



Best Web Hosting Provider In India 2024
TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు ‘స్మార్ట్’ గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్.. గ్రీన్ కలర్‌లో ఏపీఎల్!
TG New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులను జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో రేషన్ కార్డులు రెండు రకాలుగా ఉంటాయని.. పౌరసరఫరాలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు.. ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు ట్రైకలర్‌లో బీపీఎల్ కార్డులను, గ్రీన్ కలర్‌లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు.
ఏప్రిల్ నుంచి..
తెలంగాణలో 2.8 కోట్ల మంది రేషన్‌కార్డుల లబ్ధిదారులుగా ఇప్పటికే ఉన్నారని.. మంత్రి ఉత్తమ్ చెప్పారు. అర్హులందరికీ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇస్తుందని స్పష్టం చేశారు. కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచామని.. ఆ ప్రక్రియ నెలాఖరులోగా అయిపోతుందని వివరించారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఏప్రిల్‌లో ఉండొచ్చని చెప్పారు.
అందరికీ స్మార్ట్ కార్డులు..
కొత్త వారితోపాటు ఇప్పటికే కార్డులున్న వారికి కూడా.. స్మార్ట్‌కార్డులు జారీ చేయబోతున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. గతంలో పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు, తెల్ల కార్డు ఉన్నవారికి ట్రైకలర్ కార్డులు వస్తాయని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
దరఖాస్తుల స్వీకరణ..
కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామాల్లో గ్రామ సభలు, నగరాల్లో అయితే బస్తీ సభలు నిర్వహించి.. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని డిజిటలైజేషన్ చేసి.. కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు కోసం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలు లోపు వార్షికాదాయం ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది.
పేరు నమోదు, తొలగింపు కోసం..
దరఖాస్తుదారుల ఆధార్ కార్డులతో కొత్త వాటికి అప్లై చేసుకోవచ్చు. వివాహం జరిగిన మహిళలు తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో తమ పేరు తొలగించుకోవాలంటే.. తెల్ల కాగితంపై స్థానిక తహసీల్దారుకు అభ్యర్ధన పెట్టాలి. అత్తారింట్లో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నామని, పేరు తొలగించాలని రాస్తే సరిపోతుంది. వివాహం జరిగి ధ్రువీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికను జత చేయాలి. దరఖాస్తు స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకోవడానికి.. ఈపీడీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
టాపిక్