



Best Web Hosting Provider In India 2024
Gukesh in Tirumala: తిరుమలలో ప్రపంచ చెస్ ఛాంపియన్.. స్వామివారికి తలనీలాలు.. గుండుతో గుకేశ్
Gukesh in Tirumala: ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వేంకటేశ్వరుని సన్నిధిలో సమయం గడిపాడు. మొక్కుగా తలనీలాలు సమర్పించాడు.

ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని ఈ ప్రముఖ పుణ్యక్షేత్రానికి వచ్చాడు. దర్శనానంతరం స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నాడు. తెలుగు మూలాలున్న గుకేశ్ కుటుంబం చెన్నైలో సెటిల్ అయింది.
గెలిచినప్పటి మొక్కు
గతేడాది సింగపూర్ లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో గుకేశ్ విజేతగా నిలిచాడు. చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ ను గుకేశ్ ఓడించాడు. అత్యంత పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ టోర్నీలో విజయం తర్వాత తిరుమలకు రావాలని 18 ఏళ్ల గుకేశ్ అనుకున్నాడు. ఇప్పటికీ కుదిరింది.
భారత నంబర్ వన్
చెస్ బోర్డుపై సంచలన విజయాలతో సాగుతున్న గుకేశ్ భారత నంబర్ వన్ ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచ ఫిడే ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మాగ్నస్ కార్ల్ సన్, హికారు నకముర తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇటీవల టాటా మాస్టర్స్ చెస్ టోర్నీలో టైబ్రేక్ లో ఓడిన గుకేశ్ రెండో స్థానంలో నిలిచాడు. కానీ ఆ తర్వాత వీసెన్హాస్ ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ పోటీల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఒక్క విక్టరీ సాధించలేకపోయాడు.
సంతోషంలో గుకేశ్
‘‘గత ఏడాది డిసెంబర్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ విజయం తర్వాత ఆలయానికి రావాలనుకున్నా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మంచి దర్శనం లభించింది. నేను నిలకడగా రాణిస్తూనే ఉండాలి. కష్టపడుతూనే ఉండాలి. 2025లో చాలా ముఖ్యమైన టోర్నమెంట్లు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లలో మెరుగవ్వాలని కోరుకుంటున్నా’’ అని తిరుమలలో గుకేశ్ పేర్కొన్నాడు.
ఆ విజయంతో
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ లో విజయంతో గుకేశ్ కెరీర్ బిగ్ టర్న్ తీసుకుంది. ఫైనాన్షియల్ గానూ అతని ఫ్యామిలీ సెట్ అయింది. అంతకుముందు గుకేశ్ తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు.
‘‘విదేశాల్లో టోర్నమెంట్లు ఆడేందుకు నా తల్లిదండ్రుల స్నేహితులు స్పాన్సర్ చేయడం నాకు గుర్తుంది. ఆ సమయంలో అది చాలా కష్టంగా అనిపించింది. నిస్వార్థ వ్యక్తుల నుంచి మాకు సాయం దొరికింది. కానీ ఇకపై నా తల్లిదండ్రులు డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. మునుపటిలా కష్టపడకుండా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు’ అని గుకేశ్ ఇటీవల తెలిపాడు.
సంబంధిత కథనం
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link