



Best Web Hosting Provider In India 2024

Diabetes and Walking: నడుస్తున్నప్పుడు ఈ 4 లక్షణాలు కనిపిస్తే మీకు డయాబెటిస్ వచ్చిందని అనుమానించాల్సిందే
Diabetes and Walking: డయాబెటిస్ ప్రమాదకరమైన వ్యాధి. వచ్చిందంటే శరీరంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కొన్ని రకాల లక్షణాల ద్వారా దీన్ని పసిగట్టవచ్చు.

డయాబెటిస్ అనేది శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత వల్ల కలిగే ఒక ఆరోగ్య సమస్య. ఇది జీవితాంతం వెంటాడే వ్యాధి. దీనికి చికిత్స లేదు. కాబట్టి దీన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మందుల ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోగలము. కానీ పూర్తిగా నయం చేయలేము.
డయాబెటిస్ శరీరాన్ని నెమ్మదిగా ప్రభావితం చేయడం మొదలు పెడుతుంది. ప్రారంభ దశలో ఇది చూపించే లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ప్రారంభ దశలోనే ఈ లక్షణాలను గమనిస్తే వ్యాధి ముదరకముందే జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా నడక వంటి శారీరక శ్రమ చేస్తున్న సమయంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. నడుస్తున్నప్పుడు నాలుగు రకాల డయాబెటిస్ హెచ్చరిక సంకేతాలు కనిపించే అవకాశం ఉంది.
బలహీనంగా అనిపించడం
మధుమేహం ప్రారంభ దశలో ఉన్నవారికి అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ సాధారణ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీర కణాలు శక్తి కోసం గ్లూకోజ్ ను ఉపయోగించుకోలేవు. శరీరానికి తగినంత శక్తి కూడా లభించదు. దీనివల్ల ఆ వ్యక్తికి రోజంతా అలసిపోయినట్లే అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు ఈ అలసట మరింత పెరుగుతుంది. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఎక్కువ శక్తి అవసరం పడుతుంది. కొద్ది దూరం నడిస్తే చాలు… తీవ్ర అలసటగా బలహీనంగా అనిపిస్తుంది. దీన్ని డయాబెటిస్ సంకేతంగా భావించాలి.
కాళ్లల్లో తిమ్మిరి
డయాబెటిస్ వచ్చిందంటే నరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అందుకే డయాబెటిస్ ఉన్న వారిలో కాలంలో నొప్పి, జలదరింపులు, తిమ్మిరి వంటివి అధికంగా వస్తూ ఉంటాయి. మీరు నడుస్తున్నప్పుడు పాదాలపై ఒత్తిడి కలుగుతుంది. అలాంటప్పుడు కాళ్లలో నొప్పి, అసౌకర్యం ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది డయాబెటిస్ లక్షణం గానే భావించాలి.
శ్వాస ఆడడంలో ఇబ్బంది
డయాబెటిక్ పేషెంట్లలో శ్వాస ఆడక పోవడం అనేది తరచూ కనిపించే సమస్య. ఒక వ్యక్తి నడిచేటప్పుడు లేదా ఏదైనా శారీరక శ్రమ చేసేటప్పుడు ఈ సమస్య మరింతగా పెరిగిపోతుంది. డయాబెటిస్ గుండె, ఊపిరితిత్తులపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కొద్ది దూరం నడిచిన తర్వాత ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది. దీన్ని కూడా డయాబెటిస్ సంకేతంగా భావించి వైద్యులను కలిసి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కాళ్ళల్లో వాపు
డయాబెటిస్ వల్ల పాదాలకు రక్తప్రసరణ సరిగా అవ్వదు. అప్పుడు పాదాలలో వాపు కనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు కాళ్లపై ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి వల్ల పాదాలలో వాపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ కారణంగా మూత్రపిండాల పనితీరు కూడా ఎంతో ప్రభావితం అవుతుంది. దీనివల్ల శరీరంలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అందుకే పాదాలు వాచినట్టు కనిపించేలా చేస్తుంది. మీ పాదాలకి ఎలాంటి గాయాలు కనపడకపోయినా వాచినట్టు ఉంటే అది మధుమేహం లక్షణంగానే భావించాలి.
మీరు నడుస్తున్నప్పుడు పైన చెప్పిన నాలుగు లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా కూడా తేలికగా తీసుకోకండి. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స చేస్తే వ్యాధి ముందే అదుపులో ఉంచుకోవచ్చు.
సంబంధిత కథనం