






Best Web Hosting Provider In India 2024

Posani Remand : పోసానికి మరో షాక్, 14 రోజుల రిమాండ్ -బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని కన్నీటి పర్యంతం
Posani Remand : సినీనటుడు పోసానికి మరో షాక్ తగిలింది. గుంటూరు జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. బెయిల్ పై విడుదలవుతారని భావించిన పోసానికి గట్టి షాక్ తగిలింది. అయితే వాదనల సమయంలో పోసాని బోరున విలపించారు. బెయిల్ ఇవ్వకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని కన్నీరు పెట్టుకున్నారు.

Posani Remand : సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. సీఐడీ పోలీసులు పోసానిని గుంటూరులోని జడ్జి ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో పోసాని బోరున విలపించారు. తన ఆరోగ్యం బాగాలేదని, రెండుసార్లు ఆపరేషన్ చేసి గుండెకు స్టంట్లు వేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట పోసాని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి…. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ లపై గతంలో పోసాని కృష్ణమురళి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. పీటీ వారెంట్లతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తు్న్నారు. ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్ రావడంతో…ఇవాళ ఆయన విడుదల అవుతారని భావించారు. అయితే ఇంతలో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయడంతో..పోలీసులు ఆయనను గుంటూరులో జడ్జి ముందు హాజరుపరిచారు.
14 రోజుల రిమాండ్
కర్నూలు జైలు నుంచి ఆయనను నేరుగా జీజీహెచ్‍కు తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం జడ్జి ఇంటికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరుపరిచారు. ఈ కేసులో పోసాని తరుఫున న్యాయవాదులు పొన్నవోలు, పోలూరి వెంకటరెడ్డి అక్కడికి చేరుకుని వాదనలు వినిపించారు. పోసాని ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను కొట్టివేయాలని సినీనటుడు పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళికి మంగళవారం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై పోసానిని గుంటూరుకు తీసుకొచ్చి జడ్జి ముందు హాజరుపర్చారు.
నన్ను నరికేయండి
కేసు విచారణ సమయంలో జడ్జి ఎదుట పోసాని కన్నీరు పెట్టుకున్నారు. 70 ఏళ్ల వయస్సులో తనను కేసుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షతోనే తనపై కేసులు బనాయించారని బోరున విలపించారు. తప్పు చేస్తే నరికేయండని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్య పరిస్థితి సరిగ్గాలేదని, రెండు ఆపరేషన్లు జరిగాయని గుండెకు స్టంట్లు వేశారని జడ్జికి చెప్పారు. తనకు భార్యాబిడ్డలు ఉన్నారని రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని పోసాని అన్నారు.
బాపట్లలో కేసు
బాపట్లలో పోసానిపై మరో కేసు నమోదు అయ్యింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని అందిన ఫిర్యాదుతో బాపట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు మేరకు పోసానిపై బాపట్ల పోలీసులు పీటీ వారెంట్‌ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో పిటిషన్ వేశారు. పోసాని పీటీ వారెంట్‌ను తెనాలి కోర్టు అనుమతించింది.
సంబంధిత కథనం
టాపిక్