





Best Web Hosting Provider In India 2024

World Kidney day: మన శరీరంలో మూత్రపిండాలు చేసే ముఖ్యమైన 7 పనులు ఇవే, అందుకే కిడ్నీలు పాడైతే నరకమే
World Kidney day: మూత్రపిండాలు మన శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. అది కేవలం ఆహారాన్ని ఫిల్టర్ చేయడం మాత్రమే కాదు ఇంకా ఎన్నో పనులను చేస్తాయి. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అది చేసే పనుల గురించి తెలుసుకుందాం.

ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రతి యేటా మార్చి 13న నిర్వహించుకుంటారు. ఈరోజున మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. అలాగే మూత్రపిండాల మన శరీరంలో ఎంత ముఖ్యమైనవో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో కూడా వివరిస్తారు. అందరికీ కిడ్నీలు కేవలం వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి మాత్రమే అనుకుంటారు. నిజానికి అవి మన శరీరంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే జీవన విధానం మారిపోతుంది. ఆరోగ్యంగా జీవించడం చాలా కష్టంగా మారుతుంది. మన శరీరంలో కిడ్నీలు ప్రముఖంగా చేసే ఏడు పనులు ఏంటో తెలుసుకుంటే… అవి ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుంది.
వ్యర్ధాలు తొలగింపు
మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులో ఉన్న వ్యర్థ ఉత్పత్తులను, అదనపు ద్రవాలను తొలగిస్తాయి. అవే మూత్రంగా బయటికి విసర్జనకు గురవుతాయి.
ఎలక్ట్రోలైట్ల సమతుల్యత
మన శరీరంలో సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. లేదా శరీరంలో విపరీతంగా ద్రవం పెరిగిపోయి చర్మం ఉబ్బి పోయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఎలక్ట్రోలైట్లను సమతుల్యంగా ఉంచే బాధ్యత కిడ్నీలదే. శరీరం సరైన హైడ్రేషన్ కలిగి ఉండేలా చేస్తాయి.
రక్తపోటు నియంత్రణ
హైబీపీకి కిడ్నీలకు ఎలాంటి సంబంధం లేదని అనుకుంటారు ఎంతోమంది. నిజానికి రక్తపోటును నియంత్రించేది కిడ్నీలే. సోడియం విసర్జనను ప్రభావితం చేసే హార్మోన్ల ఉత్పత్తి ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తనాళాలు సంకోచించకుండా కాపాడడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఎర్ర రక్తకణాల ఉత్పత్తి
మన శరీరంలో రక్త ఉత్పత్తిలో కూడా కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఎరిత్రోపోయిటిన్ అని పిలిచే హార్మోన్లను కిడ్నీలు ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు ఎముక మజ్జలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరిగేందుకు ప్రేరేపిస్తుంది. ఈ ఎర్ర రక్తకణాలు ఆక్సిజన్ రవాణాకు ఎంతో అవసరం. అలాగే రక్త ఉత్పత్తికి కూడా ఎర్ర రక్తకణాలే ప్రముఖం. కాబట్టి కిడ్నీలు రక్తం ఉత్పత్తిలో కూడా ప్రధాన పాత్రని పోషిస్తాయి.
కాల్షియం లోపం
విటమిన్ డి శరీరంలోకి చేరాక మూత్రపిండాలు వాటిని కాల్సిట్రియోల్ గా మారుస్తాయి. ఇది క్యాల్షియం శోషణను పెంచుతుంది. దీనివల్ల శరీరంలో క్యాల్షియం లోపం రాకుండా ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. ఎముక సమస్యలకు కిడ్నీలు పాడవడం కూడా కారణం కావచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
మూత్రపిండాలు అదనపు ఆమ్లాన్ని విసర్జించడానికి ప్రయత్నిస్తాయి. బైకార్బోనేట్ అయాన్లను తిరిగి గ్రహించి రక్తంలో పీహెచ్ స్థాయిలను స్థిరంగా ఉండేలా కాపాడతాయి. కాబట్టి కిడ్నీల ఆరోగ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. మన శరీరంలో ముఖ్యమైన పనులు అన్నింటిలోనూ కిడ్నీల భాగం కూడా ఉంటుంది. కాబట్టి వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్