పాకిస్థాన్‌లో రైలు హైజాక్.. 30 మంది సైనికులు మృతి.. ఉగ్రవాదుల డిమాండ్స్ ఇవి!

Best Web Hosting Provider In India 2024


పాకిస్థాన్‌లో రైలు హైజాక్.. 30 మంది సైనికులు మృతి.. ఉగ్రవాదుల డిమాండ్స్ ఇవి!

Anand Sai HT Telugu Published Mar 12, 2025 06:35 AM IST
Anand Sai HT Telugu
Published Mar 12, 2025 06:35 AM IST

Pakistan Train Hijack : పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది వరకు పాక్ సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

పాకిస్థాన్ రైలు హైజాక్
పాకిస్థాన్ రైలు హైజాక్ (AFP)

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో దాదాపు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు. ఈ దాడికి తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించింది. 214 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని, 30 మంది పాక్ సైనికులను హతమార్చామని పేర్కొంది. భద్రతా బలగాలు వెనక్కి తగ్గకపోతే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయే సమయానికి పాకిస్థాన్ భద్రతా దళాలు రైలు నుంచి 80 మంది ప్రయాణికులను రక్షించాయి.

ఉగ్రవాదుల డిమాండ్

బలూచ్ రాజకీయ ఖైదీలను, జాతీయ ప్రతిఘటన కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని మిలిటెంట్ గ్రూప్ డిమాండ్ చేసింది. అందుకు ప్రతిఫలంగా బందీలను విడిపించేందుకు 48 గంటల గడువు విధించారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని స్థానిక మీడియా తెలిపింది.

క్వెట్టా నుంచి బయలుదేరిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరిగింది. టన్నెల్ నెంబర్ 8 సమీపంలో రైలును ఉగ్రవాదులు చుట్టుముట్టారని, రైలులోని ప్రయాణికులతో సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రైలు పట్టాలు తప్పిన తర్వాత మారుమూల ప్రాంతంలో రైలును స్వాధీనం చేసుకున్నట్లు ఉగ్రవాదులు పేర్కొన్నారు. అయితే బలోచ్ అధికారులు, రైల్వే శాఖ నుంచి ఇప్పటి వరకు మృతులు, బందీల స్థితిగతులపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

బలగాల భారీ ఆపరేషన్

ఉగ్రవాదులను చుట్టుముట్టేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. భారీగా కాల్పులు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. సైన్యం చేపట్టిన గ్రౌండ్ ఆపరేషన్‌ను తాము పూర్తిగా భగ్నం చేశామని, సైన్యాన్ని వెనక్కు తగ్గేలా చేశామని మిలిటెంట్ గ్రూప్ చెబుతోంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని, సైన్యం గ్రౌండ్ ఆపరేషన్‌ను ముగించామని పేర్కొంది. అయితే పాక్ హెలికాప్టర్లు, డ్రోన్లతో బాంబుల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది.

సహాయక చర్యలు!

ఈ దాడిలో రైలులోని ప్రయాణికులు, సిబ్బందికి ఇంకా సంబంధాలు లేవని, పలువురు ప్రయాణికులు గాయపడ్డారని రైల్వే అధికారులు అంటున్నారు. సహాయక చర్యల కోసం పాక్ సైన్యం ఒక రైలును పంపింది. ఇందులో సైనికులు, వైద్యుల బృందం కూడా ఉంది. అంబులెన్సులను కూడా పంపామని, అయితే కొండలు, ముళ్లతో కూడిన భూభాగం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు.

పాకిస్థాన్ భద్రతా దళాలు సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బలోచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించింది. బందీలందరికీ ఉరిశిక్ష విధిస్తామని, దీనికి పాక్ సైన్యం మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతోంది.

అస్సలు ఊరుకోం : ప్రభుత్వం

ఈ దాడిని తీవ్రంగా ఖండించిన పాక్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ అమాయక ప్రయాణికులపై కాల్పులు జరిపేవారి విషయంలో ప్రభుత్వం రాజీపడదని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు విధించడంతో పాటు అన్ని సంస్థలను అలర్ట్ చేసింది.

Anand Sai

eMail
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link