Karthika Deepam 2 Serial: దీప‌పై జ్యోత్స్న రివేంజ్ – కార్తీక్‌పై పోలీస్ కేసు – కూతురు పెళ్లి ఆనందంలో సుమిత్ర‌

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: దీప‌పై జ్యోత్స్న రివేంజ్ – కార్తీక్‌పై పోలీస్ కేసు – కూతురు పెళ్లి ఆనందంలో సుమిత్ర‌

Nelki Naresh HT Telugu
Published Mar 13, 2025 07:43 AM IST

Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 మార్చి 13 ఎపిసోడ్‌లో జ్యోత్స్న రెస్టారెంట్ డీల్ చేస్తోన్న‌ మ‌రో పెద్ద కాంట్రాక్ట్ కార్తీక్‌, దీపల‌కు ద‌క్కుతుంది. జ్యోత్స్న చేత‌కానీత‌నం వ‌ల్లే కాంట్రాక్ట్ చేజారిపోయింద‌ని శివ‌న్నారాయ‌ణ ఫైర్ అవుతాడు. జ్యోత్స్న‌ను సీఈవో బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తాడు

కార్తీక దీపం 2 మార్చి 13 ఎపిసోడ్‌
కార్తీక దీపం 2 మార్చి 13 ఎపిసోడ్‌

జ్యోత్స్న పెళ్లి చేసుకోవాల‌నుకున్న గౌత‌మ్ ఓ మోస‌గాడు అనే నిజం దీప‌కు తెలుస్తుంది. ఓ అమ్మాయిని మోస‌గించిన అత‌డిని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంటుంది. గౌత‌మ్‌పై పోలీసు కేసు పెట్టాల‌ని అనుకుంటుంది. కానీ ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే తాము బ‌త‌క‌లేమ‌ని, ప‌రువు పోతుంద‌ని ఆ అమ్మాయి త‌ల్లిదండ్రులు దీప‌ను బ‌తిమిలాడుతారు. అక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌ని దీప కాళ్లుప‌ట్టుకోబోతారు.

పాపానికి శిక్ష‌…

నువ్వు త‌ప్పించుకోలేవు…చేశానికి పాపానికి శిక్ష అనుభ‌వించాల్సిందేన‌ని గౌత‌మ్‌తో అంటుంది దీప‌. నీలాంటి వాడికి కాల‌మే గుణ‌పాఠం చెబుతుంద‌ని, క‌ర్మ ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌ద‌ని గౌత‌మ్‌ను హెచ్చ‌రించి వెళ్లిపోతుంది దీప‌.

శివ‌న్నారాయ‌ణ‌ ప్ర‌శ్న‌లు…

గౌత‌మ్ సంబంధం మ‌న‌కు అన్ని విధాలుగా స‌రిగ్గా స‌రిపోయే సంబంధం అని శివ‌న్నారాయ‌ణ అంటాడు. పైగా ఇల్ల‌రికానికి రావ‌డానికి గౌత‌మ్ కూడా ఒప్పుకునేలా ఉన్నాడ‌ని చెబుతాడు. గౌత‌మ్ సంబంధం గురించి జ్యోత్స్న ఏమంటుందోన‌ని సుమిత్ర కంగారు ప‌డుతుంది. అప్పుడే అక్క‌డికి జ్యోత్స్న వ‌స్తుంది.

మ‌న‌వ‌రాలు క‌నిపించ‌గానే గౌత‌మ్‌ను క‌లిశావా…మాట్లాడావా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్ణం కురిపిస్తాడు శివ‌న్నారాయ‌ణ‌.

ముహూర్తం పెట్టించండి…

జ్యోత్స్న మాత్రం స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో ఏమైంద‌ని కోపంగా అడుగుతుంది సుమిత్ర‌. గౌత‌మ్‌ను క‌ల‌వ‌లేద‌ని, మ‌న‌సు మార్చుకొని తిరిగి వ‌చ్చాన‌ని జ్యోత్స్న బ‌దులిస్తుంది. కూతురి మాట‌ల‌తో సుమిత్ర ఫైర్ అవుతుంది. అంద‌రిని ఎందుకు ఇంత బాధ‌పెడుతున్నావ‌ని, ఇంత మంచి సంబంధం మ‌ళ్లీ దొరుకుతుందా అని నిల‌దీస్తుంది. పెళ్లి వ‌ద్ద‌ని, గౌత‌మ్ న‌చ్చ‌లేద‌ని తాను అన‌డం లేద‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు షాకిస్తుంది జ్యోత్స్న‌.

మీరు నాకు ఒక సంబంధం చూశారు. మీరు ఏం చేసిన నా మంచి కోసం అన్ని ఆలోచించే చేసుకుంటారు. మ‌ళ్లీ నేను గౌత‌మ్‌కు క‌ల‌వ‌డం ఎందుకు అని జ్యోత్స్న అంటుంది. మీ ఇష్ట‌మే నా ఇష్టం అని చెబుతుంది. ముహూర్తం పెట్టించండి. పెళ్లి ఎప్పుడో చెప్పండి. త‌ల‌వంచుకొని తాళి క‌ట్టించుకుంటాన‌ని అంటుంది. డైరెక్ట్‌గా ఎంగేజ్‌మెంట్‌కు ముహూర్తం పెట్టించ‌మ‌ని తాత‌తో చెబుతుంది. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవ‌డంతో సుమిత్ర, ద‌శ‌ర‌థ్ సంబ‌ర‌ప‌డ‌తారు.

క‌త్తి ప‌ట్టిన దీప‌..,.

గౌత‌మ్ అన్న మాట‌ల గుర్తొచ్చి కోపం కంట్రోల్ చేసుకోలేక‌పోతుంది. ఆ కోపాన్ని కూర‌గాయ‌ల‌పై చూపిస్తుంది. ఏంటిది క‌త్తి ప‌ట్టుకొని కూర‌గాయ‌ల‌తో యుద్ధం చేస్తున్నావ‌ని దీప‌ను అడుగుతాడు కార్తీక్‌. గౌత‌మ్ ఇంట్లో జ‌రిగిన గొడ‌వ గురించి కార్తీక్‌తో చెబుతుంది దీప‌. పెద్దింటి అబ్బాయి అయిన గౌత‌మ్ పేదింటి అమ్మాయిని మోసం చేసి బేరాలు పెట్టాడ‌ని అంటుంది.

గౌత‌మ్‌పై కేసు పెట్టాల‌ని అనుకున్నాన‌ని, కానీ ఆ అమ్మాయి త‌ల్లిదండ్రులు వ‌ద్ద‌న్నార‌ని చెబుతుంది. డ‌బ్బు ఉంటే ఏదైనా చేయ‌చ్చా..ఆడ‌పిల్ల‌ల మానాల‌తో ఆడుకోవ‌చ్చా? అమ్మ క‌డుపుకు ఖ‌రీదు క‌ట్టాచ్చా అని కోపంగా దీప అంటుంది. మీలాంటి మ‌నిషి తోడు దొరికితే లోకంలో ఏ ఆడ‌ది క‌న్నీళ్లు పెట్టుకునే అవ‌కాశం రాద‌ని కార్తీక్‌తో అంటుంది.

గుడ్ న్యూస్‌…బ్యాడ్ న్యూస్‌…

పెద్ద కంపెనీ నుంచి క్యాట‌రింగ్ కాంట్రాక్ట్ వ‌చ్చిన సంగ‌తి దీప‌కు చెబుతాడు. ఇందులో గుడ్‌న్యూస్‌తో పాటు ఓ బ్యాడ్ న్యూస్ ఉంద‌ని కార్తీక్ అంటాడు. ఇదివ‌ర‌కు ఆ కంపెనీ క్యాట‌రింగ్ కాంట్రాక్ట్ జ్యోత్స్న కంపెనీ చూసుకునేద‌ని దీప‌తో చెబుతాడు. మ‌న హోట‌ల్ ఫుడ్ న‌చ్చి వెతుక్కుంటూ రెస్టారెంట్‌కు వ‌చ్చార‌ని, కంపెనీ వాళ్ల ఆఫ‌ర్ న‌చ్చ‌డంతో కాంట్రాక్ట్‌పై సంత‌కం చేశాన‌ని కార్తీక్ అంటాడు.

తాత మాత్రం వాళ్లను ఓడించ‌డానికే కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకున్నాన‌ని ఈ పాటికి ఇంట్లో ర‌చ్చ చేస్తుంటాడ‌ని కార్తీక్ అనుకుంటాడు.

త‌ప్పు చేశా…

కార్తీక్ ఊహించిన‌ట్లే జ్యోత్స్న వ‌ల్లే కాంట్రాక్ట్ చేజారింద‌ని అరుస్తాడు శివ‌న్నారాయ‌ణ‌. మేనేజ్‌మెంట్ చేత‌కానీ నీకు రెస్టారెంట్ బాధ్య‌త‌లు అప్ప‌గించి త‌ప్పు చేశాన‌ని అంటాడు. నువ్వు అస‌లు సీఈవో వేనా అని నిల‌దీస్తాడు. నేను ఇంత‌కంటే పెద్ద ఆర్డ‌ర్ తీసుకొస్తాన‌ని జ్యోత్స్న స‌ర్ధిచెప్ప‌బోతుంది. కానీ ఆమె మాట‌ల‌ను శివ‌న్నారాయ‌ణ ప‌ట్టించుకోడు. దీప ఏదో ఒక‌టి చేసి కాంట్రాక్ట్ త‌మ సొంతం చేసుకుంద‌ని పారిజాతం అంటుంది.

ఐదో త‌ర‌గ‌తి చేసిన దీప అంత చేస్తే ఫారిన్‌లో చ‌దువుకున్న జ్యోత్స్న ఇంకెంత చేయాల‌ని శివ‌న్నారాయ‌ణ బ‌దులిస్తాడు. దీప‌వి నాటు తెలివితేట‌లు అని దాని దెబ్బ‌కు జ్యోత్స్న చిత్తైపోతుంద‌ని పారిజాతం అంటుంది. చివ‌ర‌కు నువ్వు దీప‌తో పోటీప‌డ‌లేవ‌ని ప్రియ‌మైన గ్రానీ కూడా అంటుంద‌ని శివ‌న్నారాయ‌ణ కోపంగా అంటాడు.

నేను ఓడిపోయిన‌ట్లే…

ఇలాగే జ‌రిగితే కార్తీక్ గెలుస్తాడు. నేను ఓడిపోతాన‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయిన‌ట్లేన‌ని తాత‌తో అంటుంది జ్యోత్స్న‌. వాళ్లు చీట్ చేస్తున్నార‌ని కార్తీక్‌, దీప‌పై త‌ప్పు నెట్టేయ‌బోతుంది జ్యోత్స్న. మార్కెట్‌లో మంచి క్వాలిటీతో ఫుడ్ అందించేవాళ్ల‌కే ఆర్డ‌ర్స్ వ‌స్తాయ‌ని ద‌శ‌ర‌థ్ అంటాడు. అర్థం ప‌ర్థం లేని కొత్త వంట‌లు ట్రై చేయ‌మ‌ని నువ్వు చెప్ప‌డం వ‌ల్ల మ‌న రెస్టారెంట్ క్వాలిటీ ప‌డిపోయింద‌ని ద‌శ‌ర‌థ్ కూడా జ్యోత్స్న‌నే త‌ప్పు ప‌డ‌తాడు. పోయిన ఆర్డ‌ర్స్ తాను తిరిగొచ్చేలా చేస్తాన‌ని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది. అది నీ వ‌ల్ల కాద‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు.

రెస్టారెంట్ బాధ్య‌త‌లు గోవిందా…

జ్యోత్స్న‌ను రెస్టారెంట్ బాధ్య‌తల నుంచి త‌ప్పించి ద‌శ‌ర‌థ్‌కు అప్ప‌గిస్తాడు. నువ్వు న‌మ్మ‌కాన్ని పొగొట్టుకున్నావ‌ని, నేను నిన్ను న‌మ్మ‌న‌ని జ్యోత్స్న‌తో అంటాడు. నాకు ఓ రెండు రోజులు టైమ్ ఇవ్వ‌మ‌ని, పూర్తి చేయాల్సిన వ‌ర్క్ బ్యాలెన్స్‌గా ఉంద‌ని జ్యోత్స్న బ‌తిమిలాడుతుంది. ఒక్క రోజే టైమ్ ఇస్తాడు ద‌శ‌ర‌థ్‌.

సుమిత్ర స‌పోర్ట్‌…

నీ మీద ఇప్పుడు నాకు పూర్తి న‌మ్మ‌కం క‌లిగింద‌ని, నిన్ను నేను న‌మ్ముతున్నాన‌ని కూతురితో స‌పోర్ట్ చేస్తుంది సుమిత్ర‌. మంచిత‌నంతో అవ‌స‌రం లేని ప్రేమ‌ను పెంచుకొని మోస‌పోతున్నావ‌ని సుమిత్ర అంటుంది. అన్ని ఇక్క‌డితో ఆపేసి కొత్త జీవితం మొద‌లుపెట్ట‌మ‌ని, అప్పుడు నిన్ను ఎవరూ ఓడించ‌లేర‌ని స‌ల‌హా ఇస్తుంది. త‌ల్లి మాట‌ల‌తోజ్యోత్స్న సంతోష‌ప‌డుతుంది.

నీ న‌మ్మ‌కాన్ని, తాత న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని చెబుతుంది. దీప దారిలోనే వెళ్లి ఆమెను ఓడించాల‌ని ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న‌. స‌త్య‌రాజ్ రెస్టారెంట్‌కు చెక్ పెడ‌తాన‌ని పారిజాతంతో చెబుతుంది. మ‌ళ్లీ జ్యోత్స్న ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోన‌ని పారిజాతం భ‌య‌ప‌డుతుంది.

దీప ఫుడ్‌లో విషం…

విజ‌య్ కంపెనీకి పంపించాల్సిన ఫుడ్‌ను కార్తీక్ అరెంజ్ చేస్తుంటాడు. మీరు ప‌నిచేయ‌ద్ద‌ని కార్తీక్‌కు ఆర్డ‌ర్ వేస్తుంది దీప‌. గ‌ట్టిగా స‌మాధానం చెప్ప‌డంతో చూపులే కాదు మాట‌లు అంత‌కంటే గ‌ట్టిగా త‌గులుతున్నాయిన కార్తీక్ అంటాడు. విజ‌య్ రెస్టారెంట్‌కు పంపిస్తున్న ఫుడ్‌లో దీప రెస్టారెంట్‌లో ప‌నిచేసే వినోద్ విషం క‌లుపుతాడు. జ్యోత్స్న‌నే అత‌డితో ఈ ప‌ని చేయిస్తుంది.

క‌నిపెట్టిన దీప‌…

విషం క‌లిపిన విష‌యం జ్యోత్స్న‌కు ఫోన్ చెబుతాడు వినోద్‌. అక్క‌డ ఏం జ‌రుగుతుందో చూడ‌టానికి కంపెనీకి జ్యోత్స్న‌ను ర‌మ్మ‌ని చెప్పి ఫోన్ క‌ట్ చేస్తాడు. వెన‌క్కి తిర‌గ‌గానే దీప క‌నిపించ‌డంతో అత‌డు త‌డ‌బ‌డిపోతాడు. మీ వంట‌ల గొప్ప‌త‌నాన్ని మా సిస్ట‌ర్‌కు చెబుతున్నాన‌ని, మీ వంట‌ల‌కు నేను పెద్ద ఫ్యాన్‌ను అంటూ మాట మార్చేస్తాడు వినోద్‌.

పోలీస్ స్టేష‌న్‌కు దీప‌, కార్తీక్‌…

ఫుడ్‌ను వ‌డ్డించ‌డానికి సిద్ధం చేస్తుంటుంది దీప‌. వ‌డ్డించే ముందు ఫుడ్ టేస్ట్ చూస్తుంది. ఎంప్లాయిస్ రావ‌డంతో అంద‌రికి వ‌డ్డిస్తుంది దీప‌. విషం క‌లిపిన అన్నం తిన్న ఎంప్లాయ్ ప‌రిస్థితిని చూడాల‌ని అక్కడికి వ‌స్తుంది జ్యోత్స్న‌. కార్తీక్‌, దీప‌ల‌కు క‌నిపించ‌కుండా దాక్కుంటుంది. ఈ ఫుడ్ తిన్న అంద‌రూ హాస్పిట‌ల్ పాల‌వుతార‌ని, దీప‌, కార్తీక్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ‌తార‌ని జ్యోత్స్న అనుకుంటుంది. అక్క‌డితో నేటి కార్తీక దీపం 2 సీరియ‌ల్ ముగిసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024