






Best Web Hosting Provider In India 2024

Amaravati Lands: అమరావతిలో 13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు.. 19 సంస్థలకు గడువు పొడిగింపు..
Amaravati Lands: అమరావతిలో 13 సంస్థలకు కేటాయించిన 177.24 ఎకరాల భూ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరో 19 సంస్థలకు కేటాయించిన 570.36 ఎకరాలకు ఒప్పందం మేరకు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 2027 మార్చి వరకు గడువు పొడిగించారు.

Amaravati Lands: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో 2014-19 మధ్య చేసిన భూ కేటాయింపులో 13 ప్రాజెక్టులకు కేటాయింపుల్ని సీఆర్‌డిఏ రద్దు చేసింది. దాదాపు 177.24ఎకరాలను పలు విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మెడికల్ కాలేజీలకు కేటాయించారు. 2019 నాటికి ఈ ప్రాజెక్టులు గడువు మేరకు ముందుకు సాగక పోవడంతో అప్పట్లోనే నోటీసులిచ్చారు. ఆ తర్వాత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన భూ కేటాయింపులపై సమీక్షించారు. ఈ మేరకు 13 సంస్థలకు చేసిన కేటాయింపుల్ని రద్దు చేశారు.
భూములు కేటాయించినా నిర్మాణాలు చేపట్టని సంస్థలు, అమరావతిలో ప్రాజెక్టులకు ఆసక్తి చూపని సంస్థల భూ కేటాయింపుల్ని రెండు రోజుల క్రితం సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రద్దు చేశారు. వీటిలో బీఆర్‌ఎస్ మెడిసిటీ, ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థలు సీఆర్డీఏ పలు మార్లు లేఖలు రాసినా స్పందించలేదు. గడువు ఇప్పటికే పూర్తైంది. దీంతో 2019కు ముందు కొన్ని సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రా బ్యాంకు యూనియన్ బ్యాంకులో, సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం కావడంతో వాటికి చేసిన కేటాయింపుల్ని రద్దు చేశారు.
భూ కేటాయింపులు రద్దైన సంస్థలు ఇవే…
అమరావతిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (2ఎకరాలు), ఆంధ్రా బ్యాంకు (1.64ఎకరాలు), సిండికేట్ బ్యాంకు(అర ఎకరం), రైల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీస్ (రైట్స్ 1ఎకరం, శాప్ నెట్ (70 సెంట్లు), ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్‌షిప్ ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ (6ఎకరాలు), ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (50 ఎకరాలు), బీఆర్‌ఎస్ మెడిసిటీ (100 ఎకరాలు), రూప్‌టెక్ ఎడ్యుకేషనల్ ఇండియా స్కూల్ (4ఎకరాలు), హెరిటేజ్ ఎక్స్‌పీరియంటల్ లెర్నింగ్ స్కూల్ ( 3ఎకరాలు), సద్భావన వరల్డ్ స్కూల్ ( 4ఎకరాలు), ఎంపీ హోటల్స్ (4ఎకరాలు), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (40సెంట్లు).. మొత్తం 177.24 ఎకరాలను రద్దు చేశారు.
19 సంస్థలకు గడువు పొడిగింపు..
అమరావతిలో భూ కేటాయింపులు పొందినా ప్రాజెక్టుల్ని పూర్తి చేయని పలు సంస్థలకు గడువును పొడిగించారు. ఈ ప్రాజెక్టుల్ని 2027 మార్చి 31లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిలో ఎస్‌ఆర్‌ఎం, విట్, అమృత యూనివర్శిటీలు ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఎన్‌ఐడి నిర్మాణం జరుగుతోంది.
మరో 19 సంస్థలకు చేసిన 570.36 ఎకరాలకు గడువు పొడిగించారు. గడువు పొడిగించిన సంస్థల్లో ఎన్‌ఐడి 50ఎకరాలు, ఇగ్నో 80 సెంట్లు, ఏపీఎన్నార్టీఎస్ 5ఎకరాలు, ఏపీఎన్నాఆర్టీఎస్ 58సెంట్లు, విట్ ఏపీ 100ఎకరాలు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ 100ఎకరాలు, మాతా అమృతానందమయి మఠం(యూనివర్శిటీ) 150 ఎకరాలు, నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ 15ఎకరాలు, ఆనందిలాల్ గణేష్ పొద్దార్ సొసైటీ స్కూల్ 3ఎకరాలు, ఎన్‌ఎస్‌టీ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్ 3ఎకరాలు, జీఆర్‌టీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 ఎకరాలు, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ 50 ఎకరాలు, సివిల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్ 4ఎకరాలు, బ్రహ్మకుమారీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ 10ఎకరాలు, ఆలిండియా సర్వీస్ అధికారులకు ఇళ్ల స్థలాలు 38.53ఎకరాలు, న్యాయమూర్తులకు ఇళ్ల స్థలాలు 1.92 ఎకరాలు, దసపల్లా హోటల్స్ 2ఎకరాలు, కేంద్ర ప్రజా పనుల విభాగం సీపీడబ్ల్యూడీ 22.53 ఎకరాలు, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిసిస్టిట్యూట్ 12 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టులకు 2027 మార్చి 31 వరకు గడువు పొడిగించారు.
11 సంస్థలతో త్వరలో విక్రయ ఒప్పందాలు..
అమరావతిలో 2014-15 మధ్య జరిగిన భూ కేటాయింపుల్ని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. కొత్తగా భూ కేటాయింపు ప్రతిపాదనం పరిశీలనకు, గతంలో చేసిన కేటాయింపుల్ని సమీక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మూడు సార్లు సమావేశమైంది. గతంలో భూములు పొంది వాటిలో 13 సంస్థలకు కేటాయింపులు రద్దు చేయాలని, II సంస్థలకు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోద ముద్ర వేయనున్నారు. 2014-19 మధ్య 130 సంస్థలకు 1277.88 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వాటిలో 69 ప్రభుత్వ, 61 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్