






Best Web Hosting Provider In India 2024

Dilruba Review: దిల్ రూబా రివ్యూ – కిరణ్ అబ్బవరం యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?
Dilruba Review: కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ హీరోహీరోయిన్లుగా నటించిన దిల్ రూబా మూవీ మార్చి 14న థియేటర్లలో రిలీజైంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

Dilruba Review: క బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూవీ దిల్‌రూబా. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహించాడు. రుక్సర్ థిల్లాన్, నజియా హీరోయిన్లుగా నటించారు. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో దిల్ రూబా పైనే ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీతో కిరణ్ అబ్బవరానికి మరో హిట్ దక్కిందా? దిల్ రుబా యూత్ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
సిద్ధు, అంజలి ప్రేమకథ…
సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు (కిరణ్ అబ్బవరం) జీవితంలో కొన్ని ఎదురుదెబ్బలు తగులుతాయి. ప్రాణంగా ప్రేమించిన మ్యాగీ అతడికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. తండ్రిని స్నేహితుడు మోసం చేస్తాడు. దాంతో ఎవరికి సారీ, థాంక్యూ చెప్పకూడదని ఫిక్సవుతాడు సిద్ధు. తన జీవితంలో ప్రేమ అన్న పదానికి చోటు లేకుండా బతకేయాలని నిర్ణయించుకుంటాడు.
అనుకోకుండా సిద్ధు జీవితంలోకి అంజలి (రుక్సర్ థిల్లాన్) వస్తుంది. ప్రేమించమని వెంటపడుతుంది. తొలుత అంజలి ప్రేమను తిరస్కరించిన సిద్ధు ఆ తర్వాత అమెకు ఫ్లాటైపోతాడు. విక్కీతో జరిగిన ఓ గొడవ కారణంగా సారీ అనే చిన్న మాట చెప్పడానికి సిద్ధు ఒప్పుకోకపోవడంతో అంజలి అతడికి దూరమవుతుంది.
అదే టైమ్‌లో సిద్ధార్థ్‌ను వెతుక్కుంటూ అతడి మాజీ ప్రియురాలు మ్యాగీ అమెరికా నుంచి ఇండియా వస్తుంది. సిద్ధు, అంజలి విడిపోవడానికి కారణం ఏమిటి? సిద్ధును కాదని మరో పెళ్లి చేసుకున్న మ్యాగీ మళ్లీ అతడి లైఫ్‌లోకి ఎందుకు ఎంటరైంది? జోకర్ (జాన్ విజయ్), విక్కీలతో సిద్ధుకు ఉన్న గొడవలు అతడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? అన్నదే దిల్ రుబా కథ.
మాజీ ప్రియురాలు…
సాధారణంగా ప్రేమకథా చిత్రాల్లో హీరోహీరోయిన్లు విడిపోతే…ఆ జంట మధ్య అపార్థాలను తొలగించి స్నేహితులు, కుటుంబసభ్యులో కలపడం కామన్. కానీ మాజీ ప్రేయసి..తాను బ్రేకప్ చెప్పిన యువకుడి లవ్‌స్టోరీని సక్సెస్ చేయడం అనే పాయింట్ మాత్రం కొత్తగా ఉంది. అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాతోనే దర్శకుడు విశ్వ కరుణ్ దిల్‌రుబా సినిమాను తెరకెక్కించాడు.
నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా…
హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్లను భిన్నంగా రాసుకున్నాడు దర్శకుడు. జీవితంలో జరిగిన విషాదాలతో మొరటోడుగా మారిపోయిన హీరో….టామ్‌బాయ్ లాంటి హీరోయిన్…వారి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో అన్నది నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా చూపించాడు. మ్యాగీతో సిద్ధార్థ్ లవ్ స్టోరీ…బ్రేకప్…ఆ తర్వాత అంజలి అతడి ప్రేమాయణం..కాలేజీ గొడవలతో ఫస్ట్ హాఫ్ ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా సినిమా సాగిపోతుంది. కాలేజీ లవ్ ట్రాక్‌ను బోల్డ్‌గా చూపించాడు. విక్కీ సిద్ధార్థ్ గొడవలు యాక్షన్ ఎపిసోడ్ యూత్ ఆడియెన్స్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ ఆకట్టుకుంటుంది.
సెకండాఫ్ మ్యాజిక్…
అంజలి, సిద్ధార్థ్ విడిపోవడం, వారికి కలపడానికి మ్యాగీ ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌లో ఏదో మ్యాజిక్ ఉండబోతుందనే క్యూరియాసిటీ కలుగుతుంది. కానీ కీలకమైన సెకండాఫ్‌లో డ్రామా అంతగా పండలేదు. తన కుటుంబానికి నష్టం కలిగించిన విలన్‌పై హీరో రివేంజ్ తీర్చుకోవాలనుకునే సీన్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. క్లైమాక్స్‌లో ఫైట్‌ను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది.
అగ్రెసివ్‌గా…
ఇప్పటివరకు ఎక్కువగా పక్కింటి కుర్రాడు, సాఫ్ట్‌బాయ్ తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపించాడు కిరణ్ అబ్బవరం. ఈ మూవీలో మాత్రం ఫుల్ అగ్రెసివ్‌గా కనిపించాడు. అతడి బాడీలాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉన్నాయి. రుక్సార్ థిల్లన్ క్యారెక్టరైషన్ వైవిధ్యంగా అనిపిస్తుంది. చాలా హుషారుగా కనిపించింది. నజియా నటన ఓకే. సత్య కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తుంది. సామ్ సీఎస్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. యాక్షన్ సీక్వెన్స్‌లకు అతడి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
ట్రెండీ లవ్ స్టోరీ…
దిల్ రూబా ట్రెండీ లవ్‌స్టోరీ. యూత్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. కొత్త ప్రేమకథ చూస్తున్నామనే ఫీలింగ్‌తో థియేటర్‌లో అడుగుపెడితే మాత్రం డిసపాయింట్ అవుతారు.
రేటింగ్:2.75/5
సంబంధిత కథనం