిపులుసును రెసిపీకి కావలసిన పదార్థాలు
ఆవాలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
పసుపు – అర స్పూను
ఎండుమిర్చి – రెండు
చింతపండు – పెద్ద నిమ్మకాయ సైజులో
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – తగినన్ని
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – నాలుగు
బెల్లం తురుము – అర స్పూను
పచ్చి పులుసు రెసిపీ
1. పచ్చి పులుసు చేసేందుకు చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలి.
2. ఒక పెద్ద కప్పు నీళ్ళల్లో చింతపండును వేసి బాగా నాననివ్వాలి.
3. తర్వాత దాన్ని చేత్తోనే పిసికి పొట్టును తీసి బయటపడేయాలి.
4. ఆ చింతపండు నీళ్ళను పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి నిలువుగా తరిగిన ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
6. ఇందులో చింతపండు రసాన్ని వేసి చేత్తోనే బాగా కలుపుకోవాలి.
7. పైన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి.
8. బెల్లం తురుమును వేసి అది కరిగేలాగా కలపాలి.
9. ఇప్పుడు ఈ మిశ్రమానికి పోపు వేయాలి. పోపు వేసేందుకు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
10. ఆ నూనెలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, పసుపు వేసి వేయించాలి.
11. ఈ తాళింపును పక్కన పెట్టుకున్న పులుసులో కలుపుకోవాలి.
12. అంతే టేస్టీ పచ్చిపులుసు రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.
వేసవిలో కచ్చితంగా పచ్చిపులుసుని తినేందుకు ప్రయత్నించండి. ఇది శరీరానికి చలువ చేస్తుంది. పూర్వం మన ఇళ్లల్లో కచ్చితంగా పచ్చిపులుసు ఉండేది. కానీ ఇప్పుడు పచ్చిపులుసును చేసుకునే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ఇది వండడానికి కేవలం ఐదు నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి ఎవరైనా కూడా దీన్ని అప్పటికప్పుడు వండుకొని తినవచ్చు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో వండుకొని చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.
సంబంధిత కథనం