





Best Web Hosting Provider In India 2024

Thursday Motivation: భగవద్గీతలోని ఈ మూడు విషయాలు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడతాయి
Thursday Motivation: జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే విజయం వైపు పయనించడం సులభం అవుతుంది. భగవద్గీతలోని ఈ మూడు విషయాలను మీ జీవితంలో కూడా అమలు చేయండి. అవి మీకు విజయాన్ని అందిస్తాయి.

ప్రతి వ్యక్తి జీవితంలో విజయాన్ని కోరుకుంటాడు. దానికోసం నిరంతర సాధన, కృషి చేస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు అతడు విజయవంతం కాలేడు. తన లక్ష్యానికి చేదించే దారిలో వచ్చే ఇబ్బందులకు భయపడి వెనకడుగు వేస్తాడు. దీని కారణంగా ఆయనకు నిరాశే మిగులుతుంది. మీరు కూడా జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. భగవద్గీతలోని ఈ మూడు విషయాలను ఆ సమయంలో తలుచుకుంటే మీకు నూతన ఉత్సాహం కలుగుతుంది. విజయ మార్గం ఏర్పడుతుంది. జీవితంలో శరీర నిర్ణయాలు తీసుకోవడానికి భగవద్గీతలోని ఈ మూడు అంశాలు ఉపయోగపడతాయి.
అర్జునుడిలాగా మీరు కూడా
అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో నిలబడినప్పుడు అతడు కౌరవ సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడి ముందు అప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి యుద్ధంలో తలపడడం లేదా యుద్ధం నుండి వెనక్కి తగ్గడం. కానీ యుద్ధము నుండి వెనక్కి తిరిగి వెళ్లడం అన్నది చాలా పెద్ద తప్పు. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో శ్రీకృష్ణుడి అతడికి దారిని చూపించాడు. కష్టం నుండి ఎంత దూరం పారిపోతారని ప్రశ్నించాడు. కష్టమైనా పని అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కానీ వెనకడుగు మాత్రం వేయకూడదు. విజయం సాధించడానికి కచ్చితంగా కష్టాలు ఎదురవుతాయి. మీరు కూడా ఉద్యోగంలో అనుబంధాలలో ఎన్నో కష్టాలు పడాల్సి రావచ్చు. వాటిని చూసి దూరంగా పారిపోవద్దు. ఎదిరించి పోరాడండి. అర్జునుడు కూడా శ్రీకృష్ణుడి బోధతో ఎదిరించి పోరాడి హస్తినాపురాన్ని కైవసం చేసుకున్నాడు.
భావోద్వేగాలతో నిర్ణయాలు వద్దు
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు భావోద్వేగాలకి గురయ్యాడు. ఎందుకంటే తాను పోరాడుతున్నది తన కుటుంబంతోనే. కుటుంబం పట్ల ఉన్న తనకున్న ప్రేమ, యోధుడిగా తన విధులకు మధ్య ఎంతో నలిగిపోయాడు. కురుక్షేత్ర యుద్ధ భూమిలోనే భావోద్వేగాలకు గురయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భావోద్వేగాలు నిర్ణయాలను మార్చేలా ఉండకూడదని ఉపదేశించాడు. ఎందుకంటే భావోద్వేగాలన్నీ తాత్కాలికమైనవి. ఆ క్షణమే వచ్చి మాయమైపోతాయి. కానీ ఆ భావోద్వేగాలకు లోబడి నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు ఎదురవ్వచ్చు. భయం పోయి, ఉత్సాహం చల్లబడిపోయి, కోపం తగ్గి పోయాక మీరు అనుకున్నది సాధించలేదే అన్న బాధ ఎక్కువైపోతుంది. కాబట్టి భావోద్వేగాలు అధికంగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆ పరిస్థితి చల్లారాకే నిర్ణయం తీసుకోండి.
శ్రీకృష్ణుడు చెబుతున్న ప్రకారం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ‘నేను ఈ పనిలో విఫలమైతే, నేను వెళ్లే దారి మంచిది కాకపోతే, ఇలా చేసినందుకు భవిష్యత్తులో నేను చింతిస్తే…’ ఇలాంటి ప్రశ్నలు గురించి ఆలోచించకండి. అలా ఆలోచిస్తే మీరు మొదటి అడుగులోనే ఆగిపోతారు. మీరు ఏదైనా నేర్చుకునే ముందుకి వెళ్ళాలనుకుంటే నిర్ణయాన్ని గట్టిగా తీసుకోవాలి. మంచి నిర్ణయాలు మీకు కచ్చితంగా విజయాన్ని తెచ్చిపెడతాయి. చెడు నిర్ణయాలు మీకు పాఠాలను నేర్పుతాయి. కాబట్టి తప్పు ఏదైనా కూడా కొన్ని నిర్ణయం తీసుకొని ఆ మాట మీదే వెళ్లడం మంచిది. ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం వైఫల్యం కాదు, ఓటమి భయంతో ఏ నిర్ణయం తీసుకోకపోవడం అతిపెద్ద వైఫల్యం.
కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడ వద్దు. కష్టాలను ఎదుర్కొనేందుకు భయపడవద్దు. విజయం సాధించాలంటే ధైర్యం అవసరం. పిరికివారు ఎప్పటికీ విజేతలు కాలేరు.